బాబు బతుకంతా స్టేలు తెచ్చుకోవడమే

వికారాబాద్ (రంగారెడ్డి జిల్లా), 27 ఏప్రిల్‌ 2013: చంద్రబాబు జీవితం అంతా స్టేలు తెచ్చుకుని, చీకట్లో అన్ని వ్యవస్థలనూ మేనేజ్‌ చేసుకుని విచారణను తప్పించు‌కోవడమే అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అంతటి చరిత్రహీనుడైన ముఖ్యమంత్రి మరొకరు ఉండరని తీవ్రంగా విమర్శించారు. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడే అన్నారు. నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి అంటే కూడా గుర్తొచ్చేది చంద్రబాబే అన్నారు. అత్యంత అవినీతిపరుడైన, ధనవంతుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు అని తెహెల్కా డాట్‌ కామ్‌ 2002లోనే చెప్పిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి దమ్ముంటే ఉప ఎన్నికలు నిర్వహించాలని కిరణ్‌ ప్రభుత్వానికి ఆమె సవాల్‌ చేశారు. జగన్‌బాబును ఎంతకాలం జైలులో పెడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, టిడిపిలను జనం వెలివేసే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగసభను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

ఒక్క మంచిపని చేశానని బాబు చెప్పగలరా? :
తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఒక్క మంచి పని చేశానని చెప్పుకోగలరా? అని ప్రశ్నించారు. రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించి దేశం అంతా హెరిటేజ్‌లు పెట్టిన ఘనత ఆయనది అన్నారు. తన హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీసి మూసేసి వందల కోట్ల రూపాయల నష్టం తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఐఎంజీ, ఎమ్మార్‌, రహేజా లాంటి సంస్థలకు వేల కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాల భూములను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా అప్పనంగా అప్పగించిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని సుమారు 60 పరిశ్రమలను తన తాబేదార్లకు చవకగా కట్టబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. లాభాల్లో నడుస్తున్న కాకినాడ పోర్టు సహా పలు పోర్టులను టిడిపి వారికి కట్టబెట్టేశారని ఆరోపించారు. నామానాగేశ్వరరావు, సుజనా చౌదరి, సిఎం రమేష్‌, సత్యం రామలింగరాజు లాంటి వారెందరికో చంద్రబాబు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు నీతిమంతుడని ఏ కోర్టు తీర్పు చెప్పిందని శ్రీమతి విజయమ్మ సూటిగా ప్రశ్నించారు. మహానేత వైయస్‌ఆర్‌ను, శ్రీ జగన్మోహన్‌రెడ్డిని దోషులని ఏ కోర్టు చెప్పిందని నిలదీశారు. చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ పార్టీ కుమ్మక్కైపోయి జగన్‌బాబును 11 నెలలుగా జైలులో నిర్బంధించాయని నిప్పులు చెరిగారు. విచారణ పేరుతో శ్రీ జగన్‌ను ఇంకా ఎంతకాలం నిర్బంధిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును సిబిఐ, కాంగ్రెస్‌, టిడిపిలు కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం అమలవుతోందన్నారు. కాంగ్రెస్‌, టిడిపి కుట్రలను దేవుడు చూస్తున్నాడని ఆమె హెచ్చరించారు. ప్రజలంతా శ్రీ జగన్‌ పక్షాన ఉన్నారన్నారు.

దమ్ముంటే ఉప ఎన్నికలు నిర్వహించండి :
జగన్‌బాబును ఉరితీయాలని, మహానేత వైయస్‌ఆర్‌ కుటుంబాన్ని వెలివేయాలంటూ మాట్లాడుతున్న వారి ఆటలను ప్రజలే కట్టిస్తారని శ్రీమతి విజయమ్మ హెచ్చరించారు. కాంగ్రెస్‌, టిడిపిలనే ప్రజలు వెలివేస్తారని అన్నారు. దమ్ముంటే ఉప ఎన్నికలు నిర్వహించాలని, ప్రజలకు ఎవరి పట్ల అభిమానం ఉందో అప్పుడు తెలుస్తుందని సవాల్‌ చేశారు. ప్రజా కంటకంగా మారిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, ప్రజల సమస్యల పట్ల స్పందించని టిడిపికి జనం గుణపాఠం చెబుతారన్నారు. కిరణ్‌ ప్రభుత్వాన్ని ప్రతినిత్యం దూషించే చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో విప్‌ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టడమేమిటని ప్రశ్నించారు. ఎంతసేపూ ఎన్టీఆర్‌ పొగడడం తప్ప తన తొమ్మిదేళ్ళ పాలనను మళ్ళీ తెస్తానని చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు ఉన్నాయా? అని శ్రీమతి విజయమ్మ సవాల్‌ చేశారు. ఆడపిల్ల పుడితే రూ. 5 వేలు డిపాజిట్‌ చేస్తానని, మహిళలకు బంగారు మంగళసూత్రాలు, విద్యార్థినులకు సైకిళ్ళు ఇస్తానన్నారని, నగదు బదిలీ చేస్తానన్నారని, కలర్‌ టివిలు ఇస్తానన్నారని అవేమీ ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పుడు మళ్ళీ రుణ మాఫీ చేస్తానంటున్నారని ఇది కూడా పాత హామీల మాదిరిగాను కొండెక్కిస్తారని ఎద్దేవా చేశారు.

రైతన్నల అభిమానంపై బాబు దెబ్బ :
చంద్రబాబు హయాంలో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.  ఎనిమిదిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచిన చంద్రబాబు వాటిని చెల్లించలేకపోయిన రైతుల భార్యలను కూడా అవమానించారన్నారు. రైతుల అభిమానం మీద దారుణంగా దెబ్బకొట్టారని దుయ్యబట్టారు. మహిళలని కూడా చూడకుండా అంగన్‌వాడీ కార్యకర్తలు, టీచర్లను గుర్రాలతో తొక్కించారన్నారు. సంక్షేమ పథకాలు చేస్తే ప్రజలు సోమరిపోతులవుతారని అవమానించారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరుపేదలపైన కూడా యూజర్‌ చార్జీలు వసూలు చేసిన అత్యంత దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు. వెన్నుపోటు అన్నా, అవినీతిపరుడన్నా ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రబాబే అని శ్రీమతి విజయమ్మ నిప్పులు చెరిగారు.

ఎస్సీ, ఎస్టీలకు కిరణ్‌ చేసిందేమీ లేదు :
‌ఎస్సీ, ఎస్టీలకు ఏదో చేసేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న కిరణ్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. జనం బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆమె విమర్శించారు. వారికి ఏమి చేశారని కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక పక్కన వడ్డీలేని రుణాలిస్తామని చెబుతూ మరో పక్క రూపాయి వడ్డీ వసూలు చేయడమేమిటని ప్రశ్నించారు.‌ మహానేత వైయస్ఆర్‌ ప్రారంభించిన అభయ హస్తం పథకంలో కొత్తగా సభ్యులను చేర్పించని వైనాన్ని ఆమె గుర్తుచేశారు. అమ్మహస్తంలో ఇస్తున్న సరుకులు ఎంత మందికి ఎన్నాళ్ళకు సరిపోతాయని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు.

వర్షం హర్షాతిరేకం : వైయస్ ఆశీస్సులు :
ఈ సమయంలో బహిరంగ సభా ప్రాంగణలో ఒక్కసారిగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షానికి పులకించిన శ్రీమతి విజయమ్మ మాట్లాడుతూ, పై నుంచి మహానేత వైయస్‌, దేవుడు కూడా ఆశీర్వదిస్తున్నారన్నారు. సభ జరుగుతుండగా వర్షం పడడం శుభ సూచకం అన్నారు.

ప్రజల పక్షాన ఉంటాం: విజయమ్మ
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని శ్రీమతి విజయమ్మ తెలిపారు. కిరణ్ ‌ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమయిందని ఆమె విమర్శించారు. రంగారెడ్డి జిల్లాతో మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఏ కార్యక్రమమైనా రంగారెడ్డి జిల్లా నుంచే ఆయన మొదలుపెట్టేవారని తెలిపారు.  జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు కోసం వైయస్ ఎం‌తగానో తపించారన్నారు. తన పాలనలో వైయస్ పన్నులు పెంచలేదని గుర్తు చేశారు. ‌ఆ మహానేత పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని శ్రీమతి విజయమ్మ ఆరోపించారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదన్నారు. జనం బాధలు ఆయనకు పట్టడంలేదన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయి శ్రీ జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలను పరామర్శించడమే జగన్‌ బాబు తప్పదమా అన్నారు. చంద్రబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయడానికి సిబ్బంది లేరని సాకు చెప్పిన సిబిఐ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికి వచ్చిన మూడో రోజునే జగన్‌బాబు అస్తులపై దాడులు చేసిన వైనాన్నిఆమె ఎండగట్టారు.

పంటలకు ధరల స్థిరీకరణ కోసం జగన్‌బాబు రూ. 3 వేల కోట్లతో బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయిస్తానని చెప్పారన్నారు. మహిళల రక్షణ కోసం వెయ్యి మంది ఉన్న ఊరిలో పది మంది పోలీసులను నియమిస్తానని పార్టీ తొలి ప్లీనరీలోనే జగన్‌బాబు చెప్పారన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తారన్నారు. శ్రీ జగన్ నేతృత్వంలో రాజన్న రాజ్యం తెచ్చుకుందామని ప్రజలకు శ్రీమతి విజయమ్మ పిలుపునిచ్చారు. మైనార్టీలకు 4 % రిజర్వేషన్లు కల్పించిన మహానేత వైయస్‌ మాదిరిగానే శ్రీ జగన్మోహన్‌రెడ్డి కూడా మేలు చేస్తారన్నారు. జగన్‌బాబుకు ప్రజల ఆశీర్వాదం కావాలని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
Back to Top