మహిళా ఎమ్మెల్యేలపై దాడి అమానుషం

()దళిత మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ నేతల దాడులు
() యాక్షన్ తీసుకోవాలని వైయస్సార్సీపీ డిమాండ్
()హోదాపై చర్చించే దమ్ములేక పారిపోయారు
()టీడీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్ : శాసనసభ లోపలే కాదు... బయట కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం కొనసాగించారు. వైయస్సార్సీపీ మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా...  టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం నశించాలంటూ వైయస్ఆర్ సీనీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడనీయడం లేదని, మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనివ్వడం లేదని, తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.

బాబుకు కేసులు, సూటుకేసులే ముఖ్యం
ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టడం లేదని, ఆయనకు తనపై ఉన్న కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలి, తన కొడుకు లోకేష్‌కు సూటుకేసులు ఎలా ఇప్పించాలన్నదే ముఖ్యమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హోదా విషయంలో ఎలాంటి తప్పు చేయనప్పుడు అర్ధరాత్రి వేళ ఎందుకు ప్రకటన ఇప్పించారని సీఎంను ప్రశ్నించారు. ప్రజలంతా హోదా కోసం రోడ్డెక్కి బంద్‌ పాటిస్తుంటే..ప్రభుత్వం రాష్ట్రాన్ని పోలీసు వలయం చేసిందని విమర్శించారు. బంద్‌ చేస్తుంది ప్రజలా? పోలీసులా అన్న అనుమానం కలుగుతుందన్నారు. బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, అందులో భాగంగానే వైయస్‌ఆర్‌సీపీ నేతలను బలవంతంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం ముందుండి పోరాడాల్సిన సీఎం ఇలా అడ్డుతగలడం దుర్మార్గమన్నారు. హోదా విషయంపై అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపక్షం పట్టుబడితే సభను వాయిదా వేసి తప్పించుకున్నారని ధ్వజమెత్తారు. కనీసం మీడియా పాయింట్‌లో మాట్లాడుదామని అనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడి వైయస్‌ఆర్‌సీపీ గిరిజన మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు వీరంగం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు అండగా నిలబడిన తనను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడం దారుణమన్నారు. అసెంబ్లీ ఏమైన ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు రోజులు దగ్గరపడ్డాయని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు.

బాబువి పచ్చి అబద్ధాలు
ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండేళ్లుగా ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు చేపట్టిందని, ఇంకా ఎలా పోరాడాలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా బంద్‌లో పాల్గొంటుంటే పవన్‌ మాతో సహకరించకుండా తమ పంథాను తప్పుపట్టడం దారుణమన్నారు. హోదా విషయంలో కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తుంటే అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు చంద్రబాబు అంగీకరించకుండా ముందుగా స్టేట్‌మెంట్‌ ఇస్తామని మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి ప్రకటన చేశాక స్వాగతించిన సీఎం ఇంకా ఎన్నిసార్లు స్టేట్‌మెంట్లు ఇస్తారని ప్రశ్నించారు. గతంలో రాజధాని భూ దురాక్రమణ విషయంలో కూడా ఇలాగే స్టేట్‌మెంట్‌ ఇచ్చి సభ నుంచి టీడీపీ పారిపోయిందని గుర్తు చేశారు. హైకోర్టు ఏర్పాటు కోసం విజయవాడలో 32 ఎకరాలు కేటాయించామని 2014 సెప్టెంబర్‌లో తీర్మానం చేసినట్లు చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. కడపలో స్టీల్‌ ప్లాంట్, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ప్యాకేజీని క్యాష్‌ చేసుకునేందుకు బాబు కుట్ర
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని క్యాష్‌ చేసుకునేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అందరు భావిస్తుంటే సీఎం మాత్రం ప్యాకేజీకి స్వాగతించడం బాధాకరమన్నారు. హోదా అంశంపై అసెంబ్లీలో చర్చంచేందుకు ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వకుండా గొంతునొక్కారని, మీడియా పాయింట్‌లో మాట్లాడాలనుకుంటే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా అధికార పార్టీ నేతలు వ్యవహరించడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఎలాంటి గొడవ లేకుండా నిరసన తెలుపుతుంటే మార్షల్స్‌తో నెట్టించి అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం బంద్‌కు పిలుపునిస్తే దాన్ని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు పోలీసులకు హుకుం జారీ చేశారని తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలను ముందస్తుగా హౌస్‌ అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచాలనుకుంటే ఆగదని చంద్రబాబును హెచ్చరించారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన టీడీపీ నేతలను ప్రజలు కూడా తరమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.

గిరిజన మహిళలకు మాట్లాడే హక్కు లేదా
చట్టసభల్లో గిరిజన మహిళలకు మాట్లాడే హక్కు లేదా అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంటే, గిరిజనుల సమస్యలు అపరిష్కృతంగా ఉంటే వాటిపై మాట్లాడేందుకు అసెంబ్లీకి వచ్చిన మాకు ప్రభుత్వం సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించకుండా అవమానించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మీడియా పాయింట్‌లోనైనా మా బాధలు చెప్పుకుందామనుకుంటే ఇక్కడ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడి దాడికి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దళిత మహిళా ఎమ్మెల్యేలపై దౌర్జన్యం
మీడియా పాయింట్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ దళిత మహిళా ఎమ్మెల్యేలను మాట్లాడనివ్వకుండా టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం దారుణమని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి ప్రజాస్వామ్యంలోనే చీకటి రోజని అన్నారు. బాధ్యాత యుతంగా వ్యవహరించాల్సిన టీడీపీ చీఫ్‌ విప్‌ కోన రవికుమార్‌ దాడి చేయడం హేయనీయమన్నారు. గత మూడు రోజుల నుంచి హోదాపై చర్చ జరగాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైయస్‌ఆర్‌ సీపీ ఇచ్చిన బంద్‌ పిలుపుకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తుంటే చంద్రబాబు పోలీసులను పెట్టి దౌర్జన్యకాండకు దిగుతున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా మీడియా పాయింట్‌ ముందు టీడీపీ నేతలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడం ఇదే మొదటిసారన్నారు. టీడీపీ నేతలపై స్పీకర్‌ యాక్షన్‌ తీసుకోవాలన్నారు. 

వైయస్‌ జగన్‌కు మైక్‌ ఇవ్వడానికి భయపడుతున్నారు
అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మైక్‌ ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఘటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హోదాపై చర్చను అణచివేయాలని ప్రతిపక్ష సభ్యులకు మైక్‌ ఇవ్వకుండా స్పీకర్‌ కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.  సభలో ప్రభుత్వం మైక్‌ ఇవ్వకపోవడంతో మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడటానికి వచ్చిన వైయస్‌ఆర్‌ సీపీ ఎస్సీ, ఎస్టీ మహిళలపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కోన రవికుమార్‌ దౌర్జన్యానికి దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న ప్రతిపక్ష గొంతును ప్రభుత్వం నొక్కేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీడీపీ ఎమ్మెల్యేలపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌పెట్టాలి
మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసి యావత్తు మహిళా లోకం తలదించుకునే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. టీడీపీ చీఫ్‌ విప్‌ తన అనుచరులతో దళిత ఎమ్మెల్యేలపై దాడికి దిగారని మండిపడ్డారు. ఎంతో విలువలతో కూడిన చట్టసభను ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హోదాపై చర్చించేందుకు మైక్‌ ఇవ్వకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సభా ప్రాంగణంలో దళిత మహిళలపై జరిగిన దౌర్జన్యంపై స్పీకర్‌ అధికార పక్షంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలు హక్కుగా భావిస్తున్న హోదాపై చర్చకు రాకుండా చంద్రబాబు మార్షల్స్‌ను పెట్టి వైయస్‌ఆర్‌సీపీ సభ్యులను సభ నుంచి తోసేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మొదటి నుంచి హోదాను నీరుగారుస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను విశ్వాసాలను కోల్పోయారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టిన వైయస్‌ఆర్‌ సీపీకే ప్రజలు పట్టం కడతారన్నారు. 

బాబుది రాక్షసపాలన
అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడనివ్వకుండా మహిళా ఎమ్మెల్యేలపై టీడీపీ చేసిన దౌర్జన్యాన్ని వైయస్‌ఆర్‌ సీపీ పూర్తిగా ఖండిస్తుందని ఎమ్మెల్యే ఐజయ్య స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వాలు టీడీపీ మాదిరిగా రాక్షసధోరణితో వ్యవహరించలేదని చెప్పారు. దళిత మహిళా ఎమ్మెల్యేలను  టీడీపీ నేతలు పక్కనునెట్టడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యేలను గౌరవించడం వైయస్‌ఆర్‌ సీపీ సాంప్రదాయమన్నారు. కానీ టీడీపీకి అదిలేదని దుయ్యబట్టారు.  రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 


 
Back to Top