హైదరాబాద్, 15 మార్చి 2013:అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టిన అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న ఆ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఆ రెండు పార్టీల కుమ్మక్కు కుట్ర వెల్లడైందన్నారు.ప్రజల సమస్యలు గాలికి: శ్రీకాంత్ రెడ్డిప్రభుత్వం నుంచి ప్రధాన ప్రతిపక్షం ప్యాకేజీ తీసుకుని ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి టీడీపీపై మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అక్రమాలను ఎక్కడ బయటపడతాయోనని అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాల కుట్ర అసెంబ్లీ సాక్షిగా రుజువైందన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వవద్దని కేవలం తొమ్మిదిమందికే విప్ జారీ చేసిన వైనం దీనిని స్పష్టం చేసిందన్నారు. ప్రజలే కాదు, యావద్దేశమూ టీడీపీ నైజాన్ని వీక్షించారన్నారు. ఎన్టీ రామారావుగారు ఏ ఆశయంతో టీడీపీని స్థాపించారో దానిని చంద్రబాబు నీరుగార్చారని విమర్శించారు. ఈ పరిణామాన్ని చూసి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందన్నారు. ఎన్టీఆర్ ద్వేషించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా మాపైన ఎదురు దాడి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. మేము ప్యాకేజీల కోసమో బెయిలు కోసమో కాదు.. ప్రజా సమస్యలపై అవిశ్వాసం పెట్టామని స్పష్టంచేశారు. గతంలో టీడీపీ అవిశ్వాసం పెట్టినపుడు వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతు పలకడానికీ కారణమిదేనన్నారు. అప్పట్లో చంద్రబాబు, తదితరులు తమ నాయకుణ్ణి ఇష్టమొచ్చినట్లు దూషించినప్పటికీ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆ తీర్మానానికి మద్దతు పలికామని వివరించారు. ఈ రోజుకూడా ప్రజల కోసం అన్న ఒకే ఒక్క అంశంపై తీర్మానాన్ని బలపరిచామన్నారు. ప్రభుత్వం ప్రజల యోగ క్షేమాలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఎన్నికలంటే భయమెవరికో తేలిపోయింది: శోభా నాగిరెడ్డిప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలంటే ఎవరికి భయమో తేలిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీమతి శోభా నాగిరెడ్డి చెప్పారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో కూడా స్పష్టమయ్యిందన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన అంశమే దీనిని వెల్లడించిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతు తెలుపుతున్నట్లు చంద్రబాబు ప్రకటిస్తే ఆ పార్టీ కార్యకర్తలకు స్పష్టత వస్తుందన్నారు. ప్రశ్నించాల్సిన టీడీపీని విడిచిపెట్టి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారని ఆమె మీడియా వేసిన ఓ ప్రశ్నకు ప్రతిగా అడిగారు. అవిశ్వాసంపై తీర్మానం నిబంధనలకు అనుగుణంగానే ఉందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నారని మరో ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ప్రజలు నవ్వుకుంటున్నారు: కృష్ణదాస్అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలన్న టీడీపీ నిర్ణయాన్ని చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తన బాధ్యత మరిచి, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికిందని ఎద్దేవా చేశారు. అవిశ్వాసాన్ని సమర్థించవద్దని తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలను విడిచి సాగుతున్న కాంగ్రెస్ పార్టీని సమర్థించడం ఏమిటని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కలిసి రావాలని కోరారు. వేల కిలోమీటర్లు నడిచినా సమస్యలు తెలియలేదా: రామచంద్రారెడ్డిసమస్యలు తెలుసున్నానని చెబుతున్న సీఎం కిరణ్ వీటిని ఎందుకు తీర్చరని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండు వేల కిలోమీటర్ల పైన నడిచారనీ, ఇంత నడిచినా ఆయనకు విద్యుత్తు, సాగునీరు సమస్యలు తెలియలేదా అని అడిగారు. అంటే పాదయాత్ర బోగస్సా అని ప్రశ్నించారు. వైయస్ఆర్ పార్టీ ప్రయోజనాలు, లాభనష్టాలు మీకు అవసరమా లేక ప్రజల కష్టాలు అవసరమా చెప్పండి చంద్రబాబూ అని నిలదీశారు. ఎప్పుడూ మా గురించి తప్ప ప్రజల గురించి ఆలోచించరా అని అడిగారు. సమస్యలు తెలుసుకుని ఉంటే మీరే అవిశ్వాసం పెట్టి ఉండాల్సిందన్నారు. టీడీపీ వైఖరిని అందరూ గమనిస్తున్నారు: అమర్నాథరెడ్డితెలుగు దేశం కాంగ్రెస్ పార్టీని ఎలా కాపాడుతున్నదీ అందరూ గమనిస్తున్నారని అమర్నాధరెడ్డి చెప్పారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై అవిశ్వాసం పెడితే టీడీపీ మాత్రం దానికి బాసటగా నిలిచిందన్నారు. అన్ని రంగాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ, ప్రధాన ప్రతిపక్షం దానిని విస్మరించిందనీ ఆయన ఎద్దేవా చేశారు.