జననేతను చూసి తట్టుకోలేకపోతున్న గుండెలు..!దీక్షాస్థలి వద్ద యువకుడి ఆత్మహత్యాయత్నం
రైల్వేకోడూరులో మహిళాకార్యకర్త సూసైడ్ అటెంప్ట్..!ఎస్వీ యూనివర్సిటీలో పెట్రోల్ పోసుకున్న విద్యార్థి..!
గుంటూరుః ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్యం విషమించడంతో రాష్ట్ర ప్రజలు అనుక్షణం భయపడుతున్నారు. ఏక్షణాన ఏమవుతుందోనని విలవిలలాడుతున్నారు. వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుండడం కలవరపరుస్తోంది. దీక్షాస్థలి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పార్టీనేతలు, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.
వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు లోనూ ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసింది. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా ప్రత్యేకహోదా కోసం ఇవాళ రైల్వే కోడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా రంగమ్మ అనే మహిళా కార్యకర్త సూపర్ వాస్మాల్ అనే ద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే తేరుకున్న కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మరో దారుణం చోటుచేసుకుంది. వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా.. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న మాసుమయ్య అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. గత నాలుగు రోజులుగా ప్రత్యేక హోదా ఉద్యమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఈక్రమంలోనే విద్యార్థులు ఇవాళ తరగతులను బహిష్కరించి.. ఏడీ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ఇదే సందర్భంలో మాసుమయ్య తన ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సమయానికి తోటి విద్యార్థులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.