బాబూ! శుష్క వాగ్దానాలతో ప్రజలను మోసగించద్దు

హైదరాబాద్ 29 ఏప్రిల్ 2013:

మీకోసం వస్తున్నా పాదయాత్రలో కొన్ని వేల వాగ్దానాలు చేసిన చంద్రబాబు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఒకసారి గుర్తుచేసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు.  పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు అవకాశముండీ వాగ్దానాలను ముఖ్యమంత్రి నెరవేర్చుకోలేదని గట్టు చెప్పారు. 1996 నుంచి 2004 వరకూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన వాగ్దానాలను మీకోసం వస్తున్నా పాదయాత్ర ముగింపు సభలో చెప్పి ఉంటే బాగుండి ఉండేదని అభిప్రాయపడ్డారు. పాదయాత్రలో చేసిన హామీలు అన్నీ ఉత్తిత్తివనీ, ఆచరణ సాద్యం కానివనీ, ఇలాంటి చర్యలతో ప్రజలను మరోసారి మోసగించవద్దనీ ఆయన చంద్రబాబుకు సూచించారు. లెక్కలేకుండా చేసిన వాగ్దానాలను ముందు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.


2009 ఎన్నికల తర్వాత ప్రతిపక్షనేత పాత్ర పోషించడంలో కూడా చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆయన మౌనమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఉత్తుత్తి హామీలతో ప్రజలను మరోసారి మోసగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన బాబు, ఆయన ప్రవేశపెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం, మద్య నిషేధాలను ఎత్తేసిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు. కిలో రెండు రూపాయల బియ్యం ధరను 5.25 రూపాయలకు పెంచారనీ అంతేకాక ఇచ్చే బియ్యం మొత్తాన్ని 20 నుంచి 16కు తగ్గించారనీ కూడా ఆయన జ్ఞాపకం చేశారు. పేద రైతుల మోటార్లకు హెచ్.పి.కి ఎన్టీఆర్ 50 రూపాయలు వసూలుచేస్తే చంద్రబాబు 620 రూపాయలకు పెంచిన విషయాన్ని కూడా గట్టు గుర్తుచేశారు.

బాలికలకు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యనందిస్తానని 199 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విషయాన్ని చెబుతూ.. అది ప్రకటనకే పరిమితమైందనీ, ఆ హామీ అమలుకు నోచలేదనీ ఎద్దేవా చేశారు. కోటి వరాలంటూ కోటి హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రజలను కోటిసార్లు మోసగించారని చెప్పారు.

వికలాంగులకు 75 రూపాయలన్న పింఛనును దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 500 రూపాయలకు పెంచారనీ, అలాగే మూడు శాతం రిజర్వేషన్లు కల్పించారనీ తెలిపారు. ఎన్టీరామారావు వికలాంగులకు 50 రూపాయల పింఛను ఇవ్వగా చంద్రబాబు తన తొమ్మిదేళ్ళ పాలనలో దానిని 75 రూపాయలకు అంటే కేవలం 25 రూపాయలు పెంచారని దుయ్యబట్టారు.

ఒక నియంతలా పాలించిన చంద్రబాబు, ఉద్యోగులలో అరవై శాతం మంది అవినీతి పరులేనని చెప్పారన్నారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని ఆయన రాసుకున్న 'మనసులో మాట' పుస్తకంలో ఉందన్నారు. చంద్రబాబు గత చరిత్ర తెలుసున్న వారెవరూ ఆయనను నమ్మరని స్పష్టంచేశారు. ప్రజలను మరోసారి మోసగించవద్దని గట్టు రామచంద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు.

Back to Top