అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయాలి

హైదరాబాద్ 18 అక్టోబర్ 2013:

రాష్ట్ర విభజనకు సంబంధించిన డ్రాఫ్టు బిల్లు రాష్ట్రానికి వచ్చేలోగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, సమైక్యానికి అనుకూలంగా తీర్మానాన్ని చేయాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం మధ్యాహ్నం వారు ఆయనను కలిసి ఈ మేరకు ఓ లేఖను అందజేశారు. ఇదే విషయమై సెప్టెంబర్ 26న కూడా ఆయనకో లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. క్యాబినెట్ నోట్ తయారు కాక మునుపే అసెంబ్లీని సమావేశ పరిచాలన్న మా వినతిని పట్టించుకోని సంగతిని వారు జ్ఞాపకం చేశారు.
ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఉంటే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేసి, వైఖరిని వెల్లడించడానికీ, తద్వారా విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా ఓ తీర్మానాన్ని ఆమోదించడానికీ అవకాశం కలిగేదనీ, నిరంకుశ నిర్ణయానికి ఆదిలోనే అడ్డుకట్ట పడేదనీ వారా లేఖలో తెలియజేశారు.
ప్రస్తుతం విభజన ప్రక్రియ ఊపందుకుందనీ, క్యాబినెట్ నోట్ ఆమోదంతో పాటు, మంత్రుల బృందం మొదటి సమావేశం కూడా ముగిసిందనీ పేర్కొన్నారు. రెండో సమావేశంలో విభజన ఎలా చేయాలనే అంశంపై కార్యాచరణను రూపొందించనున్నారనీ, ఇది ప్రజాభిప్రాయాన్ని మన్నించకుండా చేయడమేననీ తెలిపారు. ఇప్పటికైనా ఈ అంశంలోని తీవ్రతను గమనించి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, విభజనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాలని కోరారు. డ్రాఫ్టు బిల్లు రూపుదిద్దుకోకముందే ఈ ప్రక్రియ ముగియాలని వారు అభిలషించారు. విభజనపై ముందడుగు వేయకుండా కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అసెంబ్లీ తీర్మానం దోహదపడుతుందని పేర్కొన్నారు. కొద్ది సీట్లు, ఓట్ల కోసం అసెంబ్లీ తీర్మానం లేకుండానే విభజనకు పూనుకోవడం అన్యాయమనీ, మరింత జాప్యం లేకుండా  నిరసనను తెలిసే అవకాశాన్ని జారవిడుచుకోవద్దనీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి సూచించారు.
18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్న బాధ్యతాయుతమైన పార్టీగా ఇప్పటికే మేము విభజన అంశంపై వివిధ రూపాలలో తమ నిరసనను వ్యక్తంచేశామన్నారు. అందుకే విభజనకు వ్యతిరేకంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేసి, తీర్మానం చేయాలని మరోసారి కోరుతున్నామని ఆ లేఖలో ముఖ్యమంత్రికి తెలిపారు.

Back to Top