ఆర్యవైశ్యుల రుణం తీర్చుకుంటా : శిల్పా మోహన్‌ రెడ్డి

నంద్యాల: తనకు అండగా ఉన్న ఆర్యవైశ్యుల రుణం తీర్చుకుంటానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు.  ఆర్యవైశ్యులతో 35 ఏళ్లుగా తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారికి చివరి వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నంద్యాల పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో శిల్పా మాట్లాడారు. తనకు ఆర్యవైశ్యులు 2004, 2009, 2014 ఎన్నికల్లో అండగా నిలిచిన ఆర్యవైశ్యులకు రుణపడి ఉంటానని, ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో కూడా ఎప్పటిలాగే తమ సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యులలో చాలా మంది పేద వాళ్లు ఉన్నారని,  అలాంటి వారికి రైతు నగర్‌ వద్ద స్థలాలు కూడా కేటాయించామన్నారు.  వంద కోట్ల ఆస్తిని ఎవరు లాక్కున్నారో ఆర్యవైశ్యులు ఆలోచించాలన్నారు. శిల్పామోహన్‌రెడ్డి ఎవరినైనా బెదిరించారా అని ప్రశ్నించారు.  ఉప ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైయస్‌ఆర్‌సీపీని గెలిపించాలని అభ్యర్థించారు.

Back to Top