వైఎస్ జగన్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి

విస్సన్నపేట: ఎన్నికల ముందు రైతులు సంక్షోభంలో ఉన్నారని, తమ పార్టీని గెలిపిస్తే వారిని సంక్షోభ నుంచి బయటపడేస్తానన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వారిని మరింత సంక్షోభంలోకి నెట్టారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. బుధవారం  విస్సన్నపేటలో జరిగిన ఒక శుభకార్యానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన వాగ్దానాలు అమలుచేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోలీస్ లాఠీలు, తుపాకులతో బెదిరించి ఎంతకాలం పాలన సాగించగలరని ఆయన ప్రశ్నించారు.

ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని,  నాలుగేళ్ల తర్వాతైనా చంద్రబాబు ఓట్ల కోసం ప్రజల ముందుకు రాక తప్పదన్నారు. అప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక  దాటవేత ధోరణి అవలంభిస్తున్నారన్నారు.  భవిష్యత్తులో జగన్ ముఖ్యమంత్రి అవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ప్రజలు ఆశ్వీరదిస్తే తప్పక అయి తీరుతారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి,మండల కన్వీనర్ ఓలేటి దుర్గారావు,పట్టణ కమిటీ అధ్యక్షుడు నెక్కళపు కుటుంబరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Back to Top