శాసనసభకు దూరంగా ఉంటాం..!

() మహిళా ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవటం దారుణం

() న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ చర్చ జరుపుతామన్న చట్ట సభల్ని
బహిష్కరిస్తున్నా

() న్యాయ వ్యవస్థకు బాసట గా నిలిచిన వైఎస్ జగన్

హైదరాబాద్) న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ , చట్ట సభల్లో చర్చలు చేపట్టాలన్ని
తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తప్పు పట్టారు. న్యాయ
వ్యవస్థకు సంఘీభావంగా చట్ట సభల్ని సోమ వారం దాకా బహిష్కరిస్తున్నట్లు ఆయన
ప్రకటించారు. అసెంబ్లీ లో మహిళా ఎమ్మెల్యే రోజాను అనుమతించకుండా, సభలో నిరసన
తెలిపే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నందుకు నిరసన
తెలిపారు. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. అనంతరం
మీడియాతో మాట్లాడారు. 


వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..!

      చట్ట సభలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అందరూ చూస్తూనే ఉన్నాం.
అసెంబ్లీలోకి మహిళా ఎమ్మెల్యే రోజాను అనుమతించక పోవటానికి నిరసనగా, అన్యాయం మీద
వాకౌట్ చేయదలచుకొన్నాం... అంటూ మైక్ ఇవ్వమని అడిగితే మైక్ ఇవ్వలేదు. రెండు
నిముషాలు మైక్ ఇవ్వమని అడిగినా కూడా మైక్ ఇవ్వటం లేదు. ఇది ఎంతటి అన్యాయం.

చట్ట సభలో ఏం జరిగిందీ అనేది నిన్న చూశాం.
స్పీకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి రోజమ్మను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా
తీర్మానం చేశామని చెప్పారు. ఇది ఎంతటి అబద్దం. 67 మంది శాసనసభ్యులు మీతో
విభేదించారు. మీకు అధికారం లేకపోయినా ఎలా సస్పెండ్ చేస్తారు... రూల్స్ ను
అధిగమించి ఎలా సస్పెండ్ చేస్తారు.. అని అడిగిన సంగతి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు
అబద్దాలు చెబుతూ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అని చెబుతున్నారు. ఇంతకన్నా దారుణం
ఉంటుందా..?


      ఇప్పుడు ఇదే సభ సోమవారం నాడు
సమావేశమై చర్చ చేస్తారట. న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని
ధిక్కరిస్తూ స్పీకర్.. సభను నడిపిస్తున్న తీరుని చూసి నిరసన తెలుపుతున్నాం. ఒక
వైపు కోర్టు ధిక్కార నేరం మీద హైకోర్టులో విచారణ సోమవారం నాడు చేపట్టినప్పుడు, అదే
న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ ఇక్కడ చర్చ జరుపుతారట. అందుకే అప్పటిదాకా సభను మేం
బహిష్కరిస్తున్నాం. చట్ట సభల్లో న్యాయస్థానాలకు ఎంతటి గౌరవం ఇస్తున్నారో
చూస్తున్నాం.

      న్యాయస్థానాల ఉత్తర్వులు చూపించి
సభకు హాజరు అవుతామని మహిళా ఎమ్మెల్యే రోజా అడిగారు. అయినా సరే న్యాయస్థానం కన్నా
మేం పెద్దోళ్లం, మేం అటువంటివి అంగీకరించం అని పాలన సాగిస్తున్న తీరును మేం
ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థకు బాసటగా నిలిచేందుకు సోమవారం దాకా సభల్ని మేం
బహిష్కరిస్తున్నాం. ఇది ఎంతటి దిక్కుమాలిన సభ అనేది అర్థం అవుతోంది. న్యాయస్థానం
ఇచ్చిన ఆదేశాల్ని చర్చిస్తారట. అంటే న్యాయవ్యవస్థను అవహేళన చేస్తూ ఇక్కడ చర్చలు
జరిపి తీర్పులు ఇస్తారట. అందుకే మేం దీన్ని బహిష్కరిస్తున్నాం.

      ఒక వైపు న్యాయస్థానంలో ఇదే అంశం
మీద విచారణ జరుపుతున్నప్పుడు, న్యాయస్థానం చేసే విచారణ మీద మీరు విచారణ జరిపి
తీర్పు ఇస్తారా. అలా అయితే మీరే విచారణ చేసుకోండి. మీరే తీర్పులు రాసుకోండి.

      నిజంగా ముఖ్యమంత్రి కి సిగ్గు,
లజ్జ ఉంటే కనుక.. వేరే పార్టీ నుంచి ఎన్నికై, పార్టీ ఫిరాయించిన 8మంది ఎమ్మెల్యేల
చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల తీర్పు
కోరాలి. చంద్రబాబు నాయుడికి ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము, ధైర్యం లేవు. ఎందుకంటే
ప్రజల దగ్గరకు వెళితే ప్రజలు బుద్ది చెబుతారని తెలుసు. పైగా స్పీకర్ కుర్చీని
ఉపయోగించి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.

            రాజకీయాల్లో ఉండే వారికి
రెండు లక్షణాలు ఉండాలి. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ అంటే
విశ్వసనీయత అవసరం. కానీ చంద్రబాబు వ్యక్తిత్వం ఎటువంటిది అంటే పదవి కోసం సొంత మామ
గారిని వెన్నుపోటు పొడిచిన స్వభావం. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి, అధికారంలోకి
వచ్చాక మోసం చేసిన స్వభావం ఆయనది. ఇటవంటి వ్యక్తి లంచాలు, అవినీతి తో సంపాదించిన
సొమ్ములను ఎరగా చూపించి, ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటమే కాకుండా
స్పీకర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కి
సిగ్గు, లజ్జ, రోషం ఉంటే తక్షణమే ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేయాలి. ప్రజల
ఆశీస్సులు తాజాగా కోరాలి.

      స్పీకర్ వ్యవస్థ ద్వారా ఒక అబలకు
జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూనే ఉన్నాం. ఒక అబల తనకు జరిగిన అన్యాయాన్ని
నిరసిస్తూ కోర్టుకి వెళ్లి న్యాయపోరాటం చేసి ఆదేశాలు తెచ్చుకొంటే అన్యాయం
చేస్తారా. ప్రజలు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నారు. త్వరలోనే ప్రజలు
బుద్దిచెబుతారు. ’’ అని వైఎస్ జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 


తాజా వీడియోలు

Back to Top