అశోక్‌భాన్‌కు ఆదేశాలిచ్చిందెవరు?

‘నా

భర్త శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై నమోదైన కేసు (ఆర్.సి 19 ఎ/2011)ను సీబీఐ దర్యాప్తు చేస్తున్న తీరును, దర్యాప్తు క్రమంలో సంస్థ అవలంబిస్తున్న అన్యాయమైన పద్ధతుల్ని, ఈ కారణంగా నా భర్తతో పాటు ఆయనకు ఆప్తులైనవారు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తెచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. మీ సంస్థ చేస్తున్న దర్యాప్తు.. కేసులోని వాస్తవాంశాల ఆధారంగా కాకుండా.. మొదట్నుంచీ కొన్ని స్వార్థ ప్రయోజనాలు ఆశిస్తున్న శక్తుల నియంత్రణలో, వారి ప్రేరేపణతో, పూర్తి వివక్షతో కొనసాగుతోందని నేను విశ్వసిస్తున్నా. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తును నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా ఇటీవల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆ తర్వాత కొద్దిసేపటికే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై ఏమాత్రం గౌరవం లేకుండా మీ న్యాయవాదులు మీడియానుద్దేశించి మాట్లాడారు. కేసు దర్యాప్తులో తాము గడువుకు కట్టుబడి ఉండాల్సిన పని లేదన్నట్టుగా వారు మాట్లాడారు. అంతేకాదు దర్యాప్తు కోసం మరింత సమయం ఎలా కోరాలో కనుగొంటామని కూడా చెప్పారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ వారు చేసిన ఈ వ్యాఖ్యల వీడియో దృశ్యాలు కలిగిన ఓ డీవీడీని మీ తక్షణ పరిశీలన నిమిత్తం ఈ లేఖకు జత చేస్తున్నాను. నా భర్త గత ఏడాది మే 27వ తేదీ నుంచి జైలు నిర్బంధంలో ఉన్నారు. గత 22 నెలలుగా దర్యాప్తు కొనసాగుతోంది. 2012 అక్టోబర్‌లో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్థాయీ నివేదికలో.. దర్యాప్తు పూర్తి చేసేందుకు 3 నెలల సమయం కావాలని సీబీఐ కోరింది. మళ్లీ ఇదే సుప్రీంకోర్టులో 2013 మార్చి 31 నాటికల్లా తప్పకుండా తుది చార్జిషీటు దాఖలు చేస్తామని సీబీఐ చెప్పింది. 2012 అక్టోబర్ తర్వాత ఎనిమిది నెలలకు 2013 మేలో, బెయిల్ కోసం నా భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో నాలుగు నెలల సమయం కావాలని దర్యాప్తు సంస్థ కోరింది.

ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ 2011 ఆగస్టు 17న నమోదైంది. నా భర్త అన్నివిధాలా సహకరించారు. దీంతో దర్యాప్తు ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందుకు సాగింది. 2012 మే 7వ తేదీ నాటికే మూడు చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత అకస్మాత్తుగా 2012 మే 27న.. ఓ పార్టీకి అధ్యక్షుడైన నా భర్త కీలకమైన 18 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఓ లోక్‌సభా నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఉండగా అరెస్టు చేశారు. ఆయన్ను అరెస్టు చేసిన సమయం కూడా ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అరెస్టు చేసిన సమయం అనుమానాలకు తావిస్తోందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం వ్యాఖ్యానించింది.

దర్యాప్తు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమనేది సుస్పష్టం. నా భర్తను జైల్లోనే ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో కేసు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఆయన్ను జైల్లోనే ఉంచి తన బాసులకు రాజకీయ లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ అధీనంలోని సీబీఐ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏదో ఒక నెపంతో నా భర్తకు బెయిల్ రాకుండా చేసేందుకే.. ‘తుది’ చార్జిషీటు వేసేందుకు గడువు పొడిగించాల్సిందిగా ఎప్పటికప్పుడు దర్యాప్తు సంస్థ కోరుతోంది.

దర్యాప్తు అధికారి, సీబీఐ జాయింట్ డెరైక్టర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుండటాన్ని నా భర్తకు చెందిన రాజకీయ పార్టీ ఎండగడుతూనే ఉంది. ఇతర అంశాలతో పాటు నా భర్తకు, ఆయన పార్టీ ప్రతిష్టకు గరిష్టస్థాయిలో నష్టం వాటిల్లేలా.. దర్యాప్తునకు సంబంధించిన తప్పుడు, ఏకపక్ష సమాచారాన్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న మీడియాకు లీక్ చేయడంపై కూడా నా భర్త పార్టీ ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూనే ఉంది. సీబీఐ దురుద్దేశపూర్వక చర్యలపై మేం గతంలోనే సీవీసీకి ఫిర్యాదు చేశాం. తప్పుడు సమాచారంతో నా భర్త ప్రతిష్టను దిగజార్చడానికి యత్నిస్తున్న పలు మీడియా సంస్థలకు సీబీఐ జేడీ 500 సార్లకు పైగా ఫోన్లు చేయడానికి సంబంధించిన కాల్ లిస్టును కూడా ఆ ఫిర్యాదుతో పాటు సమర్పించాం.

దర్యాప్తులో కీలకమైన, కింద పేర్కొన్న అంశాలపై విచారణ జరిపించాల్సిందిగా కోరేందుకే ఈ లేఖ రాస్తున్నా..
* ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేయడానికి మరో నాలుగు నెలల సమయం పడుతుందంటూ సుప్రీంకోర్టులో చెప్పాల్సిందిగా సీబీఐ న్యాయవాదికి ఆదేశాలిచ్చిందెవరు? నాలుగు నెలల గడువు కోరడానికి ప్రాతిపదిక ఏమిటి? (నా భర్తను జైల్లోనే ఉంచేలా చూసేందుకే అలా సమయం కోరారని నేను గట్టిగా నమ్ముతున్నా..)
* ఈ నెల 9న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే.. సీబీఐ తరఫున మీడియాతో మాట్లాడాల్సిందిగా, గడువును నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ప్రకటనలు చేయాల్సిందిగా మీ న్యాయవాది అశోక్ భాన్‌ను ఆదేశించిందెవరు?

* సుప్రీంకోర్టు చెప్పిన నాలుగు నెలల గడువుకు సీబీఐ కట్టుబడాల్సిన అవసరం లేదని, మరింత గడువును ఎలా కోరాలో కనుగొంటామని చెప్పేలా అశోక్‌భాన్‌కు ఎందుకు ఆదేశాలిచ్చారు? పరస్పర ప్రయోజనాల కోసం దర్యాప్తును జాప్యం చేస్తున్నారనే విషయాన్ని ఇది స్పష్టం చేయడం లేదా?

నా సమస్యలన్నిటినీ సీబీఐలోనే అత్యున్నతాధికారులకు తెలియజేయవచ్చునంటూ నాకందిన సలహా మేరకు.. సీబీఐ డెరైక్టర్ అయిన మీకు ఈ లేఖ రాస్తున్నాను. అంతేగాకుండా సెంట్రల్ విజిలెన్సు కమిషన్ (సీవీసీ)కున్న పర్యవేక్షణాధికారం దృష్ట్యా, ఎలాంటి నేర నిర్ధారణ ఉత్తర్వు లేనప్పటికీ దాదాపు ఏడాదిగా జైల్లో ఉన్న నా భర్త ప్రాథమిక హక్కులు, ఆయన సహచర్యానికి దూరంగా ఉన్న నాతో పాటు నా పిల్లల హక్కులు కాపాడేలా తగిన చర్యలు చేపట్టేందుకూ.. సీవీసీకి కూడా ఈ లేఖ ప్రతిని అందజేస్తున్నాను. ప్రజలకు సేవ చేసే బృహత్తర బాధ్యతను మీకు అప్పగించింది ఈ దేశమే తప్ప.. ప్రేరేపిత, వివక్షాపూరితమైన ఏదైనా రాజకీయ పార్టీయో లేక వ్యక్తో కాదని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను..’’
(సాక్షి సౌజన్యంతో)

Back to Top