ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు

- ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకోని స్పీక‌ర్‌
- ఏక‌ప‌క్షంగా సాగుతున్న శాస‌న‌స‌భ స‌మావేశాలు
అమరావతి: తెలుగుదేశం పార్టీ సర్కార్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్ష డిమాండ్‌లను పట్టించుకోకుండా శాసనసభ గౌరవ మర్యాదలను దెబ్బతీస్తుంది. ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేకుండానే శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు సంతలో గొర్రెల మాదిరిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, ఒక్కో ఎమ్మెల్యేలకు రూ. 20 నుంచి రూ. 40 కోట్లు చెల్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిరాయింపు దారుల్లో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు ప్రలోభాలకు తలొగ్గి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే స్పీకర్‌కు పలుమార్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేశారు. అయినా స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసి, నలుగురిని మంత్రి పదవుల నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ శాసనసభ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే.  

నిన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి మ‌రోమారు ఓ అవ‌కాశం ఇస్తూ..పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తే అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌స్తామ‌ని పార్టీ  ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 20 గంటల సమయం ఇచ్చినా కూడా ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు అనైతికంగా తన పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని శ్రీ‌కాంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే తాము అసెంబ్లీకి వస్తామని వెల్లడించారు. మేం ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు సమాధానం చెప్పాల్సింది అధికార పక్షం. అయితే మా పార్టీ తరఫున గెలిచిన వారు అటువైపు చేరి సమాధానం చెప్పడం స‌రైంది కాద‌ని, ప్ర‌జాస్వామ్య దేశంలో ఇలాంటి చ‌ర్య‌లు మంచివి కావ‌ని తెలిపారు. అయినా కూడా ప్ర‌భుత్వం ఇవేవి ప‌ట్టించుకోకుండా ఏక‌ప‌క్షంగా స‌మావేశాలు నిర్వహించ‌డం రాష్ట్ర ప్ర‌జ‌లు త‌ప్పుప‌డుతున్నారు. 
Back to Top