ఆటోడ్రైవర్‌కు ఏటా రూ.10 వేలు

ఏలూరు:  అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన
చర్యలపై నిర్ణయాలు తీసుకోడానికే ప్రజా సంకల్పయాత్రను చేపట్టానని చెపుతున్న
వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశలో అనేక ప్రకటనలు
చేస్తున్నారు.161 రోజుల పాటు చేసిన పాదయాత్రలో పలు జిల్లాల్లో తనను కలిసిన
సందర్భాల్లో ఆటో డ్రైవర్లు వెలిబుచ్చిన ఆవేదనకు, సమస్యలకు పరిష్కారంగా అధికారంలోకి
వస్తే ఏటా పదివేల రూపాయల సహాయం ఇస్తానని సోమవారం నాడు ఏలూరు జరిగిన బహిరంగ సభలో
ప్రకటించారు. స్వయం ఉపాథితో రెక్కాడితే డొక్కాడని చాలీ చాలని ఆదాయంతో గడుపుతున్న
ఆటో డ్రైవర్ల జీవితాల్లో కొత్త కాంతులు నిండేలా ఆయన ఈ వరాన్ని ప్రకటించారు.
పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో
వైయస్ జగన్ ఈ అంశంపై హామీ ఇచ్చారు.రవాణా శాఖ నిబంధనలను అనుసరించి పలు రకాల పత్రాలు
చేయించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం
అందిస్తామని వెల్లడించారు.

  ‘‘తాను వెళ్లిన ప్రతిచోటా
ఆటోడ్రైవర్లు కలుస్తూ, రోజంతా కష్టపడితే మూడు నుంచి ఐదొందలు వస్తాయని, అందులో నుంచి రోజూ 50 రూపాయలు లేదా వంద రూపాయలను
చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటున్న విషయాన్ని చెపుతూ తమ సమస్యలను పంచుకున్న
వైనాన్ని ఆయన ప్రస్తావించారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోకు ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, రోడ్‌ టాక్స్‌ పత్రాలు
లేనందున ఈ వసూళ్లు చేస్తున్నారని వారు తనతో వాపోయినట్లు చెపుతూ అధికారంలోకి
వస్తే  అందుకు అయ్యే ఖర్చుల కోసం ఏటా ఆటో
డ్రైవర్లకు పదివేల రూపాయల సహాయాన్ని అందిస్తామని , దీంతో ఆటోకు బీమా
వర్తించడంతోపాటు ప్రయాణికులకు రక్షణ లభిస్తుందని జగన్ వివరించారు. 

Back to Top