అవాస్తవాలే ఆలంబనగా ఆరోపణలు

హైదరాబాద్, 30 మార్చి 2013:

ప్రభుత్వ యంత్రాంగాలను అడ్డుపెట్టుకుని యూపీఏ అధికారంలో కొనసాగుతోందని  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన పార్టీ నేతలు కేకే మహేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల పార్లమెంటులో కాంగ్రెసేతర పక్షాలు సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్సించాలని సూచించిన అంశాన్ని కొణతాల గుర్తుచేశారు. ఇడీ, డైరెక్టు టాక్సెస్ విభాగాలను రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికి వినియోగిస్తున్నారని అన్నా హజారే కూడా ఆరోపించారని చెప్పారు. డీఎంకె అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్, ములాయంసింగ్ యాదవ్ లపై సీబీఐని ఉపయోగించిన తీరును ఆయన ఉదహరించారు. రాష్ట్రంలో పరిస్థితి ఎప్పుడూ ఇంత దిగజారలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

బాబు సేవియర్ ఆఫ్ కాంగ్రెస్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని సేవియర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అన్న నేతలే ఇప్పుడు శ్రీ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. స్వతంత్ర సమర యోధులు స్థాపించిన పత్రిక, మరొక చానెల్ జగన్మోహన్ రెడ్డిగారు బయటకు రారనీ, ఢిల్లీ తీసుకెళ్ళిపోతారనీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. దానికి కిరణ్ పత్రికనీ, కిరణ్ న్యూస్ అనీ పేరు మార్చుకుంటే మంచిదని సూచించారు. భయానక పరిస్థితులను సృష్టించేందుకు ఆ రెండు ప్రయత్నిస్తున్నాయన్నారు. మేం పిలవకుండానే నలబైనుంచి యాబై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారనీ, వారిలో భయాన్ని సృష్టించి ఆపేందుకే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారనీ కొణతాల వివరించారు. కాంగ్రెస్ నాయకత్వం మీద వారు విశ్వాసాన్ని కోల్పోయారనీ, న్యాయం జరగదని వారు భావిస్తున్నారనీ చెప్పారు. అభద్రతా భావంతోనే సీఎం ఇటువంటి ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధినేత ఈరోజు సేవియర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీగా వర్థిల్లుతున్నారని చెప్పారు. అందుకే చంద్రబాబు అనరాని మాటలతో కాంగ్రెస్ నేతలను దూషిస్తున్నప్పటికీ చలించడం లేదన్నారు. ధర్మో రక్షతి రక్షితః మాదిరిగా చంద్రబాబు కాంగ్రెసో రక్షతి రక్షితః నినాదాన్ని జపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం పూర్తి కాలం ఉండాలని ఆయన కోరుకుంటున్నారన్నారు.

సీబీఐ దర్యాప్తునకు వెరవం


ఈనాటి ఆర్థిక పరిస్థితికి రాజశేఖరరెడ్డిగారి హయాంలో తీసుకుకున్న నిర్ణయాలే మూలకారణమని ఆయనకు  సన్నిహితులైన కర్నూలు జిల్లాకు చెందిన కేఈ కృష్ణమూర్తి ఆరోపించడాన్ని కొణతాల తప్పుపట్టారు. ఇందుకు మూలకారణం నాటి అగ్రికల్చరల్ కమిషన్ వైస్ ఛైర్మన్ డి.ఎ. సోమయాజులేననీ, ఆయనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలనీ చేసిన డిమాండును తాము అంగీకరిస్తున్నట్లు తెలిపారు. ఇది ఆయన ఆజ్ఞానానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు హయాంలో పరిస్థితులు, ఎకనమిక్ సర్వేలో వచ్చిన ఫలితాలు.. రాజశేఖరరెడ్డిగారి హయాంలో ఎలా ఉన్నదీ పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని సూచించారు. విజయాలు సాధించారు కాబట్టి ఆయనపై సీబీఐ దర్యాప్తు చేయించాలా అని ప్రశ్నించారు. 1989-94 నడుమ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతి యేటా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటమే కాక, అదనపు నిధులు కూడా ఉన్నాయన్నారు. అక్కడినుంచి 2004 వరకూ 22 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.

అభివృద్ధి ఆనవాళ్ళివి..


మహానేత పాలనలో విద్యుత్తు రంగంలో ఒక్క పైసా చార్జీ పెంచకుండా..ఉచిత విద్యుత్తు ఇస్తూ, పరిశ్రమలకు యూనిట్ కరెంటుకు 75 పైసలు తగ్గించి  ఇచ్చారన్నారు. 1994వరకూ ఎప్పుడూ విద్యుత్తు ఆర్థిక పరిస్థితి లోటులో లేదన్నారు. రాజశేఖరరెడ్డి గారి పాలనలో కూడా అదనపు నిధులే ఉన్నాయి తప్ప లోటు లేదన్నారు. క్రిసిల్ ఏపీఎస్ఈబీకి మొదటి ర్యాంకు ఇచ్చిందన్నారు. చంద్రబాబు పరిపాలించిన 1994-2004 నడుమ ఏపీఎస్ఈబీ ఇరవై వేల కోట్ల రూపాయల క్యుమ్యులేటివ్ ఆపరేటివ్ నష్టంలో కూరుకుపోయిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. విద్యుత్తు రంగంపై టీడీపీ ఇటీవల విడుదల చేసిన బ్లాక్ పేపర్‌లో అనేక అంశాలను విస్మరించిన విషయాన్ని సోమయాజులు ఎత్తిచూపిన అంశాన్ని గమనించలేదా అని నిలదీశారు. సోమయాజులు సంధించిన అరవై ప్రశ్నలకూ సమాధానం చెప్పి ఉంటే సంతోషించి ఉండేవాళ్ళమన్నారు. చంద్రబాబు హయాంలో ఆస్తులు అప్పుల నిష్పత్తి 45:100 ఉంటే రాజశేఖరరెడ్డి గారి హయాంలో అది 120:100 ఉందన్నది వాస్తవం కాదా అని అడిగారు. చంద్రబాబు హయాం పూర్తయ్యే నాటికి అభివృద్ధి రేటు 5.7% ఉంటే మహానేత హయాంలో 9.7% ఉందన్నారు.


ఏదీ పారిశ్రామిక ప్రగతి?

పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తెలుగుదేశం హయాంలో ఎనిమిది శాతం మాత్రమేనని, మహానేత హయాంలో ఇది 13 శాతానికి ఎగబాకిన విషయాన్ని మరిచారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం -4కి దిగజారిపోయిందన్నారు. వ్యవసాయం కూడా తెలుగుదేశం హయాంలో మూడు శాతం ఉంటే రాజశేఖరరెడ్డి గారి హయాంలో 6.87% ఉందన్నారు. పింఛన్లు 20 లక్షలుంటే రాజశేఖరరెడ్డిగారు వాటిని డెబ్బై లక్షలకు పెంచారనీ, అదీకాక 75 రూపాయలను 200కు పెంచారని చెప్పారు. ఎనబై శాతం మందికి రెండు రూపాయల బియ్యం అందించిన ఘనత ఆయనది కాదా అని ప్రశ్నించారు. ఫీ రీయింబర్సుమెంటులో 30 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. ఆ సమయంలో ఆంధ్ర అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నమోదైందన్నారు. పేదరిక నిర్మూలనలో మొదటి స్థానానికి వచ్చిన అంశం వాస్తవం కాదా అని అడిగారు. వీటిని ప్రస్తావించకుండా నిందలు వేసేలా టీడీపీ బ్లాక్ పేపర్ రూపొందించిందని కొణతాల ధ్వజమెత్తారు. ఈ గణాంకాలను ఇచ్చి చంద్రబాబుకు ఇష్టుడైన రంగరాజన్‌తో పరిశీలింపజేసుకోవచ్చని సవాలుచేశారు. మళ్ళీ ఓడిపోతామనే భయంతోనే ఇలా బురదజల్లుతున్నారని ఆరోపించారు. సీబీఐ గురించి భయపడి, పారిపోమనీ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామనీ ఆయన స్పష్టంచేశారు. సీబీఐ తమ జేబుసంస్థ అన్నట్లు విచారణ చేయిస్తామని అనడం మంచిది కాదని సూచించారు. కాంగ్రెస్ రాజకీయంలో పావు కావద్దని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు. ఎన్నికలొస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయం మరువరాదన్నారు.

Back to Top