ఇది మహిళ వ్యతిరేక ప్రభుత్వం


– కథువా గురించి మాట్లాడే చంద్రబాబు.. కారంచేడు ఘటనపై నోరెత్తడే
– రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులన్నీ టీడీపీ పుణ్యమే
– మహిళలకు రక్షణ కల్పించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు 
– కుప్పంలో ఉమాదేవి మీద దాడి జరిగినా బాబులో స్పందన లేదు
– వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి

చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి ఆరోపించారు. ఎక్కడో కథువాలో జరిగిన దాడి గురించి స్టేట్‌మెంట్లు ఇచ్చే చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఒక్కసారైనా స్పందించారా? అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నా.. ఏ ఒక్కదానిపైనా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళా వ్యతిరేకంగా మారిందని ధ్వజమెత్తారు.
 
రాష్ట్రంలో రాజధాని నడిబొడ్డున చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కారంచేడు గ్రామంలో టీడీపీ నాయకుడు చేసిన లైంగిక దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా పట్టించుకోని చంద్రబాబుది హృదయమా.. పాశానమా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎక్కడో కథువాలో జరిగిన అత్యాచారాల గురించి మాట్లాడే చంద్రబాబుకి తన  నివాసానికి పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో రోజూ అత్యాచారాలు వెలుగుచూస్తున్నా చంద్రబాబు బాధ్యతగా వ్యవహరించడం లేదు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేని దద్దమ్మ చంద్రబాబు అని ఆమె అన్నారు. మీకు ఆడపిల్లలు లేకపోతే ఏం ఇంట్లో ఉన్న మహిళల రక్షణ గురించి పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మహిళల అక్రమ రవాణాలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలవడం.. ఎస్సీ ఎస్టీ మహిళలపై దాడుల్లోనూ మన రాష్ట్రం ఉండటం దారుణం. మహిళలపై దాడులు చేసిన ప్రజాప్రతినిధులు టీడీపీలోనే ఉండటం చూసి చంద్రబాబుకి కనీసం సిగ్గనిపించడం లేదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇద్దరు మంత్రులు మహిళలపై దాడులు చేసిన కేసుల్లో ఉండటం చూసి బాబు సిగ్గు పడాలి. ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్, మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వర్‌రావు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావుల మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఒక మహిళను వివస్త్రను చేసి వీడియోలు తీసి వేధించినా చంద్రబాబు స్పందించిన పాపాన పోలేదన్నారు. మహిళలతో కన్నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం ఎంతోకాలం మనజాలదని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న ప్రతి దాడిలోనూ టీడీపీ నాయకులే ముద్దాయిలుగా ఉన్నారన్నారు. ఎన్నికలకు ముందు మారాను మారాను అని చెప్పుకున్న చంద్రబాబు... తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. 

Back to Top