అప్పుడు విస్మరించి.. ఇప్పుడు మొసలి కన్నీరు

హైదరాబాద్, 9 ఏప్రిల్‌ 2013: ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్లలో ఏనాడూ రైతులను పట్టించుకోని చంద్రబాబునాయుడు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ప్రకాశం జిల్లా దర్శి కాంగ్రెస్ ఎమ్మెల్యే శివ‌ప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికల తర్వాత టిడిపి జెండా మూసేసుకోవాల్సిందేనని అన్నారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం తమ కుటుంబం ఎల్లప్పుడు పనిచేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డిని శివప్రసాద్‌రెడ్డి మంగళవారం నాడు చంచల్గూడ జై‌లులో కలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల హృదయంలోంచి పుట్టింది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. త్వరలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆయన తెలిపారు.

తాను ఎమ్మెల్యేగా ఉండడానికి మహానేత వైయస్‌ఆర్,‌ జననేత శ్రీ జగన్ భిక్షే‌ కారణం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినందువల్లే అసెంబ్లీలో అవిశ్వాసానికి మద్దతుగా తను ఓటు వేసినట్లు తెలిపారు. టిడిపి, కాంగ్రెస్ కుమ్మక్కై వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీని అణగ‌దొక్కే ప్రయత్నం చేస్తున్నాయని శివప్రసాద్‌రెడ్డి దుయ్యబట్టారు. మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ‌పథకాలు మరోసారి అమ‌లు కావాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం సామాన్య కార్యకర్తగా కృషి చేస్తానని శివప్రసాద్‌రెడ్డి తెలిపారు.
Back to Top