జక్కంపూడి రాజాపై దాడి అమానుషం

గుంతకల్లు టౌన్‌: వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాను అకారణంగా చితకబాదిన తూ.గో జిల్లా రామచంద్రాపురం ఎస్సై నాగరాజును విధుల నుంచి తొలగించాలని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, గుంతకల్లు సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం గుంతకల్లుకు విచ్చేసిన ఎమ్మెల్యే జయరామ్‌ స్థానిక నేత వైవీఆర్‌ నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాజాపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైయస్సార్‌సీపీ నాయకులపై దౌర్జన్యాలు,  కక్షసాధింపు చర్యలు పెరిగిపోయాయని, ఇందుకు జక్కంపూడి రాజాపై జరిగిన దాడి ఘటనే నిదర్శనమన్నారు. అధికారం శాశ్వతం కాదని, అధికారులు టీడీపీకి తొత్తులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేయాలని వారు హితవు పలికారు. తమ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశానుసారం పార్టీ సైనికులు క్రమశిక్షణతో మెలుగుతున్నారని, తమ సహనాన్ని చేతకాని తనంగా భావిస్తే ప్రజలతో కలిసి తిరుగుబాటు ఉద్యమాలకు శ్రీకారం చుడతామన్నారు.

నీరు సంవృద్దిగా ఉన్నా ఆయకట్టుకి నీరెందుకివ్వరూ?
తుంగభద్ర జలాలు సంవృద్దిగా ఉన్నా జీఎస్‌బీసీ (గుత్తి సబ్‌బ్రాంచ్‌ కెనాల్‌), ఏబీసీ (ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌)ల కింద ఉన్న ఆయకట్టుదారులకి నీరెందుకివ్వట్లేదని వైవీఆర్, జయరామ్‌ అధికారులను ప్రశ్నించారు. ఈ యేడాది జీఎస్‌బీసీ, ఏబీసీ,హంద్రీనీవా కాలువల్లో నీరు సంవృద్దిగా పొంగిపొర్లుతూ ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడి, కోతలకు గురవుతూ నీరంతా వృథాగా వెళ్తుందన్నారు. అవసరమున్న చోట నీరందివ్వకుండా తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజీనామా పేరిట బెదిరింపు రాజకీయాలకు పాల్పడిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కోసం చాగల్లు రిజర్వాయర్‌కి నీరివ్వడం సిగ్గుచేటని వారు విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆయకట్టుదారులకు నీరందించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో వైయస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజినేయులు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్‌.బసిరెడ్డి, కౌన్సిల్‌ ఫ్లోర్‌లీడర్‌ ఫ్లయింగ్‌ మాబు, పార్టీ సీనియర్‌ నేత శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకప్ప, మాజీ పట్టణ అధ్యక్షుడు ఎద్దుల శంకర్, అధికార ప్రతినిధి దశరథరెడ్డి, ఎస్టీసెల్‌ కన్వీనర్‌ గోవింద్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

వైయస్సార్‌సీపీను వీడే ప్రసక్తే లేదు
– ఆలూరు ఎమ్మెల్యే జయరామ్‌
తెలుగుదేశం పార్టీ పెద్దలు మంత్రి పదవి లేదా కోట్ల రూపాయలు డబ్బులిస్తామని ప్రలోభాలు పెట్టినా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ తెలిపారు. వైయస్‌.జగన్‌ పుణ్యామని తాను ప్రజలందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచానని, తాను జగన్‌ వెంటే నడుస్తానని ఆయన విలేకర్లు అడిగన ప్రశ్నకు స్పష్టమైన సమాధానమిచ్చారు. జగన్‌ చేపట్టబోయే ప్రజాసంకల్ప పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన ప్రజలను కోరారు.
Back to Top