మరో ఉద్యమం తప్పదు

రాయలసీమలో పుట్టి సీమకు తీరని అన్యాయం
కేవలం ఓ ప్రాంత ప్రయోజనాల కోసమే ఆర్భాటం
కేంద్రంతో కుమ్మక్కై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారు
అన్ని ప్రాంతాలతో సమానంగా సీమను అభివృద్ధి చేయాలి
లేకపోతే కడపనుంచే ఉద్యమానికి పునాదులు పడతాయి
ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు

వైయస్సార్ జిల్లాః చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషాలు మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరో ఉద్యమం తప్పని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎంతసేపు రాజధాని అంటూ ఓ ప్రాంత ప్రయోజనాల కోసమే పాకులాడుతూ,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తప్పులనే బాబు మళ్లీ కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. విభజన జరిగితే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఆనాడు సీమ వాసులంతా పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఆనాటి కేంద్రం, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ జిల్లాలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

ఎక్కడ ఏ సంఘటన జరిగినా రాయలసీమ ప్రజలను ద్రోహులుగా, రౌడీలుగా టీడీపీ నేతలు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమకు మెకన్జీ డిజైన్ ప్రకారం కృష్ణా జలాలు రావాల్సి ఉన్నా దొంగ రాజకీయం చేసి అభివృద్ధి చెందిన ప్రాంతానికి తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఉక్కు కోసం కడపవాళ్లు గళం విప్పి ప్రాణాలు కోల్పోయిన ఉదారభావం గల వారు రాయలసీమ వాసులను చెప్పారు. కాల్వగట్లపై నిద్రపోతామని మాటలు చెప్పడం తప్ప నీళ్లు ఇచ్చింది లేదు.  ఉద్యోగాలు ఇవ్వరు. హాస్పిటల్ లు , కాలేజీలు ఏవీ రాకుండా చేస్తూ... అన్నీ అమరావతిలో పెట్టమని చెప్పడం దారుణమన్నారు. కొత్త ప్రాజెక్ట్ లు కట్టడం లేదు. ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేయకుండా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  నిష్పత్తి ప్రకారం ఉద్యోగఅవకాశాలు కల్పించాలన్నారు.  అందరం కలిసి పోరాడి హక్కులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. 

వైయస్సార్ జిల్లాకు ఉక్కు పరిశ్రమ ఇస్తామన్నారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ఇంతవరకు ఏ ఒక్కటీ ఇచ్చిన పాపాన పోలేదని వారు ఫైర్ అయ్యారు. గతంలో కర్నూలు రాజధానిని కోల్పోయాం. తెలంగాణ నుంచి హైదరాబాద్ ను కోల్పోవడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో  ఓ ప్రాంతంలోనే అభివృద్ధిని కేంద్రీకరించాలనుకోవడం దుర్మార్గమన్నారు.  ప్రభుత్వ తీరు చూస్తుంటే మరో ఉద్యమానికి పునాది వేసేలా కనిపిస్తోందన్నారు. రాయలసీమ వాసులకు ఉద్యోగాల్లో సమాన ప్రతిపత్తి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని సూచించారు. 

ముఖ్యమంత్రి రాయలసీమలో పుట్టి, మరో ప్రాంతానికి ఇల్లరికం వెళ్లి అంతా అక్కడే అభివృద్ధి చేయాలనుకోవడం బాధాకరమన్నారు.  వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలని వైయస్సార్ ఎంతో కృషి చేశారని వారు గుర్తు చేశారు. సీమను సస్యశ్యామలం చేయాలని పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ను 44 వేల క్యూసెక్కులకు పెంచారని చెప్పారు. రాయలసీమకు ప్రయోజనం చేకూరుస్తున్నారని ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమ దానికి అడ్డుపడ్డారన్నారు. ఐనా,  అభివృద్ధికి నోచుకోని సీమను బాగు చేయాలన్న సంకల్పంతో వైయస్సార్ ముందుకు సాగారని చెప్పారు. 

ఈప్రాంత రైతులను ఆదుకునేందుకు ప్రాజెక్ట్ లకు నిధులు కేటాయించారని తెలిపారు. 85 పనులు కూడా పూర్తయ్యాయని తెలియజేశారు. కానీ ఆతర్వాత వచ్చినవారెవరూ వాటిని పట్టించుకోవడం లేదన్నారు. తొమ్మిదేళ్లలో  ఎన్ని ప్రాజెక్ట్ లకు ఏ మేరకు నిధులు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని బాబును డిమాండ్ చేశారు. గండికోటకు నీళ్లు ఇస్తామన్నారు. అది అతీగతి లేదు. ఇదే పంథా కొనసాగితే రాయలసీమ ఉద్యమానికి పునాదులు కడప నుంచే మొదలవుతాయన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా రాయలసీమను అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. 
Back to Top