టి నోట్‌కు ముందే 'సమైక్య' తీర్మానం

హైదరాబాద్ 26 సెప్టెంబర్ 2013:

తెలంగాణ నోట్ సిద్ధం కాకముందే రాష్ట్ర శాసన సభను సమావేశపరచాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గురువారం రాత్రి ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఓ తీర్మానం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకపక్షంగానూ, నిరంకుశంగానూ చేసిన రాష్ట్ర విభజన తీర్మానం తర్వాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చెలరేగిన ఆందోళనతో ప్రజా జీవనం స్తంభించిన విషయాన్ని ఆమె  లేఖలో ప్రస్తావించారు. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కేంద్ర ప్రభుత్వం సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేసి తీరాలని సూచించిన విషయాన్ని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. 'ఇప్పుడు మీరు విభజించాలనుకున్న ఆంధ్ర ప్రదేశ్ కూడా మొదటి ఎస్ఆర్సీని ఏర్పాటు చేసిన విషయాన్నీ, ఆంధ్ర, తెలంగాణ కలిసినప్పుడు కూడా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానం చేసిన అంశాన్ని కూడా ఆమె ఆ లేఖలో జ్ఞాపకం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని కోరారు.

Back to Top