టెన్త్ పేప‌ర్ లీకేజీపై వాయిదా తీర్మానం

ఏపీ అసెంబ్లీ: ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన పేప‌ర్ లీకేజీపై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌వారం అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో పేప‌ర్ లీక్‌పై చ‌ర్చకు అంగీక‌రించాల‌ని ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స్పీక‌ర్‌ను కోరారు. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్‌ విద్యాసంస్థ ‘నారాయణ’  హస్తం ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. ఇప్పటివరకు పరీక్ష పత్రాల లీకేజీలు జరిగిన కేంద్రాలన్నీ నారాయణ స్కూళ్లే కావడం గమనార్హం. అయితే పరీక్షా కేంద్రాల ఇన్విజిలేటర్లు, ఇతరులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోవడం వరకే  విద్యాశాఖ పరిమితమవుతోంది. ఈ సంస్థ మంత్రి నారాయణకు సంబంధించినది కావడం, మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనా స్వయానా వియ్యంకులు కావడం వల్లే అధికారులు ప్రశ్నాపత్రాల లీకేజీలపై కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యులు ఆరోపిస్తున్నారు. రోజుకో ప్రశ్నపత్రం లీకవుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేకపోవడం పట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చ‌ర్చించాల‌ని స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. స్పీక‌ర్ చ‌ర్చ‌కు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు స్పీక‌ర్ పోడియం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టారు. దీంతో స‌భ‌ను స్పీక‌ర్ ప‌ది నిమిషాల పాటు వాయిదా వేశారు.

Back to Top