ఏపీని ఎడారిగా మార్చిన బాబు

బాబు నిర్వాకం వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులు
చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు
వైఎస్సార్సీపీ నిరసనలు ప్రభుత్వానికి చెంపపెట్టు
ఇది ఆరంభం మాత్రమే..కాక ఇప్పుడే మొదలైంది
బాబుకు వ్యతిరేకంగా కోట్లాది గొంతుకలు గళమెత్తుతాయిః వాసిరెడ్డి

హైదరాబాద్ః రాష్ట్రంలో ప్రజలు కరవుతో అల్లాడుతుంటే ....చంద్రబాబు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఏపీని ఏడారిగా మార్చిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హతే లేదన్నారు.  కరవు పరిస్థితులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా  వైఎస్సార్సీపీ నిర్వహించిన ధర్నాలు, నిరసనలు ప్రభుత్వానికి చెంపపెట్టుగా పద్మ అభివర్ణించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపుమేరకు ఎండను సైతం లెక్కచేయకుండా  వేలాదిగా ప్రజలు తరలివచ్చారంటే..కరవుతో జనం ఏవిధంగా విలవిలలాడుతున్నారో, ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో చెప్పకనే చెప్పిందన్నారు. 

నీటి చుక్క దొరక్క వేలాది గ్రామాలు అలమటిస్తున్నాయని పద్మ వాపోయారు. కరవు, తాగునీటి ఎద్దడితో కుటుంబాలకు కుటుంబాలు వలసలు పోతున్నాయని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు పిట్టల్లా రాలుతున్నారని, మూగజీవాలు కబేళాలకు తరలుతున్నాయని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇంత భయానకంగా ఉంటే  కేంద్రప్రభుత్వానికి లెటర్ రాయడం గానీ , ప్రతిపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి అడుగుతామని చెప్పడం గానీ, కరవుకు సంబంధించి పలనానా చర్యలు చేపడుతున్నామని గానీ చంద్రబాబు నోట మాట రాకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలంటే ఇంత చులకనభావం ఎందుకు బాబు మీకు అని పద్మ ధ్వజమెత్తారు. 

ఇంత దారుణమైన కరవు పాతిక, 30 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని ప్రజలు చెబుతున్నారని పద్మ తెలిపారు. జీవనదులు సైతం ఎండిపోయినవి.  జాతీయ విపత్తుగా ప్రకటించాల్సిన కరవు ఇది. వందలమంది వడదెబ్బలకు చనిపోతున్నారు.  వ్యవసాయం సంగతి దేవుడెరుగు కనీసం తాగేందుకు నీళ్లివ్వమని ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం బాధాకరమని పద్మ అన్నారు.  ఇంత తీవ్రమైన పరిస్థితుల్లో ప్రజల పక్షాన పోరాడే  ప్రధాన ప్రతిపక్షంగా మనసు చెలించి నిరసనలకు పిలుపునిస్తే....కరవుపై ఏం చేస్తారో చెప్పకుండా టీడీపీ నేతలు దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. 

కరవుపై  ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, కేంద్రాన్నిసహాయం అడగాలన్న శ్రద్ధ గానీ,  ఓ మనిషిని కాపాడన్న శ్రద్ధ గానీ లేకపోవడం అన్యాయమన్నారు. చంద్రబాబుకు ఎంతసేపు ఎమ్మెల్యేలను కొందామన్న ధ్యాసే తప్ప....కరువుతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్న ఆలోచనే లేదని దుయ్యబట్టారు. ఇంతకన్నా దుర్మార్గమైన ప్రభుత్వం మరొకటి ఉండదని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం నుంచి సహాయం చేసే పరిస్థితి లేదు. కరవు గురించి మాట్లాడే వారు లేరు గనుకే ప్రజలు  వైఎస్ జగన్ వైపు చూస్తున్నారని పద్మ చెప్పారు.  ఇది ఆరంభం మాత్రమేనని,  కాక ఇప్పుడే మొదలైందని...భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని పద్మ తేల్చిచెప్పారు. వైఎస్ జగన్ పిలుపు ఇస్తే బాబుకు వ్యతిరేకంగా కోట్లాది గొంతులు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయని పద్మ తెలిపారు. 

వేసవికి ముందే కరవు, తాగునీటి ఎద్దడికి సంబంధించి ఓ ప్రణాళిక రూపొందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందని....కానీ చంద్రబాబుకు అవేమీ పట్టకపోవడం దారుణమన్నారు. ఇంకుడు గుంతలు తవ్వుకోండి, వాననీళ్లు దోసిళ్లతో పట్టుకోండి అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప ....కరువు నివారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ చేపడుతున్నామని ఒక్క మాట చెప్పకపోవడం హేయనీయమన్నారు. 
అపారమైన అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు...మే నెల వచ్చే వరకు, ప్రతిపక్షం కరవుపై నిరసనలకు పిలుపు ఇచ్చే వరకు కూడా గుర్తుకు రాకపోవడం  శోచనీయమన్నారు. వడదెబ్బకు వందలమంది చనిపోతే నష్టపరిహారం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. 

ప్రతి ఇంటికీ ఎన్టీఆర్ సుజలస్రవంతి ద్వారా 20 లీటర్ల నీరు అన్నారు. మజ్జిగ పథకం అన్నారు. వాటి ఊసే లేదని పద్మ ప్రభుత్వంపై  ఫైరయ్యారు. బాబు నిర్వాకం కారణంగానే ఇవాళ ప్రజలు రోడ్లమీదకు వచ్చిన పరిస్థితి నెలకొందన్నారు. గతంలో ప్రకటించిన కరవు మండలాలకు సంబంధించి ఇంతవరకు సహాయమే చేయలేదని....ప్రస్తుత కరవు పరిస్థితులపైనా అధికార టీడీపీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని పద్మ మండిపడ్డారు. ఇప్పటికైనా ఏపీలో కరవు పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించేందుకు చంద్రబాబు ముందుకు కదలాలని...అందుకు వైఎస్సార్సీపీ అండదండలు అందిస్తుందని పద్మ చెప్పారు.

కరవు నన్ను చూసి భయపడాలి. కరువు రహిత రాష్ట్రంగా చేస్తానని చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరమన్నారు.  చంద్రబాబు వస్తేనే కరువు వస్తుందని ప్రజలంతా అనుకుంటున్నారని పద్మ ఎద్దేవా చేశారు.  కరవుపై ఏం చేస్తారో చెప్పకుండా కరవును తరిమికొడతామంటూ బాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వైఎస్  జగన్ ధర్నాతోనైనా  ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు.  వినలేని, చూడలేని , మనసు లేని ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా చెంపదెబ్బ కొట్టేందుకు వేలిది మంది జనం మాచర్ల ధర్నాకు రావడమే అందుకు నిదర్శనమన్నారు. పిచ్చి మాటలు మానుకొని కరవు నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.  మొద్దు నిద్రపోవడం క్షమించరాని అంశమన్నారు.  
Back to Top