'అవిశ్వాసం' పెట్టి నిజాయితీ రుజువు చేసుకోండి!


ఆదోని
 13 నవంబర్ 2012 : కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాలేదని రుజువు చేసుకునేందుకు చిత్తశుద్ధి ఉంటే కిరణ్ ప్రభుత్వంపై 'అవిశ్వాస తీర్మానం' పెట్టాలని షర్మిల తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారు. ఎంఐఎం మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో ఈ అసమర్థ ప్రభుత్వాన్ని కూలదోయడం ఇంకా సులభమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినందుకు ఆమె ఎంఐఎంను అభినందించారు.నిజానికి ఈ దుర్మార్గపు సర్కారును కాపాడుతున్నది చంద్రబాబునాయుడేనని ఆమె ఆరోపించారు. 27వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ఒక భారీ బహిరంగసభలో ప్రసంగించారు. 
ఆమె మాటల్లోనే...
"పాదయాత్ర అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు చేస్తున్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి చెప్పుకోదగ్గ ఏ మేలూ చేయని బాబు ఇప్పుడు మరోసారి అధికారం కోసం మొసలి కన్నీరు కారుస్తూ అబద్ధాల వాగ్దానాలు చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు చంద్రబాబుకు లేనిదీ రాజశేఖర్ రెడ్డిగారికి, జగనన్నకు ఉన్నదీ విశ్వసనీయత అని. నిజానికి చంద్రబాబు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదు. ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి వెంటనే దించేయడానికి కావలసినంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం బాబుకు ఉంది. కానీ ఆయన ఆ పని చేయరట. ఇప్పుడు ఎంఐఎం కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అందుకుగాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని అభినందిస్తోంది.ఇప్పుడు 'అవిశ్వాసం' పెడితే ఈ ప్రభుత్వాన్ని కూలదోయడం ఇంకా సులభం. కానీ చంద్రబాబు నాయుడు అవిశ్వాస పెట్టరట. అవిశ్వాసం పెట్టమని మేం ప్రతిరోజూ చంద్రబాబును అడుగుతూనే ఉన్నాం. నిలదీస్తూనే ఉన్నాం. కానీ పెట్టరట. పేరుకు ఇది సరిగా పని చేయని ప్రభుత్వమని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కానీ నిజానికి ఈ దుర్మార్గపు సర్కారును కాపాడుతున్నది చంద్రబాబునాయుడుగారే. ఈ రోజు ప్రధానప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌వారికి మిత్రపక్షంగా మారిపోయింది. కాంగ్రెస్, టిడిపిలు ఒకటై వీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. కుమ్మక్కు రాజకీయాలు చేయడం లేదంటున్న వారి మాటలు నిజమే అయితే, దానిని రుజువు చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాసం పెట్టమని తెలుగుదేశం పార్టీని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కానీ వారికి నిజాయితీ లేదు. వారికి చిత్తశుద్ధి అంతకంటే లేదు. వారు అవిశ్వాసం పెట్టరు. కాంగ్రెస్‌కు, టిడిపికి చేతనైందల్లా నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేయడం. వెన్నుపోట్లు పొడవడం. అబద్ధాలతో పబ్బం గడుపుకోవడం." అని షర్మిల నిప్పులు చెరిగారు.

"చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. ఒకసారి ఎన్టీఆర్ వల్ల అధికారంలోకి వచ్చాడు, ఇంకోసారి బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు తప్ప స్వయంగా కష్టపడి కాదు. తనని చూసి ఎవరూ ఓటేసింది లేదు. ఎన్టీఆర్ ప్రధాన వాగ్దానాలైన రెండు రూపాయల కిలో బియ్యం, మద్యనిషేధం పథకాలను చంద్రబాబు నిలబెట్టుకోలేక పోయాడు. మాట మీద నిలబడమన్నది చంద్రబాబు రక్తంలోనే లేదు. ప్రాజెక్టులు కట్టడం నష్టమనీ, వ్యవసాయం దండగనీ, సబ్సిడీలు ఇవ్వరాదనీ బాబు తన 'మనసులోమాట' పుస్తకంలో రాసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచారు. బకాయిలు కట్టమని ఒత్తిడి తెస్తే నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది మరచిపోవడానికి వీల్లేని విషయం." అని షర్మిల వ్యాఖ్యానించారు.
"జగనన్నను నీచ రాజకీయాలతో జైలు పాలు చేశారు. చంద్రబాబు మీద రిలయెన్స్ గ్యాస్ స్కామ్, ఐఎంజి స్కామ్, తెహల్కా ఆరోపణలు వంటివి ఎన్ని ఉన్నావిచారణ ఉండదు. కోర్టు మొట్టికాయలు వేసినా సిబిఐ సిబ్బంది లేదని తప్పించుకుంది. కానీ జగనన్న మీదైతే ఏకంగా 28 టీములతో దాడులు చేశారు. జగనన్న విషయంలో రెండు వేల మంది ఫోన్లను ట్యాప్ చేయడానికి సిబ్బంది ఉంది కానీ, చంద్రబాబు మీద విచారణకు సిబ్బంది లేదట. సిబిఐని వాడుకుని కాంగ్రెస్, టిడిపి నీచరాజకీయాలు చేస్తున్నాయి. జగనన్న ఏ తప్పూ చేయలేదు జగనన్నపై నేరారోపణలకు ఏ ఆధారమూ లేదు. కానీ జగనన్న ప్రజల పక్షాన పోరాడకుండా ఉండడానికీ, మీ మనసుల్లో స్థానం సంపాదించుకోకూడదని, అలా స్థానం కనుక సంపాదించుకుంటే తమకు ఇక మనుగడ అన్నదే ఉండదనీ జైలు పాలు చేశారు. కానీ జగనన్న బయటకు వచ్చి 'రాజన్న రాజ్యం' దిశగా మనల్ని నడిపిస్తాడు" అని ఆమె ధీమాగా అన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top