బాబు డైరెక్షన్‌.. కిరణ్‌ యాక్షన్

హైదరాబాద్, 25 మే 2013:

చంద్రబాబు నాయుడు ఆడమన్నట్టల్లా కాంగ్రెస్‌ నాయకులు ఆడుతున్నారని, పాడమన్నట్టల్లా పాడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బి. గురునాథరెడ్డి విమర్శించారు. విలువైన ఖనిజ నిక్షేపాలున్న ఓబుళాపురం గనులను ప్రభుత్వ రంగ సంస్థ ఎపి మినరల్సుకు కాకుండా ప్రవేటు సంస్థ ఎస్‌ఆర్ మినరల్సుకు కేటాయిచడంతో చంద్రబాబు మార్గనిర్దేశనంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదని స్సష్టం అవుతోందని గురునాథరెడ్డి ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎపి మినరల్సుకు ఈ గనులను కేటాయించారని, అయితే ఆ కేటాయింపును రద్దుచేసి ప్రైవేటు సంస్థకు కట్టబెట్టడానికి ముట్టిన ముడుపులెంతో వెల్లడించాలని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డిని ఆయన డిమాండ్‌ చేశారు. శనివారం ఉదయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గురునాథరెడ్డి మాట్లాడారు.

కేవలం అటవీ శాఖ అనుమతులు లేవన్న సాకు చూపించి ఎంపిఎండిసికి కేటాయించిన ఓబుళాపురం గనులను సిఎం రద్దు చేయడం వెనుక పూర్తిగా చంద్రబాబునాయుడి హస్తం ఉందని గురునాథరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను నీరుగార్చారని, ఆయన విధానాలనే ప్రస్తుత సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి కూడా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉనికిలోకి వచ్చిన టిడిపిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికే రక్షణ కవచంలా మార్చారన్నారు. మొన్నటి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో ఈ విషయం మరోసారి బాగా స్పష్టం అయిందన్నారు. ఈ చర్యల ద్వారా కాంగ్రెస్‌ - టిడిపిలు ఎంతగా కలిసిపోయాయో అర్థమవుతోందన్నారు.

రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, ముఖ్యంగా మంచినీటి సమస్యతో వారు అల్లాడిపోతున్నారన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యేలా చూడాల్సిన బాధ్యతను ప్రధాన ప్రతిపక్షం టిడిపి తుంగలో తొక్కేసిందని గురునాథరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పెద్దలతో కలిసి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరగనివ్వకుండా చంద్రబాబు మేనేజ్‌ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని పూర్తి నిరాధార ఆరోపణలతో నిర్బంధించి ఏడాది కాలంగా జైలులో నిర్బంధించారని గురునాథరెడ్డి నిప్పులు చెరిగారు.‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఎన్ని ఎక్కువ రోజులు జైలులో ఉంచాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శ్రీ జగన్‌ను జైలులో పెట్టి ఏడాది కావస్తున్నా చార్జిషీట్‌ కూడా వేయకుండా‌ సిబిఐని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నియంత్రిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

తాగునీటికి కూడా కటకటలాడే దుర్భిక్ష ప్రాంతమైన తమ అనంతపురం జిల్లాలో మెగా పవర్‌ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించిన వైనాన్ని గురునాథరెడ్డి తప్పుపట్టారు. జిల్లాలో ప్రజలకు తాగు, సాగు నీరు లేదని, మెగాపవర్ ప్రాజెక్టుకు మాత్రం పుష్కలంగా నీరు ఇస్తున్నారని చెప్పారు. ‌ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఎలా జరిగాయని ప్రశ్నించారు.  ఈ కేటాయింపులకు సిఎం కిరణ్‌రెడ్డికి, జిల్లా మంత్రులు, అధికారులకు ఎన్ని నిధులు ముట్టాయని ఆయన ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో నీటీ కటకట ఉన్నందున నీటి వినియోగంతో నడిచే ఏ ప్రాజెక్టులకూ అనుమతులు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. కేంద్రం ఆదేశాలను కూడా కిరణ్‌ ప్రభుత్వం బేఖాతరు చేసిందన్నారు.

స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న భయంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని వాయిదా వేస్తోందని గురునాథరెడ్డి విమర్శించారు. స్థానిక సమస్యలను ప్రజా ప్రతినిధులు పరిష్కరించలేని స్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలు జరిగితే తప్ప గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న సమస్యలు సమసిపోయే అవకాశం లేదని ప్రభుత్వం గ్రహించాలన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు ఇప్పటికైనా కుమ్మక్కు రాజకీయాలకు స్వస్థి పలకాలని గురునాథరెడ్డి సూచించారు. ప్రజామోద నాయకుడు శ్రీ జగన్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మరింతగా ప్రజాగ్రహానికి కాంగ్రెస్‌, టిడిపిలు గురికాక తప్పదని గురునాథరెడ్డి హెచ్చరించారు.

ఇంతకు ముందు అవిశ్వాస తీర్మానం సమయంలో టిడిపి తప్పించుకుని పారిపోయిందని గుర్నాథరెడ్డి ఆక్షేపించారు. ఇప్పటికైనా టిడిపి అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ తప్పకుండా మద్దతు ఇస్తుందని ఒక విలేకరి ప్రశ్నకు గురునాథరెడ్డి సమాధానం చెప్పారు.

Back to Top