అన్నపూర్ణ రాష్ట్రాన్ని దుర్భిక్షాంధ్రగా మార్చారు

ఏపీలో వ్యవసాయానికి శనిగ్రహం
రైతులకు ఉపయోగపడే ఆలోచన ప్రభుత్వానికి లేదు
రుణమాఫీ పేరుతో మోసం
ఎన్నికలపై ఉన్న ధ్యాస రైతులపై లేదు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉందని, అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని దుర్భిక్షాంధ్రగా మార్చారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈ మూడేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోతుందని, రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. రైతులకు ఉపయోగపడే ఒక్క ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయం గురించి తెలియని వ్యక్తిని వ్యవసాయ శాఖ మంత్రిగా చేశారని ఆక్షేపించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో వ్యవసాయానికి శనిగ్రహం పట్టుకుందన్నారు. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న వ్యక్తిని వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించారని విమర్శించారు.  సాగు ఏరియా తగ్గిపోయిందని, పంటలు ఎండిపోతున్నాయని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలపై ఉన్న ధ్యాస రైతులపై లేదని, పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడు లేడని విమర్శించారు.

రెయిన్‌గన్లు ఏమయ్యాయి? 
రాష్ట్రంలో రెయిన్‌గన్లతో కరువును పారద్రోలామని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు ఇప్పుడు ఆ రెయిన్‌గన్లు ఎక్కడ పెట్టారని నాగిరెడ్డి ప్రశ్నించారు. 2016–2017లో ఏపీలో 301 మండలాలు కరువు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. 12 లక్షల హెక్టార్లలో ఖరీఫ్, రబీలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందన్నారు. సాగు జరిగిన ప్రాంతాల్లో 10 లక్షల హెక్టార్లలో పంటలన్నీ ఎండిపోయాయన్నారు. ఇవన్నీ అధికారక లెక్కలే అని, అయితే ముఖ్యమంత్రి మాత్రం వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 14 శాతమని గొప్పులు చెబుతున్నారని విమర్శించారు. 2017–2018వ సంవత్సరంలో తీసుకుంటే ఇప్పటికే 241 కరువు మండలాలు ఉన్నట్లు తేలిందన్నారు. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిరేటు 16 శాతం ప్రకటిస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. 

దుర్భిక్షంగా రాయలసీమ
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ ప్రాంతం అత్యంత దుర్భిక్ష ప్రాంతంగా మారిపోయిందని ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. రాయలసీమలోని 234 మండలాల్లో 2014–15లో 155 కరువు మండలాలుగా ప్రకటించారని, 2015–2016లో 212 మండలాలు, 2016–2017లో 197 కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించిందని నాగిరెడ్డి గుర్తు చేశారు. సరాసరి 80 శాతం మండలాలు కరువుతో అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో ఇన్ని కరువు మండలాలు ఉన్నాయంటే ఎంతటి దుర్భిక్షం ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ఏడాది 152 కరువు మండలాలు ఉన్నాయని వివరించారు.

సంక్షోభంలో వ్యవసాయం
గతేడాది సాగు విస్తీర్ణం తగ్గి వ్యవసాయం సంక్షేభంలోకి వెళ్లిందని నాగిరెడ్డి తెలిపారు. ఆగస్టు 2, 2016 నాటికి 23,81, 210 హెక్టార్లలో సాగు జరిగిందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 2 నాటికి సాగు విస్తీర్ణం కేవలం 17,54,123 హెక్టార్లకు పడిపోయిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం  గతేడాది తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల హెక్టార్లు, ఈ ఏడాది 32 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ఆగస్టు 4 నాటికి గతేడాది 854 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణం ఉంటే, ఈ ఏడాది 875 లక్షల హెక్టార్లకు పెరిగిందన్నారు. దేశంలో, పక్క రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగినా ఏపీలో మాత్రం తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాణిజ్య పంటలు, నూనె గింజల సాగు కూడా గణనీయంగా పడపోయిందన్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాలో వ్యవసాయ సంక్షేభం నెలకొందన్నారు.అత్యధిక వర్షపాతం ఈ ఏడాది కృష్ణా జిల్లాలో ఉందన్నారు. కృష్ణా జిల్లాలో కూడా దయానీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమలో గతేడాది 8.13 లక్షల హెక్టార్లలో వేరు శనగ సాగు చేస్తే..ఈ ఏడాది కేవలం 3.50 హెక్టార్లకే పరిమితమైందన్నారు. మినుము, పెసర, వేరుశనగ పైర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. కంది, వరి ఎండుదశకు చేరాయన్నారు. 

రుణమాఫీ పేరుతో మోసం
రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు మోసం చేశారని నాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల రైతుల అకౌంట్లు ఎన్‌పీఏగా మారిపోయాయన్నారు. రుణాలు కట్టవద్దు అన్న చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారన్నారు. కనీసం 50 లక్షల మందికి కూడా సంస్థాగత రుణాలు అందడం లేదన్నారు. రుణాలు మాఫీ కాకపోగా, రైతులకు కొత్తగా రుణాలు పుట్టడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిందని, ఇప్పటికి నాలుగు విడతలుగా చెల్లించిందని తెలిపారు. ఏపీలో చంద్రబాబు చేసిన మోసం పక్కన బెడితే ఐదు ఇన్‌స్టాల్‌మెంట్లలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు, ఇప్పుడు నాలుగో ఖరీఫ్‌ సీజన్‌ జరుగుతున్నా ఇంతవరకు మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌ చెల్లించలేదని మండిపడ్డారు. దేశంలో ఎక్కడ చేయలేనట్లుగా రూ.24 కోట్లు రుణమాఫీ చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైర్‌ అయ్యారు. సీఎం పుణ్యమా అని 14 శాతం అపరాధ వడ్డీ చెల్లిస్తున్నారని తెలిపారు.

9 గంటల విద్యుత్‌ ఏదీ బాబూ?
టీడీపీ మేనిఫెస్టోలో వ్యవసాయానికి 9 గంటల నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని నాగిరెడ్డి గుర్తు చేశారు. ఇవాళ పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు విద్యత్‌ సరఫరా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం లోటు విద్యుత్‌తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పగలు నిరంతరాయంగా 9 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఏపీలో మిగులు విద్యుత్‌ ఉందని, పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో రండి అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారన్నారు. మీరిచ్చిన హామీ ప్రకారం రైతులకు ఎందుకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడం లేదని నిలదీశారు. 

ఎన్నికలే ముఖ్యమా?
కర్నూలు జిల్లాలో పంటలు ఎండిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న మంత్రులకు ఈ పంటలను పరిశీలించాలన్న ఆలోచనే లేదని నాగిరెడ్డి విమర్శించారు.  కర్నూలు జిల్లా రాయలసీమలోనే మెరుగు జిల్లా అని నాగిరెడ్డి అన్నారు. అయితే ఈ రోజు ఆ జిల్లాలో కూడా 75 వేల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నాయన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలంలో మినుము, పెసర, కంది పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. నంద్యాల పట్టణంలోనే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి, మరో పది మంది కేబినెట్‌ మంత్రులు అక్కడే ఉన్నారన్నారు. కనీసం ఈ రోజుకు ఎండిపోయిన పంటలను పరిశీలించలేదన్నారు. గణనీయంగా వ్యవసాయ వృద్ధి రేటు సాధిస్తున్నామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రులకు ఇదేనా చెప్పిందని నిలదీశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎన్యుమరేషన్‌ చేయాలని, పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కనీసం వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఫీల్డ్‌ కు వెళ్లడం లేదని విమర్శించారు. రెయిన్‌గన్లతో కరువును జయించామన్న చంద్రబాబుకు ఇవాళ ఇన్ని లక్షల హెక్టార్లలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. మీ రెయిన్‌గన్లు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రకృతిని వడిసిపట్టుకుందామని ఇటీవల సీఎం చెప్పారని, మీరు ఒడిసి పట్టుకున్న రుతుపవనాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ రుతుపవనాలను సింగపూర్‌కు ఏమైనా ప్రశ్నించారా అని నాగిరెడ్డి నిలదీశారు. 
Back to Top