అసమర్థ పాలనపై పోరాటం..!

చంద్రబాబుపై నెహ్రూ ఫైర్..!
ప్రాణాలు పోతున్నా చలనం లేదు..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనపై నిప్పులు చెరిగారు. ప్రత్యేకహోదాపై కేంద్రప్రభుత్వం నీరుగారుస్తుంటే చంద్రబాబు దానికి వత్తాసు పలుకుతున్నాడని నెహ్రూ మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేకహోదాకు అనుకూలమా లేక వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకహోదాను మూతబడేయాలన్న దురాలోచన,దుర్బుద్దితో చంద్రబాబు ఉన్నారని నెహ్రూ అన్నారు. నాటకీయ పరిణామాలతో ప్రధానిని ఏమీ అడగకుండా అడిగినట్లు నటిస్తూ చంద్రబాబు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని నిప్పులు చెరిగారు. 

ప్రత్యేకహోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల ప్రజానీకాన్ని మోసం చేస్తున్నాయన్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా శకం ముగిసిందని చెప్పడం పచ్చిదగా, మోసం అని నెహ్రూ విమర్శించారు. ప్రతిపక్షనేత,వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన హైదరాబాద్ లోటస్ పాండ్ లో ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై పోరాడాలని నిర్ణయించారు.

 
శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ప్రధాని ప్రత్యేకహోదా ప్రకటన చేస్తారని ప్రజలంతా ఆశించారని, కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారన్నారు.  ప్రధాని మనీ తెచ్చింది వాస్తవమేనని మట్టి, నీరు అనే మనీ తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు.  చంద్రబాబు ఆడుతున్న అంతర్నాటకానికి ఎంతోమంది బలైపోతున్నారని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా చంద్రబాబు మారడం లేదన్నారు. ప్రత్యేకహోదాపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు దాని గురించి స్పష్టత ఇవ్వాలన్నారు. తీసుకురాలేకపోతే తప్పుకోవాలని తాము పోరాడి సాధించుకుంటామన్నారు. 

ప్రజలను మభ్యపెడుతూ మోసాలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు. నెల్లూరులో కండలేరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తూ కూడా చంద్రబాబు అబద్ధాలు చెప్పారన్నారు.  ఏమీ చేయకుండానే అంతా చేశానని చెప్పుకుంటూ నయవంచనకు పాల్పడ్డం చంద్రబాబుకే చెల్లిందన్నారు. కరువు మండలాల ప్రకటనలో మోసం, రైతులకు నీళ్లు ఇవ్వడంలో వైఫల్యం, రాయలసీమకు కనీసం తాగునీరు ఇవ్వని దుస్థితి. నిత్యవసర ధరలను  కట్టడి చేయడంలోనూ విఫలం చెందారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 


చంద్రబాబు పరిపాలనంతా దగాకోరు పరిపాలేనని దుయ్యబట్టారు.  ఆంధ్రరాష్ట్ర ప్రజలు ఆకలి కేకలతో ఉంటేనే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తారని చంద్రబాబు భ్రమపడుతున్నాడని నెహ్రూ విమర్శించారు. ప్రభుత్వ అసమర్థ పాలనపై వైఎస్సార్సీపీ పోరాడుతుందని నెహ్రూ తేల్చిచెప్పారు.  చంద్రబాబు దమ్ముంటే ప్రత్యేకహోదా కోసం పోరాడు...లేకపోతే చేతులెత్తెయ్ అందుకు మేం సిద్ధంగా ఉన్నామని నెహ్రూ సవాల్ విసిరారు. . 

Back to Top