అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలి - వైయస్ఆర్ సీపీ డిమాండు

హైదరాబాద్, 27 ఆగస్టు 2012 : ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, వీటి పరిష్కారం కోసం తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌ చేసింది. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది.. విద్యుత్‌ సమస్యలు, శిశుమరణాలు, రాష్ట్రంలో నెలకొన్న ఇతర ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సోమవారం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశమై సమీక్ష జరిపారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం ముఖ్యమంత్రికి విజ్ఞాపన పత్రం అందించాలని వారు నిర్ణయించారు.
ఈ సమస్యలపై చర్చకు అసెంబ్లీ సరైన వేదికని పార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఎడాపెడా విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారంలో మగ్గుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తమ భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు మీడియాతో చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవులను కాపాడుకునేందు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారే తప్ప,. ప్రజల సమస్యలను పట్టించుకోవటంలేదని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దుయ్యబట్టారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర నేతలు విఫలమయ్యారని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలను చూసి అయినా బుద్ధి తెచ్చుకోవాలని ఆమె హితవు పలికారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ప్రజా సమస్యలు పట్టవని శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారమే పరమావధిగా ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి విద్యుత్ సమస్యకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అనుసరించిన విధానాలే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు వి. హనుమంతరావు, తులసిరెడ్డిల అవాకులు, చెవాకులపై తాము స్పందిచబోమని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వీహెచ్ లాంటి నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.

Back to Top