అప్పుడు చంపి.. ఇప్పుడు దీక్షలా?

విజయవాడ, 27 మార్చి 2013: బషీర్‌బాగ్‌ కాల్పుల్లో విద్యుత్‌ ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న టిడిపి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దీక్షలు చేస్తోందని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఎనిమిదేళ్ళ పాలనాకాలంలో చంద్రబాబు ఎనిమి సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచేసిన వైనాన్ని ఆమె గుర్తుచేశారు. ఆ పెంచిన చార్జీలు చెల్లించలేకపోయిన రైతులను కేసుల్లో ఇరికించి, ప్రత్యేక పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేసి జైళ్ళలో పెట్టి, శిక్షించిన చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేల చేత దీక్షలు చేయించడంలో ఔచిత్యం లేదన్నారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా బుధవారం‌ రాత్రి విజయవాడలోని డాబా కొట్లు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ఉద్వేగంగా ప్రసంగించారు. మీ అడుగుజాడల్లో, మీ సలహాలతోనే ఈ ప్రభుత్వం నడుస్తూ.. మీ మాదిరిగానే విద్యుత్‌ చార్జీలు పెంచితే ఎందుకు అభ్యంతరం అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు.

బెల్టు షాపులు తెరిచింది బాబే :
ప్రజలు కష్టాలు పడుతుంటే పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు స్వలాభం కోసం చీకట్లో చిదంబరంతో ఒప్పందాలు చేసుకున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు.‌ కిలో 2 రూపాయలకు బియ్యం ఇస్తామని, పూర్తి మద్యపానం నిషేధాన్ని అమలు చేస్తామని ఎన్టీఆర్ అధికారంలోకి వస్తే.. ఆయనకు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కిన చంద్రబాబు బియ్యం ధర పెంచేశారని, వాడవాడలా బెల్టుషాపులు తెరిపించారని దుయ్యబట్టారు. రూ. 50 ఉన్న హార్సుపవర్ విద్యుత్‌ ధరను రూ. 650కి పెంచిన ఘనుడు చంద్రబాబే అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉందీ అంటే అది చంద్రబాబు చలవే కదా! అని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజల జీవితాలను టిడిపి తాకట్టు పెట్టిందని నిప్పులు చెరిగారు.

గ్రామాల్లో విద్యుత్‌ అసలే లేని దుస్థితి నెలకొన్నదని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు సలహాలతోనే, ఆయన అడుగుజాడల్లోనే కిరణ్‌ ప్రభుత్వం కూడా నడుస్తోందని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం పదేళ్ళు వెనక్కిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యుత్‌ లేక పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడిన దుస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటి విద్యుత్‌ సంక్షోభానికి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతగానితనమే కారణమని దుయ్యబట్టారు. విద్యుత్‌ సరఫరా చేయకపోగా ప్రజలపై రూ. 32 వేల కోట్ల ఆర్థిక భారాన్ని ఈ ప్రభుత్వం వేయడమేమిటని నిప్పులు చెరిగారు.

అసమర్థ ప్రభుత్వానికి నిస్సిగ్గుగా టిడిపి మద్దతు :
ఈ చేతగాని ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం టిడిపి తోడైందని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వద్దు వద్దని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. అందుకే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వానికి టిడిపి నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చిందని నిప్పులు చెరిగారు. చిరంజీవి తన పార్టీని బహిరంగంగా అమ్మేసుకుంటే చంద్రబాబు నాయుడు రహస్యంగా అమ్మేశారని ఆరోపించారు.
 
చంద్రబాబు సిఎం అయ్యే నాటికి ఉన్న వంట గ్యాస్‌ ధరను దిగిపోయే నాటికి రెట్టింపు చేసి మహిళలను ఇబ్బందుల పాలుచేశారని దుయ్యబట్టారు. అదే మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళూ ఒక్క రూపాయి కూడా తన ఆడపడుచులపై భారం వేయలేదన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 16 లక్షల మందికి పింఛన్లు అందేవని, వాటిని వైయస్‌ వచ్చాక 71 లక్షలకు పెంచిన వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

రాజన్న ఉంటే బుడమేరు కష్టం ఉండేది కాదు :
మహానేత రాజన్న బ్రతికి ఉంటే విజయవాడ దుఃఖదాయనిగా పేరు పొందిన బుడమేరు కష్టాలు ఉండేవి కావని శ్రీమతి షర్మిల అన్నారు. బుడమేరు ఇబ్బందులను తప్పించేందకు ఆయన కోట్లాది రూపాయలు మంజూరు చేసిన విషయం తెలిపారు. అకస్మాత్తుగా ఆయన వెళ్ళిపోవడంతో బుడమేరు కష్టాలు అలాగే ఉన్నాయన్నారు. జగనన్న అధికారంలోకి వచ్చాక బుడమేరు సమస్యను పరిష్కరిస్తారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. జగనన్న సిఎం అయ్యాక బెల్టు షాపులను రద్దు చేస్తారన్నారు. అధిక సంఖ్యలో మహిళా పోలీసులను నియమించి అక్కా చెల్లెళ్ళకు రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుందన్నారు.

జగనన్నను ఎదుర్కొనే దమ్ము వాటికి లేదు :
కాంగ్రెస్‌, టిడిపిలు నీచమైన కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబిఐని వాడుకుని కుట్రతో జగనన్నను అన్యాయంగా జైలుకు పంపించాయని దుయ్యబట్టారు. జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే జైలుపాలు చేశాయన్నారు. జగనన్న అంటే వాళ్ళకు భయం అని, అందుకే సిబిఐ వెనకాల దాక్కుని ఆయనను బయటికి రానివ్వకుండా చేస్తున్నాయన్నారు. జగనన్న బయటికి వస్తే ఆ రెండు పార్టీలూ తమ దుకాణాలు పూర్తిగా మూసుకోవాల్సి వస్తుందని వణుకు అన్నారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, ఆయన పక్షాన దేవుడున్నాడన్నారు. జగనన్న బయటకు వస్తాడని, రాజన్న రాజ్యం వైపు నడిపిస్తాడన్నారు. మహానేత రాజన్న పథకాలన్నింటినీ జగనన్న అమలు చేస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

జగనన్న మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తారని, ఇద్దరు పిల్లలకు పదవ తరగతి వరకూ చదివించేందుకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 500 చొప్పున తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తారని చెప్పారు. వికలాంగులకు పింఛన్‌ను వెయ్యి రూపాయలకు పెంచుతారని హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే పక్కా ఇళ్ళు, పింఛన్లు అందిస్తామని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం అంతా అభిమానులతో కిక్కిరిసిపోయింది. యువతీ యువకులు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. శ్రీమతి షర్మిల పాదయాత్రకు విజయవాడలో అపూర్వ స్పందన లభిస్తోంది.
Back to Top