‘రైతు వ్యతిరేక ప్రభుత్వమిది’

కదిరి: ‘రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందునుంచి రైతులంటే గిట్టదు. అందుకే వ్యవసాయం దండగ అన్నారు. రైతులకు న్యాయబద్దంగా అందాల్సిన పంటల భీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు పెడుతోంది. రైతులంటే ఈ సర్కారుకు ఎందుకంత చులకన భావం..? ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయం వద్ద వైఎస్‌ ప్రభాకర్‌రెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన ఆయన అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడా బడా పారిశ్రామిక వేత్తల రుణాలు ఏకకాలంటో మాఫీ చేసే ఈ ప్రభుత్వాలకు రైతుల విషయానికి వచ్చేసరికి రుణపత్రాలు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల భీమా నేరుగా ఆయా రైతుల ఖాతాల్లో జమచేయాలని వీటికి కూడా పత్రాలతో సరిపెడతామంటూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా రైతులు 21.25 లక్షల ఎకరాలకు ప్రీమియం చెల్లిస్తే అందులో 14.87 ఎకరాలకు మాత్రమే భీమా చెల్లించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. జిల్లా లోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ఈ ప్రభుత్వానికి ఈ విషయం తెలియదంటే తాను నమ్మనన్నారు. ఇందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, కర్నూలు జిల్లా నంద్యాలలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వైస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడు, కదిరి మండల కన్వీనర్‌ ప్రకాష్, ఎంపీటీసీలు అమరనాథ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఖాదర్‌బాషా, కిన్నెర కళ్యాణ్, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top