హిందూ దేవాలయాలకు పునర్వైభవం

హైదరాబాద్, 29 మార్చి 2014 :

 వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ దేవాలయాలకు పునర్వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పార్టీ మేనిఫెస్టో కమిటీ హామీ ఇచ్చింది. దేవాలయాల పరిరక్షణ, అర్చకుల సమస్యల గురించి పార్టీ ఎన్నికల ‌మేనిఫెస్టోలో ప్రస్తావిస్తామని సీనియర్ నాయకుడు డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అర్చక సమాఖ్య ప్రతినిధుల విజ్ఞప్తిని‌ తాము పరిగణనలోకి తీసుకున్నామని పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకువెళతామని మైసూరారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ప్రతినిధుల బృందం శనివారం వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ ప్రతినిధులను కలిశారు. అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. మహానేత వైయస్ఆర్‌ ఆశయాలు నెరవేర్చేందుకే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల వ్యవస్థను పాడుచేస్తూ... 1987లో తీసుకువచ్చిన చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని 2003లో మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని ఏపీ అర్చక సమాఖ్య ఉపాధ్యక్షుడు సౌందర రాజన్‌ తెలిపారు. మహానేత వైయస్ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు దేవాదాయ, ధర్మాదాయ చట్టాన్ని పూర్తిగా అమలు చేశారని, ఆయన మరణంతో దానిని తరువాతి పాలకులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. తాము అన్ని పార్టీలకూ ఈ చట్టం గురించి వజ్ఞప్తులు చేశామని అయితే ఏ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తరువాత అఖిలపక్ష సమావేశంలో పెట్టలేదన్నారు. ఒక్క వైయస్ఆర్‌ మాత్రం అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం పెట్టించారన్నారు. 2007లో ఆ చట్టాన్ని మార్చారన్నారు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా దేవాలయాలను పరిరక్షిస్తామని వైయస్ఆర్‌ చెప్పారని, అయితే దురదృష్టం కొద్దీ ఆయన ఆకస్మికంగా మరణించిన తరువాత మార్చిన చట్టాన్ని ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిని రాష్ట్రంలోని 34 వేల దేవాలయాలు, వాటిలోని అర్చకులు, భక్తులు తమ హృదయాల్లో పెట్టుకున్నారని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top