ఫైబర్‌ గ్రిడ్‌ పేరుతో మరో అవినీతికి శ్రీకారం


ఈవీఎం ట్యాంపరింగ్‌ దోషి వేమూరిని అడ్డం పెట్టుకొని డ్రామాలు
అరాచకాలను చూపించే ఛానళ్లను, కేబుల్‌ ఆపరేటర్లను రోడ్డున పడేయాలనే కుట్ర
ఫైబర్‌ గ్రిడ్‌ మోసాలపై సుప్రీం కోర్టులో పిటీషన్‌ వేశా
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు: టెక్నాలజీ పేరుతో చంద్రబాబు, లోకేష్‌ మరో అవినీతికి తెరలేపారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. అతి తక్కువ ధరకే ఇంటర్‌నెట్, టీవీ ఛానళ్ల ప్రసారాలు అందిస్తామని చెప్పి వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గతంలో గౌరవ న్యాయస్థానంలో పిల్‌ వేయడం జరిగిందని చెప్పారు. ఫైబర్‌ గ్రిడ్‌ అవినీతిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు తక్కువ ధరలకు టెలిఫోన్‌ సౌకర్యం, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించవచ్చు.. కానీ టీవీ ఛానళ్లను నియంత్రించే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో జయలలిత కేసులో మద్రాస్‌ హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ కేసులో దోషిగా ఉన్న వేమూరి హరిప్రసాద్‌ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు ట్రాయ్‌ చట్టాన్ని తుంగలో తొక్కుతూ.. గౌరవ న్యాయస్థానాల తీర్పులను పట్టించుకోకుండా ఫైబర్‌ గ్రిడ్‌ పేరుతో మోసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
 
ప్రభుత్వ అరాచకాలను చూపిస్తున్న టీవీ ఛానళ్ల ప్రసారాలపై ఉక్కుపాదం మోపి.. కేబుల్‌ ఆపరేటర్లను రోడ్డున పడేయాలనే కుట్రతోనే చంద్రబాబు ఫైబర్‌ గ్రిడ్‌ను తెరపైకి తీసుకువచ్చారని ఆర్కే ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆర్థిక లావాదేవీల్లో భాగస్వామ్యుడిగా.. విదేశాలకు వెళ్లినప్పుడు తొత్తులా వ్యవహరిస్తున్న వేమూరి హరిప్రసాద్‌ లాంటి వ్యక్తికి కాంట్రాక్ట్‌లు అప్పగించి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. టీవీల సెటప్‌ బాక్స్‌లను సింగపూర్‌ నుంచి తీసుకువస్తే.. అవి నాసిరకంగా ఉన్నాయని మద్రాస్‌ పోర్టు అధికారులు నిలిపివేశారన్నారు. అంటే సెటప్‌ బాక్స్‌ల విషయంలో కూడా ఎంత అవినీతి చేస్తున్నారో అర్థం అవుతుందన్నారు. వేమూరి హరిప్రసాద్‌ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇచ్చి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొట్టేస్తున్నారని సుస్పష్టంగా అర్థం అవుతుందన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ మోసాలపై సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఈవీఎంల ట్యాంపరింగ్‌ల కేసులో ప్రధాన దోషిగా ఉన్న వేమూరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఫైబర్‌ గ్రిడ్, ఈవీఎంల ట్యాంపరింగ్‌తో చంద్రబాబు, లోకేష్‌ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోయడానికి పూనుకున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. 
Back to Top