అసెంబ్లీ గురువారానికి వాయిదా

హైదరాబాద్‌, 18 సెప్టెంబర్‌ 2012: తీవ్ర గందరగోళం మధ్య శాసనసభ సమావేశాలు గురువారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉదయం రెండవ రోజు సభ ప్రారంభమైనప్పటి నుంచీ తెలంగాణపై తీర్మానం పెట్టాలంటూ టిఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. తెలంగాణ నినాదాలు చేస్తూ వారంతా స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకుపోయారు. సభలో పరిస్థితి సర్దుమణగకపోవడంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అరగంట పాటు వాయిదా వేశారు.‌

అనంతరం శాసనసభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల శాసనసభాపక్ష నేతలతో స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్ సమావేశం నిర్వహించారు. అయితే, అక్కడ కూడా టిఆర్‌ఎస్‌ సభ్యులు పంతం విడిచిపెట్టలేదు. తెలంగాణ తీర్మానంపై వెనక్కి తగ్గేది లేదని కరాఖండిగా చెప్పారు. దీనితో ఫ్లోర్‌లీడర్ల భేటి ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసింది. ఫ్లోర్ లీడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకుండానే సమావేశం ముగిసింది. ఈ భేటీలో తెలంగాణ తీర్మానంపై ప్రతిష్టంభన తొలగకపోవడంతో తాము వెనక్కి తగ్గేది లేదని టీఆ‌ర్ఎ‌స్ స్పష్టం చేసింది.

‌కాగా, ఫ్లోర్ లీడర్ల భేటీలో విద్యుత్‌ సమస్యపై చర్చించేందుకు రాజకీయ పక్షాలు సిద్ధమని తెలిపాయి. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సోనియాకు లేఖ రా‌యాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ సోనియాకు త్వరలో లేఖ రాయనున్నట్టు తెలంగాణ వ్యక్తికి సీఎం పదవి, తెలంగాణ అభివృద్ధిమండలి పరిష్కారం కావని టీ కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు.

వాయిదా అనంతరం అసెంబ్లీ తిరిగి సమావేశమైనప్పటికి టిఆర్‌ఎస్‌ సభ్యుల తీరులో ఎలాంటి మార్పూ రాలేదు.‌ దీనితో‌ సభను గురువారం ఉదయం 9 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. 

అంతకు ముందు శాసనసభ సమావేశాలు రెండో రోజు కూడా ఆందోళనలతో మొదలయ్యాయి. సమావేశాల ప్రారంభంతోనే విపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుపట్టాయి. టీఆర్ఎ‌స్ ఎమ్మెల్యేలు మంగళవారం కూడా తెలంగాణపై తీర్మానం పెట్టాలంటూ స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. స్పీక‌ర్‌ మనోహర్ ఎంతగా నచ్చజెప్పినా వారు శాంతించలేదు. తెలంగాణ నినాదాలతో సభలో హోరెత్తించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. మరోవైపు, అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలంటూ ఫ్లకార్డులతో తెలుగుదేశం పార్టీ నిరసన తెలిపింది.
Back to Top