ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై దాడి కేసులో అనిశ్చితి

అనంత‌పురం: అనంత‌పురం జిల్లా క‌దిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే
చాంద్‌బాషా వాహ‌నంపై దాడి ఘటనలో పురోగతి కనిపించటం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి దాదాపు 24 గంటలు కావస్తున్నా నిందితుల్ని గుర్తించలేదు. బయట నుంచి వస్తున్న ఒత్తిళ్లతో పోలీసు అధికారులు సమర్థవంతంగా దర్యాప్తు చేయటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే చాంద్ బాషా వాహనంపై గుర్తు తెలియ‌ని కొంద‌రు దుండ‌గులు దాడి చేశారు. సోమ‌వారం
రాత్రి త‌లుపుల ఉరుసు ఉత్స‌వాల్లో దుండ‌గులు నానా బీభ‌త్సం సృష్టించారు. ఈ దాడి లో
చాంద్‌బాషాకు చెందిన కారు అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. 

  ఈ దాడిపై ఎమ్మెల్యే చాంద్‌బాషా
మాట్లాడుతూ త‌న వాహనంపై దాడి చేయ‌డం చేత‌గాని ప‌ని అని అన్నారు. . ధైర్యం ఉంటే
నేరుగా త‌న ముందుకు రావాల‌ని, అలా కాకుండా దొంగ‌దెబ్బ తీయ‌డం హేయ‌మైన చ‌ర్య అని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల్లో త‌న‌కు, త‌మ పార్టీకి వ‌స్తున్న ప్ర‌జాభిమానం చూసి
ఓర్వ‌లేక‌నే ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న
కొన‌సాగుతోంద‌ని నిప్పులు చెరిగారు. ఈ విష‌యంపై త‌లుపుల పోలీస్‌స్టేష‌న్‌లో
ఫిర్యాదు చేసిన‌ట్లు ఎమ్మెల్యే తెలిపారు. 24 గంట‌ల్లో నిందితుల‌ను అరెస్ట్ చేయాల‌ని, లేనిప‌క్షంలో పెద్దఎత్తున ఆందోళ‌న చేస్తాన‌ని
ఆయ‌న హెచ్చ‌రించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చాంద్‌బాషా వాహ‌నంపై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌పై
 స్థానిక త‌లుపుల పోలీస్‌స్టేష‌న్‌లో
ఫిర్యాదు చేసినప్పటికీ ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.  

Back to Top