అసెంబ్లీ వద్ద వైయస్‌ఆర్‌ సిపి ఎమ్మెల్యేల ధర్నా

హైదరాబాద్‌, 20 సెప్టెంబర్ ‌2012: రాష్ట్ర శాసనసభ మూ‌డవ గేట్ ఎదుట వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం ధర్నా నిర్వహించారు.  కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వారు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావనకు రాకుండా అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేసి పారిపోతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వైయస్‌ఆర్‌ సిపి ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో తప్పుపట్టారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎమ్మెల్యేలు నిప్పులు  చెరిగారు. 

అసెంబ్లీ మూడవ నంబర్ గేటు బయ‌ట రహదారిపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. శాసనసభ అర్ధంతరంగా శుక్రవారానికి వాయిదా పడిన తరువాత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదా‌స్, భూమన కరుణాక‌ర్‌రెడ్డి, శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు, జి.బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, వై.బాలనాగిరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమా‌ర్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరిని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లగా, మరికొందరిని నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, అనంతరం వదిలిపెట్టారు.
Back to Top