ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి

ధన్యవాద తీర్మానంపై చర్చలో మేకపాటి
న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా హామీని అమలు చేసి, ఫిరాయింపుల చట్టాన్ని సవరించి పార్లమెంటుపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని వైయస్సార్‌ కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రపతి తన ప్రసంగంలో చేసిన ఒక వ్యాఖ్యను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఈ దేశ పౌరులు, ముఖ్యంగా పేదలు ఈ పవిత్ర పార్లమెంటుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం.

ఈ ప్రజాస్వామ్య దేవాలయంలో మన ప్రతి చర్య కూడా ఈ దేశం నిర్మితమైన త్యాగాల కోవలో ఉండాలి అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నదేంటి? ఫిరాయింపుల వ్యతిరేక చట్టం గతి ఎలా ఉంది? చట్టసభల సభ్యులు పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం కోల్పోతారని రాజ్యాంగ సవరణ ద్వారా మనం చట్టం చేసుకున్నాం. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి గెలిచి బహిరంగంగా టీడీపీలో చేరారు. పదో షెడ్యూలులోని నిబంధనల ప్రకారం మా పార్టీ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ సభాపతి ఎలాంటి చర్య తీసుకోలేదు’’ అని మేకపాటి ప్రశ్నించారు.

ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి
మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ప్రత్యేక హోదాను మంజూరు చేయాలని వైయస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ ఉభయ సభల నుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా, ఇతర హామీల ప్రస్తావన రాష్ట్రపతి ప్రసంగంలో లేనందువల్ల తాను ధన్యవాద తీర్మానానికి కొన్ని సవరణలను ప్రతిపాదించానని చెప్పారు. 2014 ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

పన్నుల్లో వాటానే ప్యాకేజీగా...
ప్రత్యేక హోదా సిఫార్సు చేయలేదని, భవిష్యత్తులో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయవద్దని 14 వ ఆర్థిక సంఘం నివేదికలో ఎక్కడ ఉందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పైగా ఆర్థిక సంఘం నివేదిక కేవలం సిఫార్సు మాత్రమేనని, తప్పనిసరి కాదని గుర్తు చేశారు. కేంద్ర కేబినెట్‌ నిర్ణయం అమలు కాకపోతే చట్టపరమైన సహాయం ఏమిటని నిలదీశారు. ప్రత్యేక ప్యాకేజిని రాష్ట్రంలో ఎవరు కోరారని ప్రశ్నించారు. రానున్న ఐదేళ్లలో కేంద్ర పన్నులలో రాష్ట్రానికి వచ్చే వాటాను ప్యాకేజిగా చెబుతున్నారని తెలిపారు. ఫిరాయింపుల చట్టంలో ఉన్న లొసుగులను అధికారంలో ఉన్న పార్టీలు అదునుగా తీసుకుంటున్నాయని చెప్పారు. అనర్హత పిటీషన్లపై నియమిత కాలవ్యవధిలో స్పీకర్లు నిర్ణయం తీసుకునే విధంగా ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని సూచించారు. మహిళల సాధికారత కోసం చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top