అశాంతికి కారణం కాంగ్రెస్ పార్టీనే

గుంటూరు, 26 జనవరి, 2013:

రాష్ట్రంలో ప్రస్తుత అలజడులకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టంచేశారు. సక్రమంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గుంటూరులో శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన సర్వేలలో రెండు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనీ, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే అత్యధిక స్థానాలు దక్కుతాయనీ వెల్లడైందన్నారు. ఆయన 2014లో ముఖ్యమంత్రి కాబోతున్నాడని తెలిసిన తర్వాత ఏం చేయాలో పాలుపోని స్థితిలో కాంగ్రెస్ పడిపోయిందన్నారు. ఈ క్రమంలో అల్లకల్లోలం సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనీ, ఓట్టు ఏరుకోవాలనీ ఒక నీచమైన ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. దీనికి తెలుగు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని అంబటి హెచ్చరించారు. రాష్ట్ర, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రం ప్రశాంతంగా ఉండడానికి ఎలాంటి ప్రయత్నం చేయదలచుకున్నారో తెలిస్తే ఒక ప్రతిపాదన పెట్టాలని సూచించారు. అందర్నీ ఆహ్వానించి ఆ ప్రతిపాదనను వారి ముందుంచి అభిప్రాయాలను కోరాలన్నారు. అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేస్తోందని కొందరు, లేదని మరికొందరు, ప్యాకేజీ ఇస్తున్నారని మరికొందరితో ప్రచారం చేయించి, తద్వారా ఏర్పడిన అశాంతి వాతావరణాన్ని ఓట్లుగా మలచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని అంబటి మండిపడ్డారు. ఎన్ని ఎత్తులు వేసినా, కుట్రలు చేసినా శ్రీ జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణను తగ్గించలేరని స్పష్టంచేశారు. అశాంతి తొలగించేందుకు వీలుగా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అంబటి కోరారు.

Back to Top