ఆర్యవైశ్యులకు భద్రత కరువు

నంద్యాల: రాష్ట్రంలో ఆర్య వైశ్యులకు భద్రత కరువైందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులపై దాడులు అధికమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆర్యవైశ్యులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఈ క్రమంలోనే హత్యా రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలకు తెర లేపారని విమర్శించారు. అన్యాయంగా వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకొని అనైతిక రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అనాగరికంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో నలుగురికి మంత్రి పదువులు ఇచ్చారని తప్పుపట్టారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టి పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. గతేడాది మాచెర్లలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రీదేవి ఆత్మహత్యకు టీడీపీ నేతలే కారణమన్నారు. ఇటీవల కుటుంబ రావును టీడీపీ నేతలు బెదిరించారని తెలిపారు. నంద్యాలలో రోడ్డు విస్తరణ చేపట్టాలని గతంలో శిల్పా మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు పలుమార్లు చంద్రబాబును కోరినా పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలు రావడంతో హడావుడిగా విస్తరణ పనులు చేపట్టి వ్యాపారులకు నీడ లేకుండా చేశారని మండిపడ్డారు. ఆర్యవైశ్యులకు అన్యాయం చేసిన చంద్రబాబు సర్కార్‌కు ఉప ఎన్నికల్లో గుణపాఠం తప్పదని వెల్లంపల్లి హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top