బాబు కుటిల వ్యూహాలకు అసెంబ్లీ వేదిక

* చ‌ట్ట‌స‌భ సాక్షిగా ప్ర‌తిప‌క్షం గొంతునొక్కుతున్న టీడీపీ స‌ర్కార్‌
* ప్ర‌తి స‌మావేశంలోనూ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్న అధికార పార్టీ
* ప్ర‌ధాన అంశాల‌పై చ‌ర్చ‌కు అంగీక‌రించ‌ని టీడీపీ
* అకార‌ణంగా విప‌క్ష స‌భ్యుల స‌స్పెన్ష‌న్‌
* మొక్కుబ‌డిగా స‌మావేశాలు..అమ‌లుకు నోచుకొని చ‌ట్ట‌స‌భలోని హామీలు 
* బ‌డ్జెట్ స‌మావేశాలైనా స‌జావుగా సాగేనా?

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికార తెలుగు దేశం పార్టీ నియంత పాల‌న సాగిస్తోంది. ప్రజాస్వామ్యంలో అధికారపక్షం ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షమూ అంతే కీలకం. నిజానికి ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ.. ప్రభుత్వ విధానాలను, నిర్ణయాలను నిరంతరం శల్యపరీక్ష చేస్తూ.. ప్రజాప్రయోజనాల రక్షణ పాత్ర పోషించేది ప్రతిపక్షమే. ప్రతిపక్షమనేది లేకపోతే.. అది ప్రజాస్వామ్యమే కాదు. ప్రతిపక్షం లేకపోతే ఉండేది అధికారపక్షం ఒక్కటే. అడిగేవారు ఎవరూ లేని.. అధికారపక్షం ఒక్కటే ఉండే వ్యవస్థ నిరంకుశ వ్యవస్థ అవుతుంది. రాష్ట్రంలో అధికారపక్షానికి తన చర్యలను, చేతలను, నిర్ణయాలను విపక్షం ప్రశ్నిస్తుండటం.. వాటిలోని లోపాలను, అవినీతి బాగోతాలను ఎండగడుతుంది. ప్ర‌తిప‌క్షం చ‌ర్య‌లు మింగుడు పడని ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం.. మూడేళ్లుగా శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కేయటమే పనిగా పెట్టుకుంది. వ్యక్తిగత దూషణలు, ఎదురు దాడులు, హెచ్చరికలు, హుంకరింపులు, బెదిరింపులతో చర్చ జరగాల్సిన విషయాలను పక్కదారి పట్టించటమే ప‌నిగా పెట్టుకుంది.  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించి, ప‌రిష్కార మార్గాలు చూపాల్సిన అసెంబ్లీని దిగ‌జారుడు రాజకీయ వ్యూహాలకు వేదికగా మార్చుకుంటున్నారు. రాష్ట్రం లో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి, లేని సమస్యలను సృష్టించి మంద బ‌లంతో మ‌మ అనిపించుకుంటున్నారు. 

 సభా సమావేశాలను పక్కదోవ పట్టించేందుకే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల‌ను ప‌క్క‌దోవ‌ ప‌ట్టించేందుకు జిత్తుల మారి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏదో ఒక అంశాన్ని తెర‌పైకి తెస్తున్నారు. గ‌త మూడేళ్లుగా ఇదే జ‌రుగుతోంది. ముఖ్యమంత్రిగా ఉండగా మరణించిన వైయ‌స్ రాజశేఖరరెడ్డికి నివాళిగా ఆనాటి స్పీకర్, ప్రభుత్వం సభా సంప్రదాయాల మేరకు ఆయన చిత్రపటాన్ని అసెంబ్లీ లాంజ్‌లో ఏర్పాటు చేస్తే కనీస మర్యాద పాటించకుండా టీడీపీ ఆ ఫొటోను తొలగించింది. వైయ‌స్ఆర్‌ చిత్రపటం తొలగింపును సమర్థించడానికి... తద్వారా అసెంబ్లీలో సమస్యలు పక్కదారి పట్టించి, దీన్ని ఒక ఘర్షణగా చిత్రీకరించేందుకు టీడీపీ ఎత్తుగడ వేసింది. వైయ‌స్ఆర్‌ చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుపడుతుంద‌ని చిత్రీక‌రించారు. శాసనసభా సమావేశాల్నే పక్కదోవ పట్టించి తమ పరిపాలనలో దుర్మార్గాలు, అవినీతిపైన 2015 వ సంవ‌త్స‌రం వర్షాకాల సమావేశాల్లో చర్చ జరక్కుండా  టీడీపీ అడ్డుప‌డింది. ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం, డాక్యుమెంటరీ నిర్మాణంకోసం పుష్కరాల్లో 30 నిండు ప్రాణాలు బలిపెట్టడం, తీవ్ర కరువు కాటకాలతో రాష్ట్రంలోని రైతులు విలవిల్లాడుతున్న దయనీయ పరిస్థితులు, టీడీపీ నేతల ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు తహసీల్దారు వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి, మరోవైపు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై ఆర్థికమంత్రి యనమల మనుషులతో దాడి, అనంతపురం జిల్లాలో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం, నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన దోషులను సర్కారు వెనకేసుకొస్తున్న తీరు, రాష్ట్రానికి కీలకమైన ప్రత్యేక హోదా ఊసెత్తకుండా కేంద్రప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పేరుతో దోపిడీ వంటి అనేక అంశాలు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్ర‌తిప‌క్షం ఎండ‌గ‌ట్టింది. వీటికి స‌మాధానం చెప్ప‌లేక, స‌భ నుంచి నుంచి తప్పించుకోవడానికి, శాసనసభను పక్కదారి పట్టించడానికి ప్ర‌తిసారి అధికార పార్టీ ఏదో ఒక అంశాన్ని తెర‌పైకి తీసుకొని వ‌చ్చింది. చ‌ట్ట స‌భ సాక్షిగా అధికార ప‌క్షం ఇచ్చిన హామీలు అమ‌లు కావ‌డం లేదు.

కాల్‌మ‌నీ-సెక్స్ రాకెట్‌ను ప్ర‌శ్నించింద‌ని..
విజ‌య‌వాడ కేంద్రంగా మ‌హిళ‌ల మాన‌, ప్రాణాల‌తో చెల‌గాట‌మాడిన కాల్‌మ‌నీ-సెక్స్‌రాకెట్‌పై చ‌ట్ట‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ప్ర‌శ్నించిందనే కోపంతో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా స‌భ నుంచి ఏడాది పాటు స‌స్పెండ్ చేశారు. అంతేకాకుండా కాల్‌మ‌నీ కేసుపై త‌ప్పుడు విచార‌ణ చేప‌ట్టి అందులో విప‌క్షాల‌కు చెందిన నేత‌లు ఉన్నార‌ని బోగ‌స్ రిపోర్టులు పుట్టించ‌డం, ఈ అంశాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు రాష్ట్రంలోని వ‌డ్డీవ్యాపారుల‌పై దాడులు చేయించారు. అయితే కాల్‌మ‌నీ కేసులో నిందితుల‌పై మాత్రం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌ను క‌నీసం ప్ర‌శ్నించ‌డానికి కూడా పోలీసులు సాహ‌సించ‌లేదు. దీంతో ఆ ఏడాది జ‌రిగిన స‌మావేశాల‌ను ఈ విధంగా మ‌మ అనిపించి ప్ర‌తిప‌క్షం గొంతునొక్కారు.

హోదా ఇవ్వ‌మ‌న్నా..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు విభ‌జ‌న చ‌ట్టంలోని ప్ర‌త్యేక హోదా హామీకి చంద్ర‌బాబు తూట్లు పొడిచారు. మ‌న‌కు రావాల్సిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌క‌టించినా చంద్ర‌బాబు ఆ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు. విభ‌జ‌న స‌మ‌యం, ఎన్నిక‌ల మీటింగ్‌ల్లో ఏపీకి ప్ర‌త్యేక హోదా
సంజీవ‌ని అన్న చంద్ర‌బాబు ఓటుకు కోట్లు కేసు నుంచి త‌ప్పించుకునేందుకు ప్లేటు ఫిరాయించారు. హోదా వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని నాలుక మ‌డ‌త పెట్టి అబ‌ద్ధాలు వ‌ళ్లించారు. ఇదే అంశంపై రెండుమార్లు అసెంబ్లీలో ఏక‌గ్రీవంగా తీర్మాణం చేసిన అంశాన్ని టీడీపీ స‌ర్కార్ నీరుగార్చింది. ముందుండి పోరాడాల్సిన చంద్ర‌బాబు ద‌గ్గ‌రుండి వెన్నుపోటు పొడిచారు.పైగా ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతున్న ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించారు. ఉద్య‌మాల‌ను ఉక్కుపాదంతో అణ‌చివేశారు. ప్ర‌త్యేక హోదాపై అసెంబ్లీలో చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్షం ప‌ట్టుప‌డితే స‌భ్యులంద‌రిని స‌స్పెండ్ చేశారు. స‌భ‌లో ప్ర‌తిప‌క్షం లేకుండానే అన్ని బిల్లులు పాస్ చేసుకొని స‌మావేశాలను మొక్కుబ‌డిగా ముగించారు. ప్రజల పక్షాన గళమిప్పుతున్న ప్రతిపక్షంపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపింది. విపక్షం వాణి అనేదే వినపడకుండా చేసింది. చట్టసభల నిబంధనలకు తిలోదకాలిచ్చింది. ప్రజాస్వామిక సంప్రదాయాలకు పాతరేసింది. విపక్ష నేత మాట్లాడీ మాట్లాడకముందే గొంతు నొక్కేసింది. అదేమని ప్రశ్నించిన విపక్ష సభ్యుల‌పై సస్పెన్షన్ వేటు వేసింది. వారు నిరసన తెలిపితే మార్షల్స్‌తో బయటకు ఈడ్చి పారేయించింది. అసెంబ్లీ ఆవరణలోనే ఉండటానికి వీల్లేదంటూ గేటు బయటకు గెంటేయిం చింది. ఈ దుష్కృత్యం బయటి ప్రపంచానికి తెలియకుండా సభా కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపివేసింది. 

మాట్లాడ‌క‌ముందే మైక్ క‌ట్‌
శాస‌న స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మాట్లాడ‌క‌ముందే మైక్ క‌ట్ చేస్తున్నారు. ఆయ‌న మాట్లాడటం ప్రారంభించిన ప్ర‌తిసారి అధికార పార్టీ నేత‌లు అడ్డుత‌గ‌ల‌డం, స్పీకర్ కోడెల శివప్రసాదరావు యథావిధిగా వైయ‌స్ జగన్ మైక్‌ను కట్ చేయ‌డం ప‌రిపాటిగా మారింది.వైయ‌స్ జ‌గ‌న్‌ మైక్‌ను కట్ చేసే ఆనవాయితీ లేకున్నా.. స్పీకర్ బెల్ మోగించి, మైక్ కత్తిరించేస్తారు. ఈ చర్య విపక్ష నేతకు, ప్రతిపక్ష సభ్యులకే కాదు.. ప్రజ లందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ముఖ్య‌మంత్రి మొద‌లు టీడీపీ ఎమ్మెల్యేల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. నిలువ‌రించాల్సిన స్పీక‌ర్ కూడా అధికార ప‌క్షానికి వ‌త్తాసు ప‌ల‌క‌డం శోచ‌నీయం. చ‌ట్ట‌ సభలో.. ‘‘మీ కథేంటో తెలుస్తాన’ని సాక్షాత్తు ముఖ్యమంత్రే బెదిరిస్తే.. అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు.. ‘‘పాతేస్తా.. నా కొ....’’ అని హెచ్చరించగా.. స్పీకర్ కోడెల శివప్రసాదరావే.. ‘‘నిన్ను మాట్లాడనివ్వ’’నని ప్రతిపక్ష నేతను నియంత్రించారు. సీఎం కనుసన్నల్లో అధికార పక్షం ప్రతిపక్ష నేత వైయ‌స్.జగన్‌మోహన్‌రెడ్డికి కానీ.. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.. శాసనసభను పూర్తిగా ఏకపక్షంగా మార్చి విపక్షం గొంతు నులిమేస్తోంది.  విపక్ష సభ్యులు నిరసన తెలుపుతూ నినాదాలు చేయ‌డం కూడా త‌ప్పేన‌ట‌.  అవ‌స‌రం లేకున్నా.. స్పీకర్ ఆదేశాలతో పెద్ద సంఖ్యలో మార్షల్స్ రంగ ప్రవేశం చేస్తున్నారు. మ‌హిళా ఎమ్మెల్యేల‌పై మార్ష‌ల్స్ దాడికి పాల్ప‌డుతున్నా స్పీక‌ర్ నివారించ‌డం లేదు. నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులను ఒక్కొక్కరిని బలవంతంగా ఈడ్చుకుపోతున్నారు. ఈ దృశ్యాలను ప్రజలకు చూపడం లేదు.  టీవీ చానళ్లలో సభాకార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను సైతం నిలిపివేస్తున్నారు. బయటకు ఈడ్చుకెళ్లిన వారిని సభ నుంచే కాకుండా ఏకంగా అసెంబ్లీ ఆవరణ నుంచే గెంటివేసిన ఘ‌ట‌న‌లు చూశాం. సభ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో అడిగేందుకు వీలులేకుండా చేస్తున్నారు. చివరకు సభ బయట ఉండే మీడియా పాయింట్‌లో సైతం మాట్లాడకుండా టీడీపీ నేత‌లు నిలువరించి.. అప్రకటిత కర్ఫ్యూను తలపించేలా వ్య‌వ‌హ‌రించిన ఉదాంతాలు చూశాం. సభా నాయకుడు చంద్రబాబునాయుడు చూపిన మార్గంలోనే శాసనసభ వేదికగా అన్‌పార్లమెంటరీ (సభలో వాడకూడని) పదజాలం ఉపయోగిస్తూ టీడీపీ సభ్యులు రెచ్చిపోతున్నారు. ఇష్టారీతిన అసభ్యకర పదజాలం వాడుతున్నా అడ్డుకట్ట వేసే వారే లేరు.  

అమ‌రావ‌తిలోనైనా అధికార పార్టీ తీరు మారేనా?
ఇన్నాళ్లు ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ప్ర‌తిప‌క్షం గొంతు నొక్కిన చంద్ర‌బాబు స‌ర్కార్ న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిలోనైనా తీరు మార్చుకుంటుందా అన్నసందేహాలు త‌లెత్తుతున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు మొద‌లుకానున్నాయి. అయితే ఈ స‌మావేశాల్లో ఎక్క‌డ త‌మ‌ను ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నిస్తోందోన‌ని ఇప్ప‌టికే అధికార ప‌క్షం గొంతు నొక్కేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని, లేదంటే నెల‌కు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. బాబు వ‌చ్చాడు కానీ, నిరుద్యోగుల‌కు జాబు రాలేదు. ఈ అంశంపై బ‌డ్జెట్ స‌మావేశాల్లో వైఎస్ఆర్‌సీపీ ప్ర‌శ్నించ‌నుంది. ఇదివ‌ర‌కే ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం చంద్ర‌బాబుకు నిరుద్యోగ భృతికి సంబంధించిన బ‌కాయిలు చెల్లించేందుకు బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించాల‌ని బ‌హిరంగ లేఖ రాశారు. దీంతో ప్ర‌తిప‌క్షాన్ని అడ్డుకునేందుకు, ఈ అంశాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైయ‌స్ జ‌గ‌న్‌పై ఇప్ప‌టికై త‌ప్పుడు కేసులు న‌మోదు చేసింది. మ‌రో వైపు టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి ట్రావెల్ ప్ర‌మాదం ఘ‌ట‌న‌ను నీరుగార్చేందుకు వైయ‌స్ జ‌గ‌న్‌పై ప‌లు అభియోగాలు మోపేందుకు స‌ర్కార్ కుట్ర చేసింది. అధికారుల‌పై ప్ర‌తిప‌క్ష నేత దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఇప్ప‌టికే ఎల్లోమీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం చేయించిన చంద్ర‌బాబు స‌భ‌లో కూడా ఇదే అంశాన్ని లేవ‌నెత్తి అస‌లు విష‌యాల‌ను మ‌రుగున‌ప‌డేసేందుకు ప‌థ‌కం ర‌చించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నెల 2న వెల‌గ‌పూడిలో నూత‌న అసెంబ్లీ భ‌వ‌నాల‌ను ప్రారంభించిన చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షాన్ని పిల‌వ‌కుండానే..వారు రాలేద‌ని నింద మోపారు. ఇలాంటి అంశాల‌పై ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నిస్తే అడ్డుకునేందుకు త‌న మంత్రుల‌ను బాబు సిద్ధం చేశారు. కేబినెట్ మీటింగ్‌లో ప్ర‌జా సంక్షేమం గురించి, స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సిన మంత్రులు ఇటీవ‌ల నందిగామ ఆసుప‌త్రిలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌లెక్ట‌ర్‌, డాక్ట‌ర్ల‌తో ఎలా వ్య‌హ‌రించార‌ని వీడియోలు, సినిమాలు చూస్తూ కాలం వెల్ల‌దీశారు. ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన పాపాన పోలేదు. నిజంగా వీరికి చిత్త‌శుద్ధి ఉంటే బ‌స్సు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లించే విష‌యం. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన యాజ‌మాన్యం చ‌ర్య‌లు తీసుకునే విష‌యాలు, నిరుద్యోగ భృతి, క‌రువు నివార‌ణ చ‌ర్య‌ల‌పై చ‌ర్చించే వారు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ మీటింగ్‌లో ఇలాంటివేవి ఆలోచించ‌కుండా ప్ర‌తిప‌క్ష నేత‌ను ఎలా నివారించాల‌నే అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించ‌డం గ‌మ‌నార్హం. 

హుందాగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌
శాసనసభలో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నారు. చంద్ర‌బాబుతో స‌హా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగినా కూడా ఎక్క‌డ కూడా ఆవేశానికి లోనుకాకుండా, నిగ్ర‌హంగా, స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తూ తోటి స‌భ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఒక‌నొక స‌మ‌యంలో మంత్రి అచ్చెన్నాయుడు ప‌రుష‌ప‌ద‌జాలంతో ప్ర‌తిప‌క్ష నేత‌ను దూషించినా వెర‌వ‌లేదు. తాను స‌భ‌లో ఏదైతే మాట్లాడాలో అదే విష‌యాన్ని మాట్లాడుతూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నారే త‌ప్ప‌..వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగిన సంద‌ర్భాలు లేవు. 35 ఏళ్ల అనుభ‌వం అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు కూడా అనేక సంద‌ర్భాల్లో శృతిమించి నోరుపారేసుకున్నారే గానీ, వైయ‌స్ జ‌గ‌న్ ఏనాడు అసంద‌ర్భంగా మాట్లాడ‌లేదు.  ప్రశాంతంగా ఉన్న‌ సభలో అధికార పక్షం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహారిస్తోంది.  కుటిల వ్యూహాల‌కు అసెంబ్లీని వేదిక‌గా చేసుకొని అధికార పార్టీ చేస్తున్న రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటున్నారు.
Back to Top