బాబు అబద్ధాల ప్రచారం

అనంతపురం:

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడమే కాక  మీ కోసం వస్తున్నానంటూ నిర్వహిస్తున్న పాదయాత్రలో  అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి  సోదరి వైయస్ షర్మిల ధ్వజమెత్తారు. ప్రజలకు మేలు చేయడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఘోరంగా విఫలమైందనీ విమర్శించారు. నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఇలాంటి సర్కారుకు కొమ్ముకాస్తోందని ఎద్దేవా చేశారు.  ఇది చాలదన్నట్లు ఇప్పుడు చంద్రబాబు పాదయాత్రలో కొత్తగా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
ఆయన  హయాంలో గ్యాస్ ధర పెరగలేదని చంద్రబాబు అంటున్నారనడం దీనికి నిదర్శనమన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ తన ఆలోచనేలేనని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని చెప్పడం ప్రబల ఉదాహరణన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసి నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయనీ, ఇంత  అన్యాయ, ఘోర, నీచ రాజకీయాలు ప్రపంచంలో మరెక్కడా లేనేలేవనీ స్పష్టంచేశారు.  ఇంతకుముందూ లేవన్నారు. వారు పేరుకే పెద్ద మనుషులు... కానీ మనసులు చాలా చిన్నవని వ్యంగ్యోక్తి విసిరారు.  ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా వైయస్ జగన్ తరఫున ఈ యాత్ర చేపట్టిన షర్మిల బుధవారం వర్షంలోనూ ఆగకుండా పాదయాత్ర చేశారు.

Back to Top