ఏపీలో ఉన్నామా? బ్రిటీష్ పాలనలో ఉన్నామా?

  • ప్రత్యేకహోదాను కట్టడిచేసేందుకు బాబు కుట్ర
  • తన స్వార్థ కోసం హోదాను తాకట్టు పెట్టారు
  • తమిళనాడును చూసైనా బాబు సిగ్గుతెచ్చుకోవాలి
  • ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు
  • ప్రత్యేక హోదా కోసం జనవరి 26న క్యాండిల్‌ ర్యాలీ
  • విశాఖ ఆర్కే బీచ్‌ ర్యాలీలో పాల్గొననున్న వైయస్‌ జగన్‌
  • అందరూ కలిసిరావాలని వైయస్ జగన్ విజ్ఞప్తి
హైదరాబాద్‌:  దేశం మొత్తం చూసేట్టుగా చెప్పడానికి మరోమారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సన్నద్ధమవుతున్న సనమయంలో ప్రత్యేక హోదాను కట్టడి చేసేందుకు, ఈ అంశం ప్రస్తావనను తొక్కేసేందుకు సాక్ష్యాత్తుగా సీఎం చంద్రబాబు ముందడుగు వేయడం బాధాకరమని వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. బాబు తీరు బాధకలిగించినందునే ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడాల్సి వచ్చిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైయస్ జగన్ మాట్లాడుతూ.... ప్రత్యేకహోదా అంశంపై గతంలో చాలా సార్లు ధర్నాలు, నిరాహారదీక్షలు చేశామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదాను సాధించేందుకు ముఖ్యమంత్రి మనకు తోడుగా నిలవాల్సిన సమయంలో దాన్ని నీరుగార్చాలని చూడడం దారుణమని చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...



ఏకంగా పార్లమెంట్‌నే సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై ఇచ్చిన మాటను నిలుపుకోలేని స్థితిలో ప్రజాస్యామ్యం ఉంది.  ఇవాళ ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌ పెడుతూ..హోదాలోని అన్ని అంశాలు ప్యాకేజీలోకి వచ్చాయని, కాబట్టి హోదా అడగడం లేదన్నారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు..?నిజంగా అందులోని అన్ని అంశాలు మనకు అందాయా? ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చే పారిశ్రామిక రాయితీలు హోదా లేని రాష్ట్రాలకు ఇవ్వలేదు. ఇలాంటి రాయితీలు వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న విషయం చంద్రబాబుకు తెలుసు..నాడు చంద్రబాబు, వెంకయ్య ఏమన్నారో మనందరికీ తెలుసు..ఇదే ముఖ్యమంత్రి తనంతట తానే పరిశ్రమలు కట్టడానికి రెండు, మూడేళ్లు అవుతుంది, ఇది కట్టేలోపే హోదా సమయం అయిపోతుందని చెప్పారు. అటువంటి పారిశ్రామిక రాయితీలు నేడు మనకు ఇవ్వకుండానే ఏ రకంగా చంద్రబాబు అబద్ధాలు ఆడి అన్ని వచ్చేశాయి అని హోదాను తాకట్టు పెట్టారు. నోరు తెరిస్తే బాబు అబద్ధాలు మాట్లాడుతున్నారు. 

ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినట్లు బాబు సీఎం అయితే రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఇంటింటికి జాబ్‌ రావాలంటే బాబు సీఎం కావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వీటిలో ఏ ఒక్కటి చేయలేదు. పోరాటం చేసి తీసుకురావాల్సిన హోదాను తీసుకురాకుండా తాకట్టు పెట్టారు. సాధించుకునేందుకు ఒక్క ప్రయత్నం చేయలేదు. నీటి విషయంలో ఎగువ రాష్ట్రం ఎడాపెడా గోదావరి, కృష్ణా నీళ్లు పంపులు పెట్టి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి తాను ఏదైతే చెప్పాడో అది చేయడం లేదు. తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టు పెట్టారు. దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి, రేపు విశాఖలో పార్టర్‌షిప్‌ సమ్మిట్‌ పెడుతున్నారు. ఈయన ఎక్కడికి వెళ్లినా ఈయన సుందర ముఖారవిందాన్ని చూసి పరిశ్రమలు పెట్టడానికి ముందుకు రారు. హోదా ద్వారా వచ్చే వంద శాతం ఇన్‌సెంటివ్స్‌ ఉన్న రాష్ట్రాల్లోనే పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారు. దావోస్‌కు పేరుకు మాత్రమే వెళ్తారు. నాలుగు రోజులు విలాసవంతంగా గడిపివస్తారు. దానికి రూ.20 కోట్లు ఖర్చు చేస్తారు. ఒక్కో సమ్మిట్‌కు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అబద్ధాలతో మభ్యపెట్టే కార్యక్రమాలు చేపట్టారు.

గోదావరి, కృష్ణా పుష్కరాలు, రాజధాని ఫౌండేషన్‌ అంటారు.  వందల కోట్లు ఫట్.  టెంపరరీ సెక్రటరెట్‌కు రూ.600 కోట్లు ఖర్చు. వందలు, వేల కోట్లు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి బొగ్గు వరకు, ఇసుక, రాజధాని, గుడి భూములు కూడా వదలకుండా స్కామ్‌లే. ఈ అవినీతి అక్రమాలు బయటపడకుండా, వీటిపై విచారణ జరుగకుండా ఉండేందుకు కేంద్రానికి హోదాను తాకట్టు పెట్టారు. అడ్డగోలుగా బ్లాక్‌మనీతో దొరికిపోయినా జైలుకు పోకుండా తప్పించుకున్నారంటే అది ఒక్క మనరాష్ట్రంలో జరిగింది. బాబు సీఎం అయ్యాక..సోషియో ఎకనామిక్‌ సర్వే ప్రకారం 2014–2015లో రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు ఏస్థాయిలో వచ్చాయని సర్వేలో వెల్లడించింది. రూ.4138 కోట్లు, 2016లో రూ. 5561 కోట్లు మాత్రమే.  ఇంతదారుణంగా పెట్టుబడులు అన్నవి మన రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖపట్నంలో రూ.4.68 లక్షల  కోట్లతో ఎంవోయులు అన్నారు. అందులో ఎంత పెట్టుబడులు వచ్చాయో చూస్తే..ప్రభుత్వమే వివిధ కంపెనీల నుంచి ఒప్పందాలు చేసుకుంది. ఇంతదారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కేపీఎంపీ రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు చూసి బాబు సిగ్గుతో తలదించుకోవాలి. నోరు తెరిస్తే అబద్ధాలు. 

ఈ నెల 27, 28వ తేదీల్లో జరుగబోయే పార్టనర్ షిప్ లో రూ.8 లక్షల ఎంవోయులు చేయబోతున్నామని లీక్‌లు ఇస్తున్నారు. దావోస్‌కు ఎంట్రీ ఫీజు కట్టి వెళ్లారు. రండి..రండి అంటూ ఏపీ పరువును దావోస్‌లో తీశారు. బాబు..దావోస్, సింగపూర్, శ్రీలంక, జపాన్‌ పోవాల్సిన పనిలేదు. నిజాయితీగా ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు చేస్తే చాలు. సీఎం హోదాలో నీవు చేయాల్సిన పోరాటం చేస్తే ఉపయోగం ఉంటుంది. నాడు మోడీ కూడా మాట ఇచ్చారు. మీరు అడిగితే ప్రధాని కూడా ఒప్పుకుంటారు. విశాఖతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో క్యాండిల్‌ ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చాం. రాష్ట్రానికి మంచి జరగాలని మేం పిలుపునిస్తే ఆ ర్యాలీలు జరుపకుండా బాబు చర్యలు తీసుకుంటారట. మీరు చేయాల్సిన పోరాటం ప్రజలు చేస్తే..అది కూడా చేయకూడదా..? ఏదైనా జరిగితే అప్పుడు 144 సెక్షన్‌ పెట్టారు. ఏమీ జరుగకుండానే సెక్షన్‌ విధించడం దారుణం. డీజీపీ ఎవరు..?సీఎం ఏది చెబితే అది చేయడం న్యాయమా? గతంలో కూడ ధర్నాలు, ఆందోళనలు జరిగినప్పుడు ఉక్కుపాదంతో అణచివేశారు. హోదా అవసరం లేదని కేంద్రానికి చెప్పేందుకే ఇలాంటి నిర్భందాలు విధిస్తున్నారు. పిల్లలను భయపెట్టాలని తాపత్రయపడటం సరికాదు. బాబు చేసే పాలనను చూస్తే ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అన్న అనుమానాలు కలుగకపోవు.

అసలు మనం బ్రిటిష్‌ పాలనలో ఉన్నామా? ఏపీలో ఉన్నామా అన్న సందేహాలు కలుగుతున్నాయి. బాబు అన్న వ్యక్తి స్వాతంత్య్రం రాకముందు ఉండి ఉంటే..బ్రిటిష్‌ వాళ్లకే సపోర్టు చేసేవారేమో. ఆ రోజు ఆయన లేకపోవడం మన అదృష్టం. యువభేరి కార్యక్రమాలకు హాజరైతే ఈడీ కేసులు పెట్టమని ఆదేశిస్తారు. ఇదే సీఎంపై తాడా కేసు పెట్టకూడదా? ముందు బాబును జైల్లో పెట్టాలి. బాబుకు నేను చెబుతున్నా..ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆ విలువలు కాపాడే ప్రయత్నం చేయండి. రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీ జరుగుతుంది. అది మా హక్కు..ప్రజాస్వామ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుతంగా ర్యాలీలు చేపడుతాం. సహకరించాలని బాబును కోరుతున్నాం. విశాఖలో జరిగే ర్యాలీలో నేను కూడా పాల్గొంటున్నాను. అరెస్టు చేస్తామంటే చేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాంతియుతంగా క్యాండిల్‌ లైట్‌ ర్యాలీ చేయాలని వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదు. అది మీ వ్యక్తిగత నిర్ణయానికే వదిలేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం సీఎం స్థాయి వ్యక్తికి సరికాదు. బాబును కూడా ర్యాలీలో పాల్గొనాలని కోరుతున్నా. ఆయన తన నిర్ణయం మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని కోరుతున్నాను. 

ఈ ర్యాలీకి రావాలని అందర్నీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాబోయే రోజుల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లేందుకు తాను కూడా ముందుంటా. దేశం మొత్తం చూసేలా ఎంపీ స్థానాలకు రాజీనామా చేద్దాం. ఇందుకు బాబు ఒప్పుకున్నా..లేకపోయినా మేం మాత్రం వెనుకడుగు వేయం. జూన్‌లో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో గట్టిగా ఒత్తిడి తీసుకొని వస్తాం. ఆ తరువాత సమావేశాల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రతి ఎంపీ రాజీనామా చేస్తారు. దేశం మొత్తం చూసేలా ఉప ఎన్నికలకు వెళ్తాం. దేశం మొత్తం ఆలోచించేలా చేస్తాం. అందరికి తెలియాలి. అప్పుడే ఎంతో కొంత మేలు జరుగుతుంది. బాబు తోడుగా ఉంటే సంతోషిస్తాం. ఒకవేళ ఆయన రాకపోతే దేవుడు, ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు. ప్రత్యేక హోదాపైనా http://www.ysrcongress.com/ లో పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. హోదాపై వీళ్లు ఎలాంటి అబద్ధాలు చెబుతున్నారు వంటి అన్ని అంశాలు వైయస్‌ఆర్‌సీపీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఉద్యమాలు చేసింది, చైతన్య కార్యక్రమాలు చేపట్టింది అన్న వివరాలు అందులో అందుబాటులో ఉన్నాయి. 

ఈ నెల 26న జరిగే ర్యాలీతో కలుపుకొని 32 ఆందోళనలు చేశాం. ఆ వివరాలు పార్టీ వెబ్‌సైట్లో ఉన్నాయి. హోదా అన్న అంశం రేపో, మర్నాడో వస్తుందని నేను చెప్పడం లేదు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన మాటను సాధించుకోకుంటే సిగ్గుచేటు. జల్లికట్టు అన్నది తమిళనాడులో ఓ ఆట. ఇందు కోసం ముఖ్యమంత్రితో సహా అన్ని పార్టీలు ఏకమై సాధించుకున్నాయి. అది ఓ ఆట..ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య. మనం ఇలాంటి హామీని సాధించుకోలేకపోతే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తూ మేమే కట్టిస్తామని  చట్టంలో చెప్పారు.  అలాంటి ప్రాజెక్టును మీరు కట్టవద్దు. ఆ కాంట్రాక్టర్‌తో తమకు సంబంధాలు ఉన్నాయని చెప్పి, తనకు నచ్చిన వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చుకొని ఆ ప్రాజెక్టును నీరుగారుస్తున్నారు. హోదాను వదిలేసి పోలవరం చేస్తానని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యకరం. ఈయన కొత్తగా చేసేది ఏంటో అర్థం కావడం లేదు. ప్రత్యేక హోదాకు సంబంధించిన కరపత్రం వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ వెబ్‌సైట్‌లో ఉంది. అందరూ చదవండి. ఉద్యమంలో పాల్గొనండి.
 
Back to Top