అటల్‌ జీ సేవలు మరువలేనివి


దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది
వాజ్‌పేయి పార్థివదేహానికి నివాలుర్పించిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు

ఢిల్లీ: ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమర్థవంతమైన సుపరిపాలన అందించిన మహానుభావుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్‌లు వాజ్‌పేయి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాను నమ్మిన సిద్ధాంతాలతో మానవతా దృక్పథంతో పరిపాలన చేశారన్నారు. పదిసార్లు లోక్‌సభ, రెండు సార్లు రాజ్యసభకు పనిచేసి దేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడన్నారు. వాజ్‌పేయి మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దేశం ఒక మహోన్నతమైన నాయకుడిని కోల్పోయిందన్నారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని, ఆయన లోటు తీరనిదని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా దేశాన్ని నడిపించిన ఒకే ఒక్క నాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి అని వరప్రసాద్‌ అన్నారు. మానవులంతా ఒక్కటేనని ప్రజాస్వామ్యాన్ని కాపాడారన్నారు. భారత్, పాకిస్తాన్‌ శాంతియుతంగా ఉండాలని బస్సు యాత్ర చేపట్టిన మహానుభావుడిని దేశం మరువదన్నారు.

Back to Top