అంతా సింగ‌పూర్ మ‌యం..!

హైద‌రాబాద్: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌నస్సు నిండా సింగ‌పూర్ నిండిపోయింది. అందుకే సింగ‌పూర్ కంపెనీలు, సింగ‌పూర్ ప్ర‌తినిధుల అవ‌స‌రాల మేర‌కు అన్నీ మార్చుకొంటున్నారు. ప‌నిలో ప‌నిగా టూరిజం విధానాన్ని మార్చేస్తున్నారు. విదేశీయుల్ని ఆక‌ర్షిస్తున్నాం అన్న నినాదంతో సింగ‌పూర్ బ్యాచ్ కు అనుకూలంగా నిర్ణ‌యాలు చేస్తున్నారు.

సింగ‌పూర్ బ్యాచ్ కోసం అధికారులు

రాజ‌ధాని నిర్మాణం యోచ‌న వ‌చ్చినప్ప‌టి నుంచి రాష్ట్రానికి వ‌చ్చేసింగ‌పూర్ బ్యాచ్ లు ఎక్కువ అయ్యాయి. వీటి కోసం దివ్య‌మైన ఏర్పాట్లు ఉండాల‌ని ప్ర‌భుత్వం తేల్చి చెప్పేసింది. దీంతో ఉన్న‌తాధికారులు ప్ర‌త్యేకంగా ప్రోటోకాల్ అధికారుల్ని ఏర్పాటు చేశారు. విదేశీ యులు హైద‌రాబాద్ లో బస చేయ‌టం లేదా రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌టించ‌టం జ‌రిగేట‌ప్పుడు ప్ర‌భుత్వ ప‌రంగా అంగరంగ వైభ‌వంగా ఏర్పాట్లు నిర్వ‌హించ‌టం ఈ అధికారుల ప‌ని. సింగ‌పూర్ కంపెనీల ప‌ర్య‌ట‌న‌ల కోసం ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని జీ హుజూర్ అంటూ వాళ్ల ద‌గ్గ‌ర మోక‌రిల్లేట్లుగా చేయ‌టం ప్ర‌త్యేక బాధ్యత‌. ఇందుకోసం ప్ర‌త్యేకంగా ఉద్యోగాలు సృష్టించి మ‌రీ అధికారుల్ని రిక్రూట్ చేశారు. మొన్న‌టికి మొన్న పుష్క‌రాల స‌మ‌యంలో వ‌చ్చిన సింగ‌పూర్ బృందం కోసం ప్ర‌త్యేకంగా ఒక విమానాన్ని ఏర్పాటుచేసి హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి తీసుకొని వెళ్లారు. అక్క‌డ నుంచి ఒక ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్ పెట్టి మ‌రీ రాజ‌మండ్రి చుట్టుప‌క్క‌ల విహారానికి తీసుకొని వెళ్లారు.

టూరిజంలో మార్పులు
సింగ‌పూర్ బృందాల్ని దృష్టిలో పెట్టుకొని  టూరిజం విభాగంలో విధాన‌ప‌ర‌మైన మార్పులు చేస్తున్నారు. విదేశీయులు కానీ, ఎన్నారైలు కానీ ఈ కోటాలో వ‌స్తే వారికి విమానాల్లో 30 శాతం వ‌ర‌కు రాయితీ ఇప్పించనున్నారు. బ‌స చేసే స్టార్ హోట‌ళ్ల‌లో 40 శాతం రాయితీ ఇప్పించ‌నున్నారు. రాజ‌ధాని ప‌నుల కోసం వ‌చ్చే బ్యాచ్ ల‌కు టిక్కెట్లు, బ‌స ఏర్పాట్లు ప్ర‌భుత్వమే ఏర్పాటు చేస్తోంది. వారి త‌ర‌పున వ‌చ్చే ఇత‌ర వ్య‌క్తుల కోసం టూరిజం ముసుగులో ఈ ఏర్పాట్లు చేయ‌నున్నారు. ఇందుకోసం టూరిజం పేరును వాడుకొంటున్నారు.

తిరుమ‌ల శ్రీ‌వారికి సైతం ఇబ్బంది

సింగ‌పూర్ జ‌నం కానీ, ఇత‌ర ఎన్నారైలు కానీ తిరుమ‌ల ద‌ర్శ‌నాన్ని ప‌విత్రంగా భావిస్తున్నారు. మొన్న‌టికి మొన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని మంచి చేసుకొనేందుకు చంద్ర‌బాబు స్వ‌యంగా తిరుమ‌ల ల‌డ్డూల‌ను తీసుకొని వెళ్లి బ‌హుక‌రించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు తాజాగా విదేశీ ప‌ర్యాట‌కుల పేరుతో సింగ‌పూర్ త‌దిత‌ర దేశాల ప్ర‌తినిధుల‌కు తిరుమ‌ల‌లో ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ఏర్పాట్లు చేయిస్తున్నారు అవ‌స‌ర‌మైతే ప్ర‌తీరోజు 100 బ్రేక్ ద‌ర్శ‌నాలు కూడా తిరుమ‌ల‌లో పెట్టించేట్లుగా టూరిజం శాఖ త‌ర‌పున టీటీడీ మీద ఒత్తిడి చేయిస్తున్నారు.
మొత్తం మీద సింగ‌పూర్ కంపెనీల‌కు, ప్ర‌తినిధుల‌కు టూరిజం పేరుతో రాష్ట్రంలో రెడ్ కార్పెట్ ప‌రిచేందుకు అన్ని విధాలుగా స‌న్నాహాలు జ‌రిగిపోతున్నాయి.

Back to Top