అవగాహన, బాధ్యతా లేని మంత్రి తోట

హైదరాబాద్, 12 మార్చి 2013: ఏలేరు ఆధునికీకరణ మీద రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖల మంత్రి తోట నర్శింహానికి అవగాహన లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ అభివర్ణించారు. ఏలేరు ఆధునికీకరణ సాధన కోసం తమ పార్టీ చేయతలపెట్టిన పాదయాత్రపై నర్శింహం చేసిన అనుచిత వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అని ఆయన తెలిపారు. ఏలేరు ఆధునికీకరణ అంటే ఆ ప్రాంత ఆయకట్టుకు సరిపడిన నీటిని సక్రమంగా సరఫరా చేయడం, అక్కడి భూములు, గ్రామాలు ముంపునకు గురికాకుండా చూడాలన్న సదుద్దేశంతో కూడుకుని ఉన్నదన్నారు. ఏలేరు ఆధునికీకరణపై అమాత్యునికి అవగాహన కల్పించేందుకు జ్యోతుల నెహ్రూ మంగళవారం ఒక బహిరంగ లేఖ రాశారు.

ఏలేరు ప్రాంత రైతాంగానికి నీటి ఎద్దడి లేకుండా, వరద ముంపు రాకుండా పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయాలన్న ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ. 138 కోట్లు మంజూరు చేసిన వైనాన్ని గుర్తుంచుకోవాలని మంత్రి నర్శింహానికి నెహ్రూ ఆ లేఖలో తెలిపారు. అయితే, మహానేత ప్రతిపాదనలను పక్కన పెట్టి, కేవలం ఏలేరు నదిలో క్రాస్‌ రెగ్యులేటర్లు నిర్మించి పూర్తిస్థాయిలో ఆధునికీకరణ చేశామంటూ చేతులు దులుపుకోవడం మంత్రి బాధ్యతా రాహిత్యానికి, అనాలోచిత విధానానికి నిదర్శనం కాదా అని నిలదీశారు. ఇలాంటి చర్యల ద్వారా ఏలేరు ప్రాంత రైతులను నిలువునా మోసం చేస్తున్నారని నెహ్రూ విమర్శించారు. ఏలేరు చివరి ఆయకట్టులోని భూములు నీటి ఎద్దడితో గాని, వరదలు వచ్చినప్పుడు ముంపుతో గాని పంటలు నష్టపోతున్నాయన్నారు. ఇలాంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా మహానేత రాజశేఖరరెడ్డి నక్కలగండి, సుద్దగడ్డ, ఏలేరు వాగులను సమన్వయం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారన్నారు. అలాంటి అవసరం ఉందని మంత్రి తోటకు అవగాహన లేదని ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందన్నారు.

ఏలేరు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉన్నా ఈ ఆధునికీకరణకు ప్రస్తుతం పెరిగిన ఎస్‌ఎస్ఆర్‌ రేట్ల ప్రకారం, సాంకేతిక నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి బడ్జెట్‌లో కనీసం రూ. 258 కోట్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకోవాలని మంత్రి తోట నర్శింహాన్ని నెహ్రూ డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్థి పలికి ఏలేరు ప్రాంత రైతుల అవసరాలను తీర్చేందుకు దాని ఆధునికీకరణపై ఈ నెల 21వ తేదీ లోపు ప్రభుత్వం ద్వారా అసెంబ్లీలో ప్రకటన చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశం మంత్రికి ఇచ్చేందుకు తాము ఈ నెల 13 నుంచి చేయాలనుకున్న పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు ఆ లేఖలో నెహ్రూ పేర్కొన్నారు.

ఏలేరు ఆధునికీకరణపై 21వ తేదీ లోగా మంత్రి ప్రకటన చేయించడంలో విఫలమైతే 22 వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని నెహ్రూ తెలిపారు. ఏలేరు ఆయకట్టు రైతుల అవసరాలు తీర్చేందుకు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
Back to Top