ముందస్తు అరెస్టులు అన్యాయం

  • ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదు
  • పైడిపాలెం రిజర్వాయర్‌ వైయస్‌ఆర్‌ స్వప్నం
  • ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
వైయస్ఆర్ కడప: వైయస్‌ఆర్‌ జిల్లాలోని పైడిపాలెం రిజర్వాయర్‌ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నమని కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. మహానేత హయాంలో 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టును తానే కట్టించానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా వైయస్‌ అవినాష్‌ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. పులివెందుల వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో ఆయనను నిర్భంధించారు. పైడిపాలెం రిజర్వాయర్‌ వద్దకు వెళుతున్నఅవినాష్‌ రెడ్డి, మాజీమంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి తదితర నేతలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు తమకు ఆహ్వానం ఉందని వారు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి నిర్భందాలు మంచిది కాదని హితవు పలికారు. 

ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పైడిపాలెం జలాశయానికి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తమను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  పైడిపాలెం రిజర్వాయర్‌ను వైయస్‌ రాజశేఖరరెడ్డి 90 శాతం పనులు పూర్తి చేశారని, అయితే చంద్రబాబు ఇప్పుడు అన్ని తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. తనను నిర్బంధించడం ప్రతిపక్షాల గొంతు నొక్కడమే అని అన్నాపు. జన్మభూమిలో సమస్యలు చెప్పుకోవాలంటున్నారని, మరి సమస్యలు చెప్పడానికి వస్తే అరెస్ట్‌ చేయడం న్యాయమా అని అవినాష్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.  ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజలు తిరుగబడతారని అవినాష్‌రెడ్డి హెచ్చరించారు

Back to Top