అవిశ్వాసం పెడతారా? లేదా? తేల్చండి!

హైదరాబాద్ 8 ఫిబ్రవరి 2013 : ప్రధానప్రతిపక్షంగా అవిశ్వాసం పెట్టవలసిన బాధ్యత టీడీపీదేనని, ఎక్కడైనా అవిశ్వాసం ప్రవేశపెట్టేది సాధారణంగా ప్రధాన ప్రతిపక్షమేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు జి. శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అసలు అవిశ్వాసం పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయో లేదో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పాలని ఆయన నిలదీశారు.
హైదరాబాద్‌లోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పరిస్థితులు అంతా బాగుంటే చంద్రబాబు ఎందుకు పాదయాత్ర చేస్తున్నట్లని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కు లేదని చెబుతూ అవిశ్వాసానికి మాత్రం వెనుకంజ వేయడం ఎవరిని మోసగించడానికని ఆయన నిగ్గదీశారు. దీనిపై చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తొమ్మిది మంది శాసనసభ్యులను బహిష్కరించామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం మైనారిటీలో పడినప్పటికీ అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టడం లేదో చంద్రబాబు చెప్పాలని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని కూలదోసే అవిశ్వాసమనే ఆయుధం దగ్గర పెట్టుకుని ఎందుకు పాదయాత్ర చేస్తున్నట్లు? అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అవిశ్వాసం పెట్టే బాధ్యత తనకు ఉందో లేదో అయినా చెప్పాలని చంద్రబాబును ఆయన కోరారు. అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసునని టీడీపీ నాయకులు అంటున్నారనీ, అది నిజమేననీ, ప్రభుత్వానికి బలం లేనప్పుడు కాకుండా బలం ఉన్నదని భావించినప్పుడే వాళ్లు అవిశ్వాసం పెడతారనీ శ్రీకాంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు.
చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యాకే ఇదివరకు చంద్రబాబు అవిశ్వాసం పెట్టారని ఆయన గుర్తు చేశారు. వస్తున్నా మీ కోసం అంటే కాంగ్రెస్ కోసం వస్తున్నానని చంద్రబాబు అసలు అంతరంగమని ఆయన ఎత్తిపొడిచారు. అవిశ్వాసం పెట్టబోనని చంద్రబాబు ప్రకటిస్తే తాము అవిశ్వాసం పెట్టే విషయం ఆలోచిస్తామని ఆయన చెప్పారు. గతంలో ప్రభుత్వం పడిపోదని తెలిసినా నా వంటివారు అనర్హత వేటుకు కూడా వెరవకుండా ఓటు వేశారని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా తాము అవిశ్వాసం పెడితే మళ్లీ అదే జరగవచ్చునని ఆయన వివరించారు. 
మంత్రులందరినీ కూర్చోబెట్టుకుని ముఖ్యమంత్రి సహకార ఎన్నికల్లో గెలిచామనీ, సత్తా చాటామనీ గొప్పలు పోయారనీ ఆయన విమర్శించారు. కరెంటు కోతలతో రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉంటే ఏ రకంగా రైతులు మీకు ఓటు వేశారనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మంత్రులకు బాధ్యతలు అప్పగించి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమ మార్గాలలో ఎన్నికలు జరిపించి ఇప్పుడు అదేదో తమ విజయమని చెప్పుకోవడం సిగ్గుచేటని శ్రీకాంత్ రెడ్డి దుయ్యబట్టారు. అవి కేవలం పరోక్ష ఎన్నికలని ఆయన గుర్తు చేశారు. Back to Top