వలస నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు

ఏపీ అసెంబ్లీ: మన రాష్ట్రానికి చెందిన వలస కూలీలను కేరళ ప్రభుత్వం గుర్తించి పరిహారం ఇస్తే మన ప్రభుత్వానికి అవమానం కాదా అని ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వలసల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. మెరుగైన జీవనం కోసమే కూలీలు వలస  వెళ్తున్నారని అనంతపురం జిల్లా కలెక్టర్‌ నివేదిక ఇవ్వడాన్ని ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఖండించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర భారత దేశంలోనే ఉపాధి హామీ పథకం కూలీలకు వరం లాంటిది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మొట్టమొదటి అనంతపురం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఈ జిల్లా నుంచే లక్షలాది మంది కూలీలు వలసలు వెళ్తున్నారు. నిన్నటి రోజు అనంతపురం రైతు కూలీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కూలీలు, జర్నలిస్టులు వలసపై కేరళ వెళ్లి పరిశీలించారు. అక్కడ గుర్తింపు కార్డులు, నెలకు 25 కేజీల బియ్యం, ఏడు కేజీల గోదుమలు ఇస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలో మాత్రం మెరుగైన జీవితం కోసం వలసలు పోతున్నారని చెబుతున్నారు. అనంతపురం జిల్లాలోనే మూడు లక్షల మందికి పైగా కూలీలు వలస వెళ్లారు. పనికి ఆహార పథకంగా మార్చిన ప్రభుత్వం పనుల ఎంపిక విషయంలో కూడా ఈ రోజు నిబంధనలు పాటించడం లేదు. గ్రామ సభలు, కూలీలు నిర్ణయించాల్సిన పనులను ఏకపక్షంగా నిర్ణయిస్తున్నారు. కేరళ ప్రభుత్వం గుర్తిస్తే మన ప్రభుత్వానికి అవమానంగా లేదా? వలస కూలీలు దారుణ జీవితాలు అనుభవిస్తున్నారు. కలెక్టర్‌ నివేదిక ఇచ్చారని చెబుతున్నారు. లక్ష జీతం ఇస్తాం కలెక్టర్‌ కాల్వలు ఊడ్చుతారా? కలెక్టర్‌ ఇలాంటి నివేదికలు ఇవ్వడం దారుణం.

Back to Top