సర్కార్‌ మాటలు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌

 
విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ లెక్కలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. టీడీపీ సర్కార్‌ మాటలు మ్యాటర్‌ వీక్‌.. పబ్లిసిటీ పీక్‌ అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం విజయవాడలో బుగ్గన మీడియాతో మాట్లాడారు. 
టీడీపీ నేతలు చెబుతున్నట్లు పెట్టుబడుల సమ్మిట్‌, ఉద్యోగాల కల్పన అన్నీ మాయమాటలేనని ఆయన అన్నారు. కాగ్‌ లెక్కల ప్రకారం రెవెన్యూ రాబడిలో రూ. 24 వేల కోట్ల లోటు ఉందన్న విషయాన్ని బుగ్గన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటప్పుడు రెవెన్యూ లోటులో సడన్‌గా మిగులు ఎలా వచ్చిందన్నారు. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకోగలదని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్రంలో ఏ రంగానికి ఆదాయం పెరగలేదని.. కేవలం అడ్డగోలు అనుమతులతో మద్యం ఆదాయాన్ని మాత్రం రెట్టింపు చేశారన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలను అయోమయానికి గురి చేసి మాయ చేసేందుకే చంద్రబాబు దొంగ లెక్కలు చూపిస్తున్నారంటూ బుగ్గన మండిపడ్డారు. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని చెబుతుండటం వల్ల ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Back to Top