అసెంబ్లీని తక్షణం సమావేశపరచాలి

హైదరాబాద్, 23 ఏప్రిల్ 2013:

మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి చేపట్టాల్సిన చర్యల గురించి సమగ్రంగా చర్చించడానికి తక్షణం అసెంబ్లీని సమావేశపరచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, అధికార ప్రతినిధి అయిన రోజా పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో పెరుగుతున్న అత్యాచారాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీశారు.

అత్యాచారాల నిరోధానికి చేపట్టాల్సిన చర్యలు, పునరావృతం కాకుండా ఉండడానికి ఏం చేయాలనే అంశాలను చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలనే ఆలోచన ఎందుకు రావడం లేదు ముఖ్యమంత్రి గారూ! అని ఆమె ప్రశ్నించారు. తక్షణం శాసన సభ ఈ అంశంపై చర్చించాలన్నారు. అన్ని పార్టీల నేతలతో మాట్లాడి మహిళలను రక్షించడానికి సమగ్రమైన నిర్ణయాలను తీసుకోవాలని రోజా సూచించారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అధికారంలో ఉన్న యూపీఏ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీని ఆమె ఈ అంశపై నిందించారు. రాష్ట్రంలో రోజురోజుకూ అత్యాచారాల సంఖ్య పెరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

అత్యాచార కేసులలో నిందితులకు భయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అసమర్థత, నిందితులను శిక్షించడంలో ఉదాశీనత ఇందుకు కారణమవుతున్నాయని ఆమె ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకీ, ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికీ, రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే హోం శాఖకూ మహిళలే ఉన్నత స్థానంలో ఉన్నారనీ అయినప్పటికీ మహిళలపై అత్యాచారాలు నానాటికీ పెరుగుతుండటం శోచనీయమనీ రోజా ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో ఐదేళ్ళ బాలిక అత్యాచారం, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మహిళలపై సాగుతున్న అఘాయిత్యాలను ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఐదేళ్ళ బాలిక, మనసిక వికలాంగురాలు పురుషులను ఎలా రెచ్చగొడతారని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని రోజా చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసుల సేవలను ఉపయోగించుకుని ప్రజలను రక్షించడానికి కానీ, వారి సమస్యలను తీర్చడానికి కానీ ఆసక్తి చూపడం లేదని ఆమె విమర్శించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చూపుతూ తమ రాజకీయ మనుగడపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు వీటిపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరించి ఉంటే మహిళల, రైతుల సమస్యలు ఏనాడో పరిష్కారమై ఉండేవని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలను రక్షించేందుకు పోలీసు బలగాన్ని సక్రమ రీతిలో వినియోగించుకోవాలని రోజా సూచించారు.

మద్యం అమ్మకాల పెంపుపై మాత్రమే సీఎం కిరణ్ శ్రద్ధ చూపుతున్నారన్నారు. మంచినీరు, తదితర  సమస్యల పరిష్కారంలో ఆయన చొరవచూపడం లేదని విమర్శించారు. మద్యం తయారీని 7.5 కోట్ల లీటర్ల మేరకు పెంచడానికి ప్రభుత్వం 35 జీవోలను విడుదల చేసిందంటే ప్రభుత్వానికి దానిపై ఉన్న శ్రద్ధ అర్థమవుతుందని రోజా చెప్పారు. దివంగత మహానేత హయాంలో 4200 కోట్లున్న ఎక్సయిజ్ ఆదాయం ఇప్పుడు ఇరవై వేల కోట్లకు పెరిగిందని ఆమె ఉదహరించారు.

Back to Top