అసమర్థ సీఎం వల్లే సంక్షోభం..!

హైదరాబాద్: వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు  రైతుల మీదగానీ, వ్యవసాయాన్ని ఆదుకోవాలన్న తలంపుగానీ ఏకోశాన లేదని మండిపడ్డారు. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించడంపై చంద్రబాబు స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. దేశం మొత్తం మీద లెవీ ఎత్తివేస్తున్నామని కేంద్రం నిర్ధారించినా  చంద్రబాబు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. 

చంద్రబాబు అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిందని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. వరికి 1450 రూపాయల కనీస మద్దతు ధర సరిపోదని.. రైతులకు  క్వింటాల్కు 200 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఏడాదికి మూడు పంటలు పండే భూములను లాక్కొని... రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక ఉత్పత్తి దారుడు, ధరలు విపరీతంగా పెరిగిపోయి వినియోగదారుడు విలవిలలాడుతున్నాడని బొత్స అన్నారు.  ఇలా ఉంటే సామాన్యుడు ఏం తిని బతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదోడిపై ఎందుకంత వివక్ష చూపుతున్నారని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు కొనసాగిస్తుందని బొత్స స్పష్టం చేశారు.


Back to Top