'అసమర్థ కాంగ్రెస్‌కు జనం గుణపాఠం తథ్యం'

మిర్యాలగూడ (నల్గొండజిల్లా) : ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి‌ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ దక్షిణ తెలంగాణ‌ ప్రాంత సమన్వయకర్త జిట్టా బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. మిర్యాలగూడలోని వైయస్‌ఆర్‌సిపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో, ఆయన రెక్కల కష్టంతోనే 2009లో‌ రాష్ట్రంలో కాంగ్రె‌స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని జిట్టా పేర్కొన్నారు. పేదల అభివృద్ధికి డాక్టర్ వై‌యస్ ప్రవేశపెట్టిన ‌అనేక పథకాలను ఆయన మరణానంతరం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ‌దుయ్యబట్టారు.‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం జీవితాంతమూ శ్రమించిన మహానేత వైయస్‌ఆర్ కుటుంబాన్ని ఆ పార్టీ అధిష్టానం అభాసుపాలు చేసేందుకు యత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ‌సిబిఐని కీలుబొమ్మగా వాడుకొని శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా జైలులో ఉంచుతోందని బాలకృష్ణారెడ్డి ఆరోపించారు. శ్రీ జగన్‌కు బెయిల్ వస్తుందనుకున్న సమయంలోనే ఉద్దేశపూర్వకంగా ‌సిబిఐ ద్వారా ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నదని అన్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించడం ద్వారా వైయస్‌ఆర్‌సిపిని నిర్వీర్యం చేయవచ్చని కాంగ్రెస్ పెద్దలు అనుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో తమ పార్టీకి తిరుగులేని ప్రజాభిమానం ఉంద‌ని జిట్టా బాలకృష్ణారెడ్డి ధీమాగా చెప్పారు. తెలంగాణలోనే 60 నుంచి 70 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకునే సత్తా వైయస్‌ఆర్‌సిపికి ఉందన్నారు.

రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే శ్రీ వైయస్ జగ‌న్ సోదరి‌ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రగా వస్తున్నారని జిట్టా తెలిపారు. ఆమె పాదయాత్ర ఈ నెల 16న మిర్యాలగూడ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని ఆయన తెలిపారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజీవ్ చౌ‌క్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ సభకు మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల నుంచి ‌అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వైయస్‌ అభిమానులు తరలిరావాలని జిట్టా పిలుపునిచ్చారు.

ఈ మీడియా సమావేశంలో వైయస్‌ఆర్‌సిపి సీఈసీ సభ్యురాలు పాదూరి కరుణ, పార్టీ కార్యక్రమాల కమిటీ సమన్వయకర్త తలశిల రఘురాం, నాయకులు విక్రాంత్‌రెడ్డి, ముండ్లగిరి కాంతయ్య, ఎం.డి. ఖాసిం, నర్సిరెడ్డి, అంజిరెడ్డి, మారేపల్లి అమృతారెడ్డి, బాలస్వామి, మౌలానా, బాలేమియా, విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top