నీవు ఓ ముఖ్యమంత్రివేనా

మహిళల ఆగ్రహానికి బాబు బలైపోతారు
బాబు చేష్టలు చూసి దేశం నివ్వెరపోతోంది
ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో...
పుట్టనందుకు ధన్యులమంటున్నారు
మహిళలను బాబు మోసగించారు
యనమల కమెడీయన్ కు ఎక్కువ..
కామెడీ విలన్ కు తక్కువః రోజా

హైదరాబాద్ః తెలుగుదేశం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న చేష్టలు, మాట్లాడుతున్న మాటలు, ఆడుతున్న నాటకాలు చూసి... యావత్ దేశం నివ్వెరపోతుందని రోజా అన్నారు. వాళ్లు చెబుతున్నదానికి, జరుగుతున్నదానికి ఎక్కడ పొంతన లేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో పుట్టనందుకు ధన్యులమని పక్కరాష్ట్రం వాళ్లు భావిస్తున్నారన్నారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై చర్చ జరగాలని, బాధిత మహిళలకు రక్షణగా నిలవాలని తాము కోరితే..దాంట్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇరుక్కున్నారని వారిని తప్పించేందుకు బాబు నిస్సిగ్గుగా, రూల్స్ కు విరుద్ధంగా... తనను సభనుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేయించారని రోజా ఫైరయ్యారు. మహిళలను వేధిస్తే అంతుచూస్తానన్న చంద్రబాబు...మహిళలను వ్యభిచారకూపంలోకి లాగిన తన ఎమ్మెల్యేలను వెనకేసుకురావడం దుర్మార్గమన్నారు. 

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరుడి భార్య  ఓ మహిళ దగ్గర 6 లక్షలు డబ్బులు తీసుకొని.. తిరిగి మళ్లీ బాధితురాలిపైనే పోలీసు కేసు పెట్టించిందన్నారు. రాజధానిని  సింగపూర్ చేస్తా, జపాన్ చేస్తా, ప్రపంచపఠంలో పెడుతానంటున్న బాబు...అక్కడ జరిగే కాల్ మనీ సెక్స్ రాకెట్ ను ఎందుకు ఆపలేకపోతున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రంలోని మహిళలంతా బాబును అసహ్యించుకుంటున్నారని రోజా పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోపల, వెలుపల మహిళల హక్కులకు రక్షణ లేకుండా పోయిందని రోజా వాపోయారు. మహిళా ప్రజాప్రతినిధిగా మహిళల తరపున వాదిస్తున్న తనను అవమానించి ఏడాదిపాటు సస్పెండ్ చేయడమే గాకుండా....ప్రభుత్వం కోర్టు తీర్పును కూడా ధిక్కరించిన విధానాన్ని అందరూ చూశారన్నారు.

బాబుకు కూతురు లేదు కాబట్టే మహిళల విలువ తెలియడం లేదని రోజా చురక అంటించారు. ఏపీలో సగభాగమైన మహిళల గురించి, కాల్ మనీ సెక్స్ రాకెట్  గురించి మాట్లాడవద్దంటూ చంద్రబాబు మాట్లాడిన తీరు చూసి మహిళలంతా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారన్నారు. మహళల గురించి మాట్లాడవద్దంటున్న ఈ ప్రభుత్వం ఎందుకు, ఈపాలకులు ఎందుకు, బాబు అసలు అసెంబ్లీ ఎందుకు నడిపిస్తున్నారని మహిళలంతా అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. బాబు మహిళా వ్యతిరేకి కాబట్టే, ఓ మహిళా ఎమ్మెల్యేపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారన్నారు. డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసి చంద్రబాబు వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడని రోజా ఫైరయ్యారు. తన పార్టీ నాయకులను కాపాడుకుంటే చాలు, మహిళలు ఎటుపోయినా పర్వాలేదని... బాబు ప్రవర్తించిన తీరును చూసి ప్రతిఒక్కరూ చీధరించుకుంటున్నారన్నారు. ఇలాంటి వ్యక్తికా తాము ఓటేసిందని మహిళలంతా బాధపడుతున్నారన్నారు. వనజాక్షిని కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి క్లీన్ చీట్ ఇచ్చిన బాబుకు.... బుద్ధి చెప్పాలని మహిళా ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారని రోజా స్పష్టం చేశారు.

చంద్రబాబు శాసనసభను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా వాడుకుంటూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని రోజా నిప్పులు చెరిగారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన పాలకులు రాజ్యాంగాన్ని మట్టుబెట్టే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు విలువల గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఓటుకు నోటు కుంభకోణం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కొనడమేనా బాబు నీకున్న విలువలని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయించిన  8 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం ఏకంగా రాజ్యాంగాన్ని, అసెంబ్లీ రూల్స్ ను కూడా ఉల్లంఘించిన ఘనడు దేశంలో ఎవరైనా ఉన్నాడంటే అది చంద్రబాబు మాత్రమేనన్నారు. స్పీకర్ వ్యవస్థపై ప్రజల్లో ఉండే గౌరవాన్ని తగ్గించేలా ...బాబు నీతిమాలిన, నియంత చర్యలకు పాల్పడిన వైనాన్ని అందరం కళ్లారా చూశామన్నారు. 

తెలంగాణలో సంతలో పశువులు కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మాట్లాడిన బాబు...ఏపీలో మాత్రం పార్టీ మారుతున్న వారికి అభివృద్ధి చూసి వస్తున్నారని స్క్రిప్ట్ రాసివ్వడం సిగ్గుచేటన్నారు. అక్కడ అయితే అధికార దుర్వినియోగం అంటారు. స్పీకర్ పై కోర్టుకు వెళ్తామంటారు. అదే ఏపీలో అయితే స్పీకర్ ను ప్రశ్నించే అధికారం లేదు. కోర్టుకు ఎళా  వెళతారని మాట్లాడుతున్నారు. బాబు ప్రవర్తన చూసి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ముక్కున వేలు వేసుకుంటున్నారని చెప్పారు. ప్రపంచానికే పాఠాలు చెప్పానని గొప్పలు చెప్పుకునే బాబు రాజ్యాంగాన్ని ఏనాడైనా చదివారా..? ఓ సారి చదువుకుంటే బాగుంటుందని సూచించారు.  35 ఏళ్ల క్యారెక్టర్ అని మాట్లాడుతున్నావ్..కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనా బాబు మీ క్యారెక్టర్ అని నిలదీశారు. ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కోసం రాజ్యాంగాన్ని పాతరేయడమేనా బాబు మీ నీతి అని ప్రశ్నించారు. 

ఆనాడు స్పీకర్ కుర్చీని అడ్డుపెట్టుకొని ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి ఎలా చంపించారో ...ఇవాళ అదేవిధంగా స్పీకర్ ను అడ్డుపెట్టుకొని బాబు అడ్డగోలుగా రాజకీయాలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఇదేనీ బాబు  మీ విశ్వసనీయత అని ప్రశ్నించారు. పార్టీలో చేర్చుకున్న వారి మెడలో పసుపు కండువాలు వేసి జనం మధ్యకు వెళ్లి ఓట్లు వేయమని అడిగే దమ్ముందా బాబు నీకు...? అసలు నీవొక ముఖ్యమంత్రేనా..? మీదొక రాజకీయ పార్టేనా...? అంటూ రోజా విరుచుకుపడ్డారు. బాబుకు పాలించే అర్హతే లేదని అంటూ నిప్పులు చెరిగారు. పట్టిసీమలో ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టి దేవినేని ఉమ అడ్డంగా దోచేసుకుంటే కంటిచూపుతో బాబు అవినీతిని ఎందుకు అంతం చేయలేదని ప్రశ్నించారు. ఇద్దరు సీఎస్ లు తిరస్కరించినా తాగునీటి ప్రాజెక్ట్ లో ఆరువేల కోట్లు దేవినేని దోచుకుంటుంటే, రాజధానిలో లక్ష కోట్ల భూదందా జరుగుతుంటే, అగ్రిగోల్డ్ భూముల్ని మంత్రులు కొనుగోలు చేస్తుంటే, మంత్రి పీతల సుజాత ఇంట్లో పదిలక్షలతో పట్టుబడితే...ఆ అవినీతిని బాబు కంటిచూపుతో ఎందుకు అంతం చేయయడం లేదని నిలదీశారు. 

కాల్మనీ సెక్స్ రాకట్ లో మహిళలు నరకకూపంలో ఇరుక్కుపోతున్నారు.  విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డ్వాక్రామహిళలు అప్పులపాలై రోడ్డుమీదకు వస్తున్నారు. కల్తీమద్యంతో మహిళల జీవితాలు దుర్భరంగా మారాయి. మహిళల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే..
 మహిళలకు బడ్జెట్ లో మొండిచేయి చూపారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చాక  మహిళలను మోసం చేశారు. ఇసుక రీచ్ లు డ్వాక్రామహిళలకు కట్టబెట్టామని చెప్పి చిల్లర విదిల్చారు. ఇసుకలో మంత్రులు, ఎమ్మెల్యేలు రూ. 2 వేల కోట్లు దోచుకున్నారని ఈనాడులోనే వచ్చింది. ఎన్నికల ముందు మహిళల భద్రత కోసం టోల్ ఫ్రీ అన్నారు. స్కూల్ పిల్లలకు సైకిళ్లు ఇస్తామన్నారు. విద్యార్థిణులకు స్మార్ట్ ఫోన్లు అన్నారు. రుణామాఫీ చేయలేదు. ప్రత్యేక పోలీసు అధికారి అన్నారు. దాని ఊసే లేదు. మహిళలను కేవలం ఓటర్లుగానే చూస్తున్నారు గానీ...ఎక్కడ కూడా వారి రక్షణ కోసం ఆలోచన చేయడం లేదన్నారు. మహిళల ఆగ్రహానికి చంద్రబాబు బలైపోవడం ఖాయమన్నారు. 

 ప్రజాసమస్యలపై పోరాడుతున్న పోరాటంలో భాగంగా తాను సంధించిన ప్రశ్నలకు టీడీపీ వాళ్లు ఒక్కదానికైనా సమాధానం చెప్పారా అని రోజా నిలదీశారు. అంగన్ వాడీల జీతాల పెంపు, కా.సె.,  రిషితేశ్వరి సహా ఎన్నో అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానని...కానీ వాటికి సమాధానం చెప్పకుండా రోజారెడ్డి, జబర్దస్త్ అంటూ కామెంట్స్ చేస్తున్నారని ఫైరయ్యారు. మేం చెప్పిందే రూల్స్ అని మాట్లాడుతున్నారు. అన్నీ నాకే తెలుసని  అహంకారంతో విర్రవీగే మంత్రి యనమల...ఇవాళ టంగ్ స్లిప్ అయి రూల్ 340(2) అని చెప్పాం, సారీ అని చేతులు కట్టుకుంటున్నారు. యనమల కామెడియన్ కు ఎక్కువ..కామెడీ విలన్ కు తక్కువ అని రోజా ఎద్దేవా చేశారు. అన్నీ నాకే తెలుసు,  ఏమైనా మాట్లాడవచ్చని యనమల భంగపడ్డాడన్నారు. 

మహిళా ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తుంటే తమ గొంతు నొక్కుతున్నారు. మా గొంతునొక్కడం ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమేనని రోజా అన్నారు.తాము కోర్టులను గౌరవిస్తుంటే...అధికారపక్షం కోర్టులను ధిక్కరిస్తుందని, దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని రోజా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు సస్పెన్షన్ ను పరిష్కరించి మళ్లీ ప్రజాప్రతినిధిగా ప్రజాసమస్యలను విన్నవించేవిధంగా తనకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని రోజా తెలిపారు. టీడీపీ నేతలు తమపై చేసిన దూషణలపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తే వాటిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదని..కేవలం అనిత చెప్పిందనే ఎందుకు విచారణ చేపట్టారో చెప్పాలన్నారు. చంద్రబాబుకు, యనమలకు అనిత అంటే ఎందుకంత ఇంట్రస్టో చెప్పాలని చురక అంటింతారు. అడ్డదిడ్డంగా అందర్నీ సస్సెండ్ చేసుకుంటూ పోతే ప్రజాసమస్యలు ఎలా పరిష్కారమవుతాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. 
Back to Top