రైతులు ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనపడట్లేదా?

హైదరాబాద్: రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీపై చర్చించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతులు, డ్వాక్రా  మహిళల సమస్యలపై కచ్చితంగా చర్చించాల్సిందేనని ఆయన పట్టుబట్టారు.  చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అబద్ధాలేనని అన్నారు.
 
రైతులు ఎట్లా పోయినా ప్రభుత్వానికి ఫరవాలేదనట్లుగా ప్రభుత్వ తీరు ఉందన్నారు.  రుణమాఫీపై చర్చ అయిపోయింది... సీఎం స్టేట్ మెంట్ ఇచ్చేసారు అని చెబుతున్నారని, ప్రతిపక్షం సభలో లేకుండానే ...మీకు మీరే మాట్లాడుకుని, మీకు మీరు అనుకుని చర్చ అయిపోయిందనటం సరైన పద్ధతేనా అని అడిగారు. అయిదు కోట్ల మంది అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నారని, రుణమాఫీ, డ్వాక్రా రుణాలపై చిత్తశుద్ధి ఉంటే చర్చకు అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పీకర్ ను కోరారు. చర్చకు ఎందుకు ప్రభుత్వం భయపడుతుందో అర్థం కావటం లేదన్నారు.

ప్రజా సమస్యలు మాట్లాడటానికే అసెంబ్లీ ఉందని, డ్వాక్రా, రైతు రుణమాఫీ కంటే పెద్ద సబ్జెక్ట్ ఏముందని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కేటాయింపులు వడ్డీలకే సరిపోవటం లేదన్నారు. ఓవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వక, మరోవైపు అప్పులు పుట్టక రైతులు అల్లాడుతున్నారన్నారు.  రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Back to Top